ట్రెండ్ ను ఫాలో అవుతున్న పీపుల్స్ స్టార్.. 40ఏళ్ల కట్టుబాట్లను తెంచుకుంటూ!
ఇప్పుడు పీపుల్స్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ఆర్. నారాయణమూర్తి కూడా 40 ఏళ్ల కట్టుబాట్లను తెంచుకొని తన సినిమా కోసం ఒక అడుగు ముందుకు వేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.;
సాధారణంగా ఏ రంగంలో అయినా సరే ముందుకు వెళ్లాలి.. అందరి దృష్టిలో పడాలి.. అంటే కచ్చితంగా మన కట్టుబాట్లను తెంచుకొని తీరాల్సిందే. లేదు మేము ఇలాగే ఉంటాము అని మొండిపట్టు పడితే మాత్రం అది కొంతకాలం వరకు పనిచేసినా.. ఆ తర్వాత ధోరణి పూర్తిగా మారిపోతుంది. మిగతా రంగాల సంగతి పక్కన పెడితే.. ఇక్కడ సినీ ఇండస్ట్రీలో మాత్రం ఆడియన్స్ ఆలోచనలను దృష్టిలో పెట్టుకోవాలని.. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు చేస్తున్న పనులను చూస్తే అర్థమవుతుంది. ఉదాహరణకు నయనతార.. సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఒకప్పుడు సినిమా చేసింది అంటే ప్రమోషన్స్ కి రాదు.. తాను చెప్పిన కండిషన్స్ దర్శక నిర్మాతలు ఒప్పుకొని తీరాల్సిందే. అలా ఉంటేనే సినిమాలు చేస్తుంది.. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 157 కోసం తన కట్టుబాట్లను తెంచుకొని మరీ ప్రమోషన్స్ కి హాజరయింది. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా తగ్గించుకొని ఆశ్చర్యపరిచింది.
కట్టుబాట్లు తెంచేసిన ఆర్.నారాయణమూర్తి..
ఇప్పుడు పీపుల్స్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ఆర్. నారాయణమూర్తి కూడా 40 ఏళ్ల కట్టుబాట్లను తెంచుకొని తన సినిమా కోసం ఒక అడుగు ముందుకు వేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. విప్లవాత్మక చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచారు ఆర్. నారాయణ మూర్తి. ఈయన పేరు కాదు శక్తి అని, డబ్బుతో ఈయనను కొనలేరు అని, ఎన్నోసార్లు నిరూపించారు కూడా.. ముఖ్యంగా చాలామంది బడా దర్శక నిర్మాతలు తమ సినిమాలలో ఈయనకు అవకాశం కల్పించాలని, భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా.. నారాయణమూర్తి మాత్రం అంగీకరించలేదు. వ్యక్తిత్వానికి మారుపేరుగా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. 4 దశాబ్దాల క్రితం ఎలా అయితే ఇండస్ట్రీకి వచ్చారో.. ఇప్పటికీ కూడా అవే చెప్పులు..అదే ఆటో.. అవే ఫ్యాంటు షర్టు అంటూ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా ఈయనపై ప్రశంసలు కురిపించారు.
యూనివర్సిటీ సినిమా కోసం..
అలాంటి ఈయన తాజాగా చాలాకాలం తర్వాత మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే 'యూనివర్సిటీ పేపర్ లీక్'. ఇందులో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా రచన, దర్శకత్వం, నిర్మాత, సంగీతం కూడా ఆయనే స్వయంగా సమకూరుస్తున్నారు. ఆగస్టు 22వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రాన్ని సామాజిక నాటకంగా తీర్చిదిద్దారు ఆర్.నారాయణ మూర్తి. వాస్తవానికి లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే ఈయన తన సినిమా విడుదల సమయంలో కూడా పెద్దగా వాటిని ప్రమోట్ చేయరు. అయితే ఈసారి మాత్రం తన సాధారణ శైలికి భిన్నంగా గత కొన్ని రోజులుగా ఈ యూనివర్సిటీ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వేగంగా పావులు కదుపుతున్నారు.
కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన ఆర్.నారాయణమూర్తి..
ముఖ్యంగా తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి సోషల్ మీడియాలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆర్ నారాయణ మూర్తి. ఈ మేరకు వరుస ప్రమోషన్లు చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ యూనివర్సిటీ సినిమాను ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన నారాయణమూర్తి ఇప్పుడు ఇలా అందరిలోకి వస్తుండడంతో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పవచ్చు. అంతేకాదు ఇతర చిత్రాలలో కూడా కీలక పాత్రలలో నటించాలని ఆశిస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు నారాయణమూర్తి ఇకపై మిగతా హీరోల చిత్రాలలో నటిస్తారేమో చూడాలి.
యువతే టార్గెట్..
యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుత సమాజంలో తెలుగు మీడియం విద్యార్థులకు జరుగుతున్న సామాజిక అన్యాయాన్ని ఈ యూనివర్సిటీ కథ వివరిస్తుంది. విద్యార్థుల గురించి మాట్లాడి, వారి దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో తీసిన ఈ సినిమా.. ఖచ్చితంగా యువతకు చేరువవుతుందని, అయితే దీనిని యువతలోకి తీసుకెళ్లాలంటే సోషల్ మీడియా కంటే శక్తివంతమైన ప్లాట్ఫామ్ మరొకటి లేదు అని గ్రహించారేమో అందుకే నారాయణమూర్తి ఈ సినిమాను చాలా వేగంగా, చురుకుగా ప్రమోట్ చేస్తున్నారని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి కట్టుబాట్లను తెంచుకొని ముందుకొస్తున్న నారాయణమూర్తికి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.