భార్య అడిగిన ప్రశ్న మాధవన్ జీవితాన్నే మార్చేసింద‌ట‌!

1991లో కొల్హాపూర్‌లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు నిర్వహిస్తున్న టైమ్ లో సరితతో మాధవన్‌కు పరిచయం ఏర్పడింది.

Update: 2026-06-02 10:30 GMT

సినీ పరిశ్రమలో స్టార్‌డమ్, గ్లామర్, విజయాలు ఎంత వేగంగా వస్తాయో, ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో సంబంధాలు అంతే వేగంగా దెబ్బతినే సందర్భాలు కూడా కనిపిస్తుంటాయి. కానీ కొన్ని జంటలు మాత్రం కాలానికి అతీతంగా నిలిచి ప్రేమ, గౌరవం, నమ్మకానికి నిర్వచనంగా మారుతాయి. అలాంటి అరుదైన జంటల్లో మాధవన్, ఆయన భార్య సరిత బిర్జే ఒకరు. 56వ పుట్టినరోజు జరుపుకుంటున్న మాధవన్ గురించి అభిమానులు గ్రీన్ ఫ్లాగ్ హీరో అని చెప్పడానికి కారణం ఆయన సినిమాలు మాత్రమే కాదు, ఆయ‌న తన వైవాహిక జీవితాన్ని నడిపించిన తీరు కూడా.

1991లో కొల్హాపూర్‌లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు నిర్వహిస్తున్న టైమ్ లో సరితతో మాధవన్‌కు పరిచయం ఏర్పడింది. అప్పట్లో ఎయిర్ హోస్టెస్ కావాలనే లక్ష్యంతో ఉన్న సరిత, మాధ‌వ‌న్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నారు. టీచ‌ర్- స్టూడెంట్ బాండింగ్ దూరం పాటించిన మాధవన్, ఆమె జాబ్ వ‌చ్చిన తర్వాత కృతజ్ఞతగా ఇచ్చిన డిన్నర్ ఆహ్వానాన్ని స్వీకరించారు. అదే డిన్నర్ ఇద్దరి జీవితాలను మార్చేసింది. ఎనిమిదేళ్ల ప్రేమ తర్వాత 1999లో పెళ్లి చేసుకున్న ఈ జంట, నేటికీ అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

తమ బంధం బలంగా నిలవడానికి కారణం ప్రేమ కంటే ఎక్కువగా పరస్పర గౌరవమేనని మాధవన్ అనేక సందర్భాల్లో చెప్పారు. సరితకు తాను స్టార్ కాద‌ని, తనతో ప్రేమలో పడిన వ్యక్తిని మాత్రమేన‌ని, ఆమెను సమాన భాగస్వామిగా చూస్తాన‌ని ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. భార్యను ప్రత్యేకంగా భావించడమే కాకుండా, తన లైఫ్ లో వచ్చిన ప్రతి స‌క్సెస్‌కు ఆమెనే కారణమని బహిరంగంగానే చెబుతుంటారు.

మాధవన్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో మరో కీలక మలుపు డైరెక్ట‌ర్ మణిరత్నం ఇచ్చిన సలహాతో వచ్చింది. షూటింగ్స్ టైమ్ లో ఫ్యామిలీకి దూరంగా ఉండటం రిలేష‌న్స్ ను దెబ్బతీయవచ్చని సూచించిన మణిరత్నం మాటలను ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. అప్పటి నుంచి సాధ్యమైనంత వరకు సరితను తనతో పాటూ షూటింగ్‌లకు తీసుకెళ్లేవార‌ట‌. గ్లామర్ ప్రపంచంలో ఎదురయ్యే ఆకర్షణలకు దూరంగా ఉండటమే కాకుండా, దాంపత్య బంధాన్ని మరింత బలపర్చడంలో ఆ నిర్ణయం కీలక పాత్ర పోషించిందని మాధ‌వ‌న్ చెప్తుంటారు. అయితే మాధవన్ జీవితాన్ని నిజంగా మార్చింది సరిత అడిగిన ఒక ప్రశ్న అని చెప్పాలి. ఒక దశలో వ‌ర్క్ పై తన దృక్పథం మారిపోయిందని గమనించిన ఆమె, నీకు ఏమైంద‌ని ప్రశ్నించింద‌ని, నువ్వు పని చేయడానికి వెళ్లడం కాదు, అక్కడి నుంచి తిరిగి రావడానికి వెళ్తున్నట్టు కనిపిస్తున్నావ‌ని చెప్పిన ఆ మాటలు తనను లోతుగా ఆలోచింపజేశాయని మాధవన్ వెల్లడించారు. ఆ ఇన్సిడెంట్‌ తర్వాతే ఆయన కెరీర్, వ్యక్తిగత జీవితంలో స‌మ‌తుల్య‌త గురించి మరింత శ్రద్ధ పెట్టారని పేర్కొన్నారు.

నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మాధవన్, కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చారు. 2005లో జన్మించిన కుమారుడు వేదాంత్ ఈరోజు భారతదేశానికి పతకాలు సాధిస్తున్న ఈతగాడిగా ఎదగడం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. స్టార్ హీరోగా విజయాలు సాధించిన మాధవన్, తండ్రిగా, భర్తగా కూడా ఆదర్శంగా నిలవగలిగారు. గ్లామర్ ప్రపంచంలో అనేక సంబంధాలు కాలపరీక్షలో విఫలమవుతున్న తరుణంలో, 33 ఏళ్ల పరిచయం, 27 ఏళ్ల వివాహ బంధాన్ని ప్రేమతో, గౌరవంతో కొనసాగిస్తున్న మాధవన్ కథ మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. అందుకే అభిమానులు ఆయనను కేవలం రొమాంటిక్ హీరోగానే కాకుండా, రియ‌ల్ లైఫ్ లోనూ గ్రీన్ ఫారెస్ట్‌గా అభివర్ణిస్తున్నారు.

Tags:    

Similar News