నాలుగేళ్లు ఇంజనీరింగ్ ఎందుకు చదవాలి? ఇంట్రెస్టింగ్ బయోపిక్!
ప్రమోషన్లలో భాగంగా మాధవన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బయోపిక్‌లకు, వైవిధ్యమైన పాత్రలు- కథాంశాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే జాతీయ ఉత్తమ నటుడు ఆర్. మాధవన్ మరో అద్భుతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారతీయ అగ్రశ్రేణి ఆవిష్కర్త, ప్రముఖ సైంటిస్ట్ జి.డి. నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ బయోపిక్ GDN లో మాధవన్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొనగా..17 జూలై 2026 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ప్రమోషన్లలో భాగంగా మాధవన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు. ఈ జనరేషన్‌కు అసలు జీడీ నాయుడు లాంటి గొప్ప విజనరీ కథను ఎందుకు పరిచయం చేయాలో.. ఈ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుందో ఆయన ఎంతో వివరంగా తెలిపారు. జి.డి. నాయుడు కేవలం ఒక శాస్త్రవేత్త లేదా ఆవిష్కర్త మాత్రమే కాదని.. ఆయన కాలం కంటే ఎంతో ముందున్న ఒక అద్భుతమైన దార్శనికుడు అని మాధవన్ ఈ సందర్భంగా కొనియాడారు.
జీడీ నాయుడు బహుముఖ ప్రజ్ఞను గుర్తుచేస్తూ.. ``ఆయన ఒక గొప్ప పరోపకారి, వృక్షశాస్త్రజ్ఞుడు, పత్తి సాగు చేసిన వ్యవసాయ నిపుణుడు. వందేళ్ల క్రితమే ఆయన మహిళా విద్య గురించి.. దేశ స్వాతంత్య్రం గురించి ఎంతో ఆరాటపడ్డారు. ఆ కాలంలో తమిళ ప్రజల ప్రగతి కోసం ఆయన చేయాలనుకున్న మంచి పనులను..ఆలోచనలను మనం వందేళ్ల తర్వాత ఇప్పుడు అమలు చేస్తున్నాం. అందుకే ఇంతటి మహోన్నతమైన వ్యక్తి బయోపిక్‌లో భాగం కావాలని నేను బలంగా అనుకున్నాను`` అని మాధవన్ తన ఇన్‌స్పిరేషన్‌ను షేర్ చేసారు.
నేటి విద్యావ్యవస్థకు, యువతకు జీడీ నాయుడు ఆలోచనలు ఎంతో అవసరమని చెప్తూ.. ఆయన ఆ కాలంలోనే ప్రాక్టికల్ మైండ్‌సెట్‌తో విద్యావిధానాన్ని ప్రశ్నించారని మాధవన్ గుర్తుచేశారు. ``నాలుగేళ్లు ఇంజనీరింగ్ ఎందుకు చదవాలి? పాలిటెక్నిక్‌లో వచ్చే ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను రెండేళ్లలోనే నేర్చుకోవచ్చు కదా అని ఆయన ఆనాడే ప్రశ్నించారు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చాక, మనం ప్రతిదీ బట్టీపట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు... ప్రాక్టికల్‌గా ఏది అవసరమో అది నేర్చుకుంటే చాలని మనకు అర్థమవుతోంది. ఆయనకు అవార్డులు, రత్నాలు రావడం పక్కన పెడితే.. కనీసం ఆయన గురించి ఈ సమాజానికి తెలియడం చాలా ముఖ్యం`` అని వ్యాఖ్యానించారు.
యువతకు కేవలం ఒక చిన్న స్పార్క్ (స్ఫూర్తి) ఇస్తే చాలు.. వారే రీసెర్చ్ చేసి విషయాలు తెలుసుకుంటారని మాధవన్ ధీమా వ్యక్తపరిచారు. కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహించిన ఈ ఇంట్రెస్టింగ్ బయోపిక్ జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల కోవై (కోయంబత్తూర్)లో ఒక ఫ్లైఓవర్‌కు జీడీ నాయుడు పేరు పెట్టడం ద్వారా ఆయనకు దక్కాల్సిన గుర్తింపునకు పునాది పడిందని..ఈ చిత్రం విడుదలయ్యాక భారతదేశం అంతా ఆయన గురించి తెలుసుకుని.. రేపు దేశంలోని స్కూల్ సిలబస్‌లో ఆయన కథను చేర్చినప్పుడే ఈ సినిమా నిజమైన విజయం సాధించినట్లవుతుందని మాధవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.