విజయ్ చివరి సినిమాకు A సర్టిఫికెట్.. సినిమాలో అంత వయొలెన్స్ ఉందా?
తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC) ఈ సినిమాకు A సర్టిఫికెట్ ను జారీ చేసింది.
కోలీవుడ్ స్టార్ హీరోగా ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించిన విజయ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఆఖరి సినిమా జన నాయగన్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకోవడం చిత్రబృందానికి కీలక మైలురాయిగా మారింది.
తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC) ఈ సినిమాకు A సర్టిఫికెట్ ను జారీ చేసింది. సీబీఎఫ్‌సీ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ 183 నిమిషాలుగా తెలుస్తోంది. అంటే మూడు గంటల మూడు నిమిషాలుగా నమోదైంది. అయితే సెన్సార్ సభ్యులు చిత్రయూనిట్‌కు ఎలాంటి సవరణలను సూచించారు? ఏ సీన్స్ లో మార్పులు జరిగాయనే వివరాలు మాత్రం ఇంకా అఫీషియల్ గా తెలియలేదు. దీంతో సినిమా కంటెంట్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.
వాస్తవానికి జన నాయగన్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది. గతేడాది చివర్లోనే సినిమాకు సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ, పర్మిషన్స్ ఆలస్యమవడంతో రిలీజ్ డేట్ మారాల్సి వచ్చింది. ఇదే టైమ్ లో విజయ్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో జన నాయగన్ చుట్టూ రాజకీయ, సినీ వర్గాల్లో మరింత చర్చ జరిగింది. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను జూలై 24, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నిర్మాతలు, విదేశీ డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇదే డేట్ ను ఇప్పటికే చెప్పారని సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్‌తో పాటు ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇటీవల ఈ సినిమాకు A సర్టిఫికెట్ రావడానికి రీజన్ సినిమాలోని యాక్షన్ సీన్స్, వయొలెన్స్ అంశాలేననే ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను మేకర్స్ గతంలో ఖండించారు. బోర్డు సూచించిన కొన్ని మార్పులు చేసిన తర్వాతే సినిమాను మళ్లీ సెన్సార్‌కు పంపిస్తామని అప్పట్లో అన్నారు. కానీ చివరకు అదే A సర్టిఫికెట్‌తో సినిమా క్లియరెన్స్ పొందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, మమితా బైజు కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. విజయ్- అనిరుధ్ కాంబినేషన్‌లో వచ్చిన గత సినిమాల మ్యూజిక్ భారీ సక్సెస్ ను అందుకోవడంతో జన నాయగన్ ఆల్బమ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పైనా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. హీరోగా విజయ్ సినీ ప్రయాణానికి ముగింపు పలికే సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అన్న ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది.