మళ్లీ పాత ఫార్ములాకు టాలీవుడ్.. లాభమా? నష్టమా?
అలా నిడివి విషయంలో నిర్మాతలు ఆ ఫార్ములా ఫాలో అయ్యారు.. అవుతున్నారు.. అయితే ఇప్పుడు రన్ టైమ్ ఫార్ములా మళ్లీ పాత రోజులకు వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.;
టాలీవుడ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సౌత్ తోపాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినీ పరిశ్రమ స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇప్పటికే ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న టాలీవుడ్ లో ఇప్పుడు మళ్లీ పాత ఫార్ములా రిపీట్ ను చేస్తున్నారు నిర్మాతలు. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.
నిజానికి.. ఏ సినిమాకు అయినా రన్ టైమ్ కీలక అంశం. దానిపై మేకర్స్ కచ్చితంగా ప్రత్యేక దృష్టి పెడతారు. అయితే కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ సినిమాల నిడివి 3-4 గంటల మధ్య ఉండేది. చాలా చిత్రాలు ఆ రన్ టైమ్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుని హిట్స్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి.
అయితే ఆ తర్వాత రన్ టైమ్ విషయంలో పెద్ద మార్పు ఏర్పడింది. ఎందుకంటే మూడు గంటల కన్నా తక్కువ నిడివితోనే రిలీజ్ అవుతున్నాయి. సుమారు 2 గంటల 30 నిమిషాల నుండి 2 గంటల 45 నిమిషాల నిడివితోనే వచ్చాయి.. వస్తున్నాయి.. మూడు గంటలకు పైగా రన్ టైమ్ తో వచ్చిన సినిమాలు.. వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చేమో.
అలా నిడివి విషయంలో నిర్మాతలు ఆ ఫార్ములా ఫాలో అయ్యారు.. అవుతున్నారు.. అయితే ఇప్పుడు రన్ టైమ్ ఫార్ములా మళ్లీ పాత రోజులకు వెళ్లినట్లు
స్పష్టంగా కనిపిస్తోంది. కొంతకాలంగా భారీ రన్ టైమ్ తోనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అంత నిడివి అంటే వెనక్కి తగ్గే నిర్మాతలు.. ఇప్పుడు మూడు గంటలకుపైగా నిడివితోనే రిలీజ్ చేస్తున్నారు.
ముఖ్యంగా కంటెంట్ ఉంటే రన్ టైమ్ తో రిజల్ట్ కు సంబంధం లేదని ప్రూవ్ చేస్తున్నారు. ఇటీవల యానిమల్, పుష్ప-2 సహా వివిధ సినిమాలు.. మూడు గంటలకు పైగా రన్ టైమ్ తో విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. దీంతో ఇప్పుడు నిర్మాతలు మళ్ళీ భారీ రన్ టైమ్ ఫార్ములా వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్న రాజా సాబ్, జననాయకుడు సినిమాలు కూడా భారీ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అయితే ఇందులో లాభం, నష్టం సమానంగా ఉన్నాయని సినీ ప్రియులు చెబుతున్నారు. ఎందుకంటే కంటెంట్ బాగుంటే.. ఈజీగా భారీ రన్ టైమ్ మూవీ అయినా సినీ ప్రియులు చూసేస్తారు. కానీ ఆకట్టుకునేలా లేకుంటే విమర్శలు కచ్చితంగా వస్తాయి. ఏదేమైనా కంటెంట్ ముఖ్యం బిగిలూ..