పూరీసేతుపతి టైటిల్ &టీజర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్.. ఏమైందంటే?

ఈరోజు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను అలాగే టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారిక పోస్టర్ కూడా విడుదల చేశారు.;

Update: 2025-09-28 06:37 GMT

జగన్నాథ్ ఒకప్పుడు పలువురు స్టార్ హీరోలకు మంచి సక్సెస్ అందివ్వడమే కాకుండా వారి కెరియర్ కు పునాదులు కూడా వేశారు. అలాంటి ఈయన గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఆయన ఎంతోమందికి అండగా నిలిచారు. అయితే ఇలాంటి సమయంలో ఆయనకు సపోర్టుగా ఏ ఒక్క హీరో రాలేదని ఇప్పటికే అభిమానులు పలు రకాల కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు పవర్ ఫుల్ కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు పూరీ జగన్నాథ్.

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ఒక సినిమా ప్రకటించారు. #పూరీసేతుపతి అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు కూడా. ఈరోజు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను అలాగే టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారిక పోస్టర్ కూడా విడుదల చేశారు. పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా అనగా సెప్టెంబర్ 28న చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్ లో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు టైటిల్ , టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు కూడా.

ఈ సినిమా టీజర్ కోసం అలాగే ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారనే ఆసక్తికరమైన అంశాలు అభిమానులలో నెలకొన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తూ టీం అధికారికంగా ప్రకటించింది.ఈ మేరకు" సెప్టెంబర్ 27వ తేదీన తమిళనాడు కరూరులో టీవీకే సభలో జరిగిన దుర్ఘటన కారణంగా ఈరోజు చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్ లో జరగాల్సిన పూరీ సేతుపతి టైటిల్ , టీజర్ లాంచ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తున్నాము. త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తాం" అంటూ మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికైతే టీవీకే సభలో జరిగిన తొక్కిసలాట కారణంగా విషాదం చోటు చేసుకోగా ఆ విషాదకర ఘటనను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చిత్ర బృందం ఈవెంట్ ను క్యాన్సిల్ చేసినట్లు సమాచారం.

అసలు విషయంలోకెళితే.. 2026 లో తమిళనాడులో జరగబోయే ఎన్నికలలో పోటీ చేయడానికి ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఆయన సొంతంగా టీవీకే అనే పార్టీని ప్రారంభించి ఇప్పటినుంచే ర్యాలీలు నిర్వహిస్తూ పార్టీని ప్రజలలో బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 27వ తేదీన తమిళనాడులోని కరూర్ లో ప్రసంగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీవీకే కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఊహకు మించిన ప్రజలు అక్కడికి చేరుకోవడంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.

దీంతో తొక్కిసలాట జరిగింది. అందులో సుమారుగా 39 మంది మరణించినట్లు సమాచారం. మృతులలో పదిమంది చిన్నారులు, 18 మంది మహిళలు ఉండడం గమనార్హం. ఇక 50 మందికి పైగా గాయపడ్డారని.. వారిని సమీప హాస్పిటల్ కి తరలించినట్లు తెలుస్తోంది.. ఇక ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News