ఆ రెండు సంఘటనలే స్లమ్ డాగ్ కు ప్రేరణ
టీజర్ లాంచ్ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్‌లో అత్యంత కీలకమైన సినిమాల్లో ఒకటిగా మారుతున్న స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్ తాజాగా విడుదలైన టీజర్‌తో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ లాంచ్ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ముఖ్యంగా ఈ సినిమా రెండు నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిందని ఆయన వెల్లడించడం విశేషంగా నిలిచింది.
స్లమ్‌డాగ్ రెండు రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిన కథ అని, ఎక్కడికీ వెళ్లలేని, ఆశ్రయం లేని మనుషుల జీవితాల గురించి ఈ సినిమా మాట్లాడుతుందని పూరీ జగన్నాథ్ చెప్పడం గమనార్హం. సాధారణంగా మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్లకు పేరుగాంచిన పూరీ, ఈసారి ఎమోషన్స్ కు పెద్దపీట వేసినట్లు ఆయన మాటలు, టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. కథలోని కొన్ని సీన్స్ ఆడియన్స్ కు తప్పక కన్నీళ్లు తెప్పిస్తాయని ఆయన చెప్పడం సినిమాలోని ఎమోషనల్ డెప్త్‌ను సూచిస్తోంది. సమాజంలో అట్టడుగు వర్గాలుగా మిగిలిపోయిన వారి ఆవేదన, జీవన పోరాటం, ఆశలు- నిరాశల మేళవింపుతో ఈ కథ సాగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి పూరీ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయ్ సేతుపతి కళ్లతోనే భావాలను వ్యక్తపరచగల అరుదైన నటుడని, ఈ సినిమాలో ఆయన చూపించిన ఇంటెన్స్, ఎమోషన్ అసాధారణమంటూ ప్రశంసలు కురిపించారు. మరోవైపు విజయ్ సేతుపతి కూడా పూరి జగన్నాథ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. పూరి జగన్నాథ్ భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గొప్ప కథకుడని, తానెప్పుడూ మంచి కథలను మాత్రమే నమ్ముతానని, స్లమ్‌డాగ్ అలాంటి కథేనని సేతుపతి అన్నారు. యాక్షన్‌తో పాటు భారీ ఎమోషన్స్ కలిగిన ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంతా భావిస్తున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్‌ను కేవలం మరో సినిమా కోణంలో మాత్రమే చూడటం సరైంది కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య పూరీ జగన్నాథ్ కెరీర్‌లో ఆశించిన స్థాయి విజయాలు దక్కని నేపథ్యంలో స్లమ్‌డాగ్ ఆయనకు అత్యంత కీలకమైన సినిమాగా మారింది. కథ ఎంపిక నుంచి పాత్రల రూపకల్పన వరకు ఈసారి ఆయన పూర్తిగా భిన్నమైన దృక్పథంతో ముందుకెళ్లినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మిల్లీనియల్స్ కంటే Gen-Z మరింత ఎమోషనల్ అంటూ యూత్ ను ఉద్దేశించి పూరీ చేసిన కామెంట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నేటి యువత తమ ఎమోషన్స్ ను బలంగా అనుభవిస్తారని, ఈ కథ వారిని కచ్చితంగా తాకుతుందని పూరి నమ్మకం వ్యక్తం చేశారు. యాక్షన్, ఎమోషన్, సామాజిక వాస్తవాలు, రియల్ ఇన్సిడెంట్స్ మేళవింపుతో వస్తున్న స్లమ్‌డాగ్ పూరి జగన్నాథ్‌కు కంబ్యాక్ మూవీగా నిలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.