రిలీజ్ చివరి నిమిషం వరకూ చెక్కుతూ కూచుంటే కుదరదు!
అయితే ఇటీవల కాలంలో సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నా.. ఆఖరి నిమిషం వరకు రీ-టేక్‌లు తీసుకోవడం, పోస్ట్ ప్రొడక్షన్ - విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులను ఆలస్యం చేయడం కొందరు దర్శకులకు అలవాటుగా మారింది.
సినిమా నిర్మాణం - విడుదల ప్రక్రియలో సమయపాలన అనేది అత్యంత కీలకమైన అంశం. అయితే ఇటీవల కాలంలో సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నా.. ఆఖరి నిమిషం వరకు రీ-టేక్‌లు తీసుకోవడం, పోస్ట్ ప్రొడక్షన్ - విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులను ఆలస్యం చేయడం కొందరు దర్శకులకు అలవాటుగా మారింది. ఈ ధోరణి వల్ల చిత్ర నిర్మాతలు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవ్వడమే కాకుండా..థియేట్రికల్ - డిజిటల్ బిజినెస్ ప్రమాదంలో పడుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోలు వేదికలపై బహిరంగంగానే దర్శకుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరి నిమిషం వరకు పూర్తి ఔట్‌పుట్ ఇవ్వకపోవడం వల్ల థియేటర్లలో సరైన క్వాలిటీతో సినిమాను అందించలేకపోతున్నామని.. దీనివల్ల దర్శకుడి కంటే నిర్మాతలే ఎక్కువ నష్టపోతున్నారని వారు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల ఒక సినీ వేదికపై మెగాస్టార్ చిరంజీవి- అక్కినేని నాగార్జున ఈ అంశంపై అత్యంత ఘాటుగా స్పందించారు. ఈ ఇద్దరు అగ్ర హీరోలు చేసిన వ్యాఖ్యలు కేవలం విమర్శలుగా కాకుండా.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎలా ముందడుగు వేయాలనే దానిపై చేసిన లోతైన విశ్లేషణగా నిలిచాయి. నాగార్జున ప్రధానంగా టైమ్ మేనేజ్‌మెంట్ - పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుతూ.. సినిమా విడుదల తేదీకి కనీసం రెండు వారాల ముందే ఎడిటింగ్ పనులను పూర్తి చేసి సాంకేతిక బృందానికి అందిస్తే... వారు దాన్ని మరింతగా చెక్కి అద్భుతమైన క్వాలిటీతో ముందుకు తీసుకువెళ్తారని చెప్పారు. ఈ క్రమంలో ఆయన ఆత్మపరిశీలన చేసుకుంటూ.. గతంలో తమ `నిన్నే పెళ్ళాడుతా`, `అన్నమయ్య` చిత్రాల ఫైనల్ కాపీలను నెల రోజుల ముందే చూసుకునేవాళ్లమని.. ఇటీవల `లేనిన్` సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడం వల్లే రీలీజ్ వాయిదా పడిందని ఓపెన్‌గా అంగీకరించారు.
మరొకవైపు మెగాస్టార్ చిరంజీవి ఓ వేదికపై మరింత ఘాటుగా స్పందిస్తూ.. దర్శకులు తీసుకోవాల్సిన బాధ్యతలపై స్పష్టత ఇచ్చారు. ఒక దర్శకుడికి కేవలం హిట్ ఇవ్వడం లేదా అద్భుతమైన కథ చెప్పడం మాత్రమే బాధ్యత కాదని... అనుకున్న బడ్జెట్ లో చెప్పిన సమయంలోనే సినిమా తీసి `నిర్మాతను బతికించడం` అనేది దర్శకుడి మొదటి విజయంగా భావించాలని స్పష్టం చేశారు. ఓవర్ ఖర్చుతో కూడిన కొత్త టెక్నాలజీలు... కెమెరాల వెనక పడకుండా ఉన్న సాధారణ వనరులతోనే కథలోని పవర్‌తో గొప్ప సినిమా తీయగలగాలని సూచించారు. సీన్ల విజువలైజేషన్.. ఎడిటింగ్ నాలెడ్జ్ సరిగ్గా ఉండాలని.. ఒకే షాట్ కోసం పదే పదే రీ-టేక్‌లు తీస్తూ నటులను అలసిపోయేలా చేయడం .. ప్రొడ్యూసర్ డబ్బును వృథా చేయడం సరికాదన్నారు. అయితే బాహుబలి, పొన్నియిన్ సెల్వన్ వంటి భారీ ప్రాజెక్టులకు ఎక్కువ సమయం, బడ్జెట్ పట్టడం మినహాయింపు అని ఆయన పేర్కొన్నారు.
అసలు సినిమా బాగుండి నిర్మాతలు లాభపడితేనే ఇండస్ట్రీలోని బడుగు జీవులైన సినీ కార్మికులందరూ బాగుంటారని... ఆ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా `కెప్టెన్ ఆఫ్ ది షిప్` అయిన దర్శకులపైనే ఉందని ఇద్దరు హీరోలు స్పష్టం చేశారు. చివరి నిమిషం వరకు చెక్కుతూ కూర్చోవడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ టీమ్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగి ఔట్‌పుట్ నాణ్యత దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి దర్శకుడు సమయపాలనను ఒక బాధ్యతగా గుర్తించినప్పుడే థియేటర్లలో ప్రేక్షకులకు నాణ్యమైన సినిమా అందుతుందని వారు గట్టిగా స్పష్టం చేశారు.
చివరగా ఈ వ్యాఖ్యలను మీడియా ఏ ఒక్కరినో ఉద్దేశించి చేసిన వ్యక్తిగత విమర్శలుగా ప్రొజెక్ట్ చేయవద్దని.. మొత్తం సినీ పరిశ్రమ క్షేమం కోసం అన్న మాటలుగా మాత్రమే చూడాలని హీరోలు కోరారు. మొత్తానికి ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా చిరంజీవి-నాగార్జున ఇద్దరూ కూడా నిర్మాతల ఆర్థిక భద్రత, దర్శకుల ప్రణాళికాబద్ధమైన పనితీరు ఇండస్ట్రీకి ఎంత అవసరమో చాలా ధైర్యంగా, విశ్లేషణాత్మకంగా వివరించి అందరికీ ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.