ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. వారికే అంకితం - నిర్మాత

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ చిత్ర బృందం నిర్వహించగా.. ఇందులో నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమా వారికే అంకితం అంటూ కామెంట్లు చేశారు.;

Update: 2025-11-06 08:09 GMT

ప్రముఖ యంగ్ హీరో తిరువీర్ గతంలో పలాస, మసూద, పరేషాన్ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అదే జోష్ తో తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. రాహుల్ శ్రీనివాస దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంబంధించి టీజర్, ట్రైలర్ విడుదల చేయగా.. నిన్న మీడియా మిత్రుల కోసం ప్రత్యేకంగా ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ షో చూసిన మీడియా మిత్రులు సినిమాపై ఫుల్ పాజిటివ్ రివ్యూ ఇవ్వడం విశేషం. మొదటి షో తోనే ఊహించని రెస్పాన్స్ అందుకోవడంతో అటు చిత్రబృందం ఇటు నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కలలో కూడా ఊహించని రెస్పాన్స్ తమ సినిమాకు వస్తుండడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. కామెడీ జానర్లో రాబోతున్న ఈ సినిమాలో నటీనటులు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యారని.. అటు ఈ సినిమా టెక్నీషియన్స్ అందరికీ ఇది మొదటి సినిమానే అయినా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ప్రీమియర్ షో చూసిన మీడియా మిత్రులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గత ఏడాది నవంబర్లో ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తవగా.. ఈ ఏడాది నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సరిగ్గా ఏడాది కాలంలో ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీని మనకు అందించబోతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ చిత్ర బృందం నిర్వహించగా.. ఇందులో నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమా వారికే అంకితం అంటూ కామెంట్లు చేశారు. 7PM బ్యానర్ పై సందీప్ ఆగారం, అశ్వితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా హోస్ట్ స్రవంతి మాట్లాడుతూ.. అసలు ఈ బ్యానర్ కి 7PM అని ఎందుకు పెట్టారు ? దీని కథ ఏంటి? మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకున్నారా? అంటూ ప్రశ్నించగా.. సందీప్ మాట్లాడుతూ.. "అసలు సినిమా చూసి ఎంజాయ్ చేసే మేము సినిమా తీయడం ఏంటి అని ఆలోచించాము. వాస్తవానికి మాకు ఒక గ్యాంగ్ ఉండేది. ప్రతిరోజు ఏడు గంటలకు మేము రూమ్ లో కలిసేవాళ్ళం. అయితే ఒకరోజు అనుకోకుండా సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు.. సినిమా తీయాలనుకున్నాము. అయితే బ్యానర్ కి ఏం పేరు పెడదామని అనుకోగానే 7PM బ్యాచ్ ఉండడంతో ఇక ఆ టైమింగ్ నే మేము బ్యానర్ పేరుగా మార్చేసాము" అంటూ తన స్నేహితులను కూడా స్టేజ్ పైకి పిలిపించి అసలు విషయాన్ని చెప్పారు సందీప్.

అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి మాట్లాడుతూ.." నాకు పెళ్లయి మూడు సంవత్సరాలయింది. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోలేదు. భవిష్యత్తులో కూడా చేయించుకోను . అందుకే ఈ చిత్రాన్ని నా భార్యకే అంకితం చేస్తున్నాను" అంటూ సందీప్ తెలిపారు . మొత్తానికైతే కొత్త వారే అయినా తమ అద్భుతమైన టాలెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రానికి ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేకుండా ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం కూడా ఊపిరి పీల్చుకుంటుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ సినిమా చూసిన మీడియా మిత్రులు పైసా వసూల్ మూవీ అని, ఖచ్చితంగా టికెట్ కు న్యాయం చేసే మూవీ అని కూడా కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News