న‌ష్టాల‌న్నీ నిర్మాత‌ భ‌ర్తీ వాటితోనే!

ఎంత చెత్త సినిమా తీసినా ఏ నిర్మాతైనా బాగుంద‌నే చెబుతాడు. క‌నీసం ఓపెనింగ్స్ అయినా ద‌క్కుతాయి? అన్న ఆశ‌తో హీరోలు స‌హా ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆడే స్ట్రాట‌జీ అది.;

Update: 2025-11-04 17:50 GMT

ఎంత చెత్త సినిమా తీసినా ఏ నిర్మాతైనా బాగుంద‌నే చెబుతాడు. క‌నీసం ఓపెనింగ్స్ అయినా ద‌క్కుతాయి? అన్న ఆశ‌తో హీరోలు స‌హా ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆడే స్ట్రాట‌జీ అది. రిలీజ్ కు ముందు వీలైనంత‌ పబ్లిసిటీ చేసి హైప్ తీసుకొస్తారు. దీంతో ఓపెనింగ్స్ వ‌ర‌కూ ఇబ్బంది లేకుండా గ‌ట్టెక్కుతారు. చిన్న సినిమాల వ‌ర‌కూ ఈ త‌ర‌హా ప్ర‌చారం పెద్ద ఇబ్బందేం కాదు. సోష‌ల్ మీడియాలో అలాంటి వారిని పెద్ద‌గా టార్గెట్ చేయ‌దు. స్టార్ హీరోల‌తో సినిమాలు తీసి మాట‌లు కోట‌లు దాటితేనే అస‌లైన ఇబ్బందులు ఎదుర‌వుతాయి. టాలీవుడ్ లో బండ్ల గ‌ణేష్ త‌ర్వాత ఆ రేంజ్ లో ఎలివేష‌న్ ఇచ్చే నిర్మాత ఎవ‌రు? అంటే నిర్మాత నాగవంశీ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది.

ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న నిర్మాణ సంస్థ నుంచి రిలీజ్ అయిన సినిమాల విషయంలో ఆయ‌న ఏ రేంజ్ లో ఎలివే ష‌న్ ఇచ్చారో తెలిసిందే. స్ట్రెయిట్ చిత్రాల నుంచి డ‌బ్బింగ్ చిత్రం వ‌ర‌కూ నాగ‌వంశీ ఓ రేంజ్ లో త‌మ సినిమాల్ని ప్ర‌మోట్ చేసుకున్నారు. కానీ రిలీజ్ త‌ర్వాత వాటి లెక్క మారింది. దీంతో ఆయ‌న ట్రోల‌ర్ల‌కు అడ్డంగా దొరికిన‌ట్లు అయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ చిత్రం కూడా గ‌ట్టి షాకే ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. నాన్ థియేట్రిక‌ల్ రూపంలో మంచి రెవిన్యూ క‌నిపించిన‌ప్ప‌టికీ త‌న‌ను న‌మ్మిన డిస్ట్రిబ్యూట‌ర్ల ప‌రిస్థితి ఏంటి అన్న‌ది ఆలోచించాల్సిన అంశం.

నిర్మాత-డిస్ట్రిబ్యూట‌ర్ మ‌ధ్య బాండింగ్ స‌వ్యంగా ఉన్నంత కాల‌మే రిలీజ్ కు ఆట‌కం ఉండ‌దు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వ్వ‌వు...అందుకే వాళ్ల‌ను ఎప్పుడు కాపాడుకోవాల‌ని రాజుగారు రెగ్యుల‌ర్ గా చెప్పే మాట‌. మ‌రి వాళ్ల‌కు ఎదురైన న‌ష్టాల‌ను నాగవంశీ ఎలా భ‌ర్తీ చేస్తారంటే? ఆయ‌న మాత్రం గుండెల మీద చేయి వేసుకుని దైర్యంగా ఉన్న‌ట్లే స‌న్నివేశం క‌నిపిస్తోంది. లైన‌ప్ లో ఉన్న ప్రాజెక్ట్ ల‌తో ఎక్క‌డికక్క‌డ వ‌చ్చిన న‌ష్టాల‌ను భ‌ర్తీ చేయాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నారు. విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తోన్న `ఫంకీ` రిలీజ్ అవుతుంది. అలాగే అల్ల‌రి న‌రేష్ న‌టిస్తోన్న `ఆల్కాహాల్` కూడా వ‌చ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ అవుతుంది.

సంక్రాంతి సంద‌ర్భంగా న‌వీన్ పోలిశెట్టి న‌టిస్తోన్న `అనగనగా ఒక రాజు` రెడీ అవుతుంది. వీటితో పాటు సూర్య‌- వెంకీ అట్లూరి, వెంకేట‌ష్‌-త్రివిక్ర‌మ్ సినిమాలు కూడా నాగ‌వంశీవే. ఇవిగాక అశోక గల్లా, ఆనంద్ దేవరకొండ న‌టిస్తోన్న చిత్రాలు రెడీ అవుతున్నాయి. వీటిలో రెండు..మూడు సినిమ‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా? న‌ష్టాల‌న్నీ భ‌ర్తీ అయిపోతాయి. ఈ ఏడాది ర రాజుగారు `సంక్రాంతికి వ‌స్తున్నాం` విజ‌యంతో అలా గ‌ట్టెక్కిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస ప‌రాజ‌యాల నేప‌థ్యంలో రాజుగారి ప‌నైపోయింది అనుకున్న స‌మ‌యంలో సంక్రాంతి విజ‌యంతో అన్నీ త‌న ఆధీనంలోకి వ‌చ్చాయి. నాగ‌వంశీ విష‌యంలోనూ అలాంటి మ్యాజిక్ జ‌ర‌గాల‌ని ఆయ‌న స‌న్నిహితులు ఆశీస్తున్నారు.

Tags:    

Similar News