మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమా త‌ర్వాత PC ఈ ద‌ర్శ‌కుడితో

గ్లోబ‌ల్ ఐక‌న్ ప్రియాంక చోప్రా(పీసీ) ఇటీవ‌ల హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తూ సొంత ప‌రిశ్ర‌మ‌ బాలీవుడ్‌కి దూర‌మైన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-08-04 04:15 GMT

గ్లోబ‌ల్ ఐక‌న్ ప్రియాంక చోప్రా(పీసీ) ఇటీవ‌ల హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తూ సొంత ప‌రిశ్ర‌మ‌ బాలీవుడ్‌కి దూర‌మైన సంగ‌తి తెలిసిందే. పీసీ ఒక భార‌తీయ సినిమాలో న‌టించి ఇప్ప‌టికే ఆరేళ్ల‌యింది. ప్రియాంక న‌టించిన చివ‌రి బాలీవుడ్ చిత్రం `స్కై ఈజ్ పింక్`. అమెరిక‌న్ పాప్ గాయ‌కుడు నిక్ జోనాస్ ని పెళ్లాడి అమెరికాలో సెటిలైన ప్రియాంక చోప్రా ఆ త‌ర్వాత పూర్తిగా హాలీవుడ్ కెరీర్ పైనే ఫోక‌స్ చేసింది. అక్క‌డ సిటాడెల్ వెబ్ సిరీస్ రెండు సీజ‌న్ల‌లో న‌టించింది. చివ‌రిగా హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే హాలీవుడ్ చిత్రంలో పీసీ న‌టించింది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా యాక్ష‌న్ ప్యాక్డ్ పాత్ర‌లో క‌నిపించింది. త‌న‌ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురిసాయి.

దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడితో రీలాంచ్:

అయితే గ్లామ‌ర్ ప్ర‌పంచంలో ఏదీ స్థిరంగా ఒకేలా కుద‌ర‌దు. ఇప్పుడు ప్రియాంక రూటు మారింది. ఆలోచ‌న‌లు మారాయి. తిరిగి భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లోకి గ్రేట్ కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నిస్తోంది. అయితే ఈసారి తెలివిగా దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి చిత్రంలో న‌టించేందుకు ఓకే చెప్పింది. ఈ చిత్రంలో మ‌హేష్ బాబు లాంటి అగ్ర కథానాయ‌కుడి స‌ర‌స‌న పీసీ జాక్ పాట్ అందుకుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా సాగుతోంది. అడ‌వి నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో, ఇండియానా జోన్స్ లైన్స్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో పీసీ పాత్ర చాలా స్పెష‌ల్ గా ఉంటుంద‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి.

క‌ళాత్మ‌క ద‌ర్శ‌కుడితో ఛాన్స్:

అదంతా అటుంచితే, పీసీ బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు? అంటే దానికి ఇటీవ‌ల జ‌వాబు లేదు. తాజాగా దీనిపై హిందీ మీడియాలో కొత్త అప్ డేట్ అందింది. ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు ఇక‌ ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. ఫ‌ర్హాన్ అక్త‌ర్ తో భారీ మ‌ల్టీస్టార‌ర్ లో న‌టించాల్సి ఉన్నా కానీ, అది అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతుండ‌డంతో పీసీ ఇత‌ర ద‌ర్శ‌కుల వైపు చూస్తోంది. అందులో త‌న‌కు అత్యంత స‌న్నిహితుడు, హితుడు అయిన సంజ‌య్ లీలా భ‌న్సాలీ నుంచి ప్రియాంక‌కు పిలుపు అందింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ జోడీ గ‌తంలో రెండు భారీ క‌ళాత్మ‌క చిత్రాల‌కు క‌లిసి ప‌ని చేసారు. ఈ రెండు భారీ చిత్రాల్లో ప్రియాంక చోప్రా అద్భుత అభిన‌యం, నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ర‌క్తి క‌ట్టించింది. అందుకే ఇప్పుడు భ‌న్సాలీ ప్రియాంక చోప్రాకు ఆఫ‌ర్ ఇచ్చార‌ని తెలియ‌గానే అభిమానుల్లో ఒక‌టే ఉత్సాహం నెల‌కొంది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న `ల‌వ్ అండ్ వార్` చిత్రంలో ర‌ణ‌బీర్- విక్కీ కౌశల్, ఆలియా భ‌ట్ ల‌తో పాటు పీసీ కూడా క‌నిపించ‌నుంది. అయితే ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో అతిథి పాత్ర‌లో న‌టిస్తోందా? ప్ర‌త్యేక గీతంలో న‌ర్తిస్తుందా? అన్న‌ది ఇంకా చిత్ర‌బృందం నుంచి క్లారిటీ రాలేదు. ప్ర‌స్తుతానికి పీసీ అతిథి పాత్ర‌లో న‌టించడ‌మే గాక ఒక ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించేందుకు ఆస్కారం ఉంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. అయితే దీనిని భ‌న్సాలీ కానీ, పీసీ కానీ అధికారికంగా ధృవీక‌రించ‌లేదు.

ఆ రెండు క్లాసిక్స్ త‌ర్వాత..

ప్రియాంక చోప్రా -సంజయ్ లీలా భన్సాలీ జోడీ గతంలో బాజీరావ్ మస్తానీ, గోలియోం కి రాస్లీలా రామ్-లీలా వంటి గొప్ప క‌ళాత్మ‌క చిత్రాల కోసం క‌లిసి ప‌ని చేసారు. ఆ రెండు సినిమాల్లో క్లాసిక్ అన‌ద‌గ్గ పాత్ర‌ల్లో ప్రియాంక చోప్రా న‌ట‌నాభిన‌యానికి ప్ర‌శంస‌లు కురిసాయి. ఇటీవల ప్రియాంక సోషల్ మీడియాలో `గోలియోం కి రాస్లీలా రామ్-లీలా` చిత్రంలోని పాపుల‌ర్ సాంగ్ `రామ్ చాహే లీలా`కి సంబంధించిన పాత జ్ఞాపకాన్ని షేర్ చేసింది. ఈ పోస్ట్ అభిమానుల్లో ఉత్సాహం పెంచింది. మ‌రోసారి భ‌న్సాలీతో భారీ చిత్రంలో న‌టిస్తుందా? అనే సందేహాల‌ను కూడా ఇది రేకెత్తించింది. అభిమానులు ఊహించిన‌ట్టే ఇప్పుడు భ‌న్సాలీతో క‌లిసి పీసీ పెద్ద ప్ర‌ణాళిక‌ల‌తో దూసుకొస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ప్రియాంక చోప్రా చివరిసారిగా 2015లో భన్సాలీతో కలిసి పనిచేశారు. బాజీరావ్ మస్తానీ చిత్రంలో ప్రియాంక పోషించిన‌ కాశీబాయి పాత్ర చాలా ప్రశంసలు అందుకుంది. దీనితో పాటు భన్సాలీ నిర్మించిన `మేరీ కోమ్`లో బాక్స‌ర్ పాత్ర‌లో అద్భుత న‌ట‌న‌తో అల‌రించింది.

హృతిక్ తో క్రిష్ 4లో..

ఇప్పుడు `ల‌వ్ అండ్ వార్`తో చ‌రిత్ర సృష్టించాల‌నుకుంటున్న భ‌న్సాలీకి ప్రియాంక చోప్రా క‌ల‌యిక అద‌న‌పు బూస్ట్ నిస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. `ల‌వ్ అండ్ వార్`కి ఇప్పుడు గ్లోబ‌ల్ ఐక‌న్ ప్రియాంక చోప్రా కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆక‌ర్ష‌ణ పెర‌గ‌నుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రోవైపు హృతిక్ రోష‌న్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించ‌నున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `క్రిస్ 4 `లో ప్రియాంక చోప్రా న‌టిస్తుంద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పీసీ పాత్ర‌ను తిరిగి రీలోడ్ చేసేందుకు ఆస్కారం ఉంది. క్రిష్ 2, క్రిష్ 3 చిత్రాల‌లో ప్రియాంక చోప్రా హృతిక్ స‌ర‌స‌న న‌టించింది. ఇప్పుడు తిరిగి పార్ట్ 4లోను న‌టించ‌నుందని స‌మాచారం.

Tags:    

Similar News