అల్లు అర్జున్‌ని కాదని మహేష్‌కి ఓకే చెప్పిందా?
ఇటీవల ఆన్ లొకేషన్ నుంచి ప్రియాంక చోప్రా ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటివరకూ చిత్రబృందం ప్రియాంక చోప్రా కథానాయిక అనే విషయాన్ని ధృవీకరించలేదు;
గ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రా(పీసీ) క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. సిటాడెల్ ఫ్రాంఛైజ్ సహా పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన పీసీ ఒక భారతీయ సినిమాకి సంతకం చేయడానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. బాలీవుడ్ లో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కోసం సంతకం చేసినా అది సెట్స్ పైకి వెళ్లలేదు. ఎట్టకేలకు రాజమౌళి- మహేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB29ని ఎంచుకుంది. ఇటీవల ఆన్ లొకేషన్ నుంచి ప్రియాంక చోప్రా ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటివరకూ చిత్రబృందం ప్రియాంక చోప్రా కథానాయిక అనే విషయాన్ని ధృవీకరించలేదు.
తాజాగా మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. ప్రియాంక చోప్రాతో ఇద్దరు ప్రముఖ సౌత్ దర్శకులు సంప్రదింపులు జరిపారు. మహేష్ మూవీ కోసం రాజమౌళి.. అల్లు అర్జున్ మూవీ కోసం అట్లీ ఇద్దరూ ప్రియాంక చోప్రాతో చర్చలు జరిపారు. స్టోరి, పాత్రను కూడా వివరించారు. అయితే ఈ రెండిటిలో ప్రియాంక చోప్రాను మహేష్- రాజమౌళి ప్రాజెక్ట్ ఎగ్జయిట్ చేసింది. అట్లీతో క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తాయి. స్క్రిప్టు పరంగాను చర్చలు విఫలమయ్యాయి. అందుకే రాజమౌళితో సినిమాకి ప్రియాంక చోప్రా ఓకే చెప్పిందని ప్రఖ్యాత హిందూస్తాన్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
అయితే ఈ కథనాలు ఎలా ఉన్నా భారతదేశంలో నంబర్ వన్ దర్శకుడికే ప్రియాంక చోప్రా మొదటి ప్రాధాన్యత అని అర్థం చేసుకోవాలి. రాజమౌళి ఎప్పటికీ నంబర్ వన్ దర్శకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాతే ఇంకెవరైనా. వరుసగా రెండు 1000 కోట్ల క్లబ్ చిత్రాలను అందించిన ఘనత రాజమౌళికే చెందుతుంది. అట్లీతో పోలిస్తే స్క్రిప్టు పరంగా, పాత్రల పరంగా, అలాగే సాంకేతికంగా అత్యున్నత స్థాయి విజువల్స్ పరంగా రాజమౌళి ఎంతో ఎత్తున ఉన్నాడు. అట్లీ `జవాన్` లాంటి రొటీన్ మాస్ సినిమాని అందించాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ తో అతడు మరో లెవల్ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ఇది భారతీయ సినీపరిశ్రమలో మునుపెన్నడూ చూడని రేంజులో ఉండబోతోందని ఇటీవల అధికారిక ప్రకటనలో రిలీజ్ చేసిన విజువల్స్ చెబుతున్నాయి. ప్రస్తుత సన్నివేశంలో ఏదో ఒకటి ఎంపిక చేయాల్సి వస్తే.. అది కచ్ఛితంగా రాజమౌళితో సినిమానే అని ప్రియాంక చోప్రా భావించారన్నమాట!