ప్రియదర్శి 'ప్రేమంటే' ఫస్ట్ లుక్.. అమ్మాయితో ఇలా రొమాంటిక్ గా..
తన పాత్రల ఎంపికలో భిన్నత కోరే ప్రియదర్శి, "ప్రేమంటే" అనే సినిమాతో ఎమోషన్స్, కామెడీ కలగలిపిన ప్రేమకథను చెప్పబోతున్నాడు.;
టాలీవుడ్ లో టాలెంటెడ్ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నటుడు ప్రియదర్శి. కథల సెలక్షన్, క్యారెక్టర్స్ ఎంపికలో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచే నటుడు. "పెళ్లిచూపులు"లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఆ తర్వాత "మెంటల్ మదిలో" వంటి సినిమాల్లో మంచి క్రేజ్ అందుకొని ఆ తర్వాత హీరోగా అవకాశాలు అందుకున్నారు. ఇటీవల విడుదలైన “కోర్ట్” సినిమాతో నటుడిగా మరోసారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలో సాగిన ఆ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక నెక్స్ట్ తన తదుపరి చిత్రంగా పూర్తిగా భిన్నమైన ప్రేమకథను ఎంచుకున్నాడు. తన పాత్రల ఎంపికలో భిన్నత కోరే ప్రియదర్శి, "ప్రేమంటే" అనే సినిమాతో ఎమోషన్స్, కామెడీ కలగలిపిన ప్రేమకథను చెప్పబోతున్నాడు. ఎప్పుడూ నవ్వించడానికే పరిమితం కాకుండా ఈసారి మనసును తాకే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
"ప్రేమంటే" అనే టైటిల్‌తోనే ఆసక్తి కలిగించే ఈ సినిమాకు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జనవీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్పిరిట్ మీడియా పతాకంపై రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నాగ చైతన్య విడుదల చేశారు. పోస్టర్‌లో ప్రియదర్శి, కథానాయిక ఆనంది ఓ విండో సీట్లో కూర్చొని తెల్లవారుజామున కాఫీ సిప్ చేస్తూ రొమాంటిక్ మూడ్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నారు.
ఆనంది తన కుడికాలితో ప్రియదర్శి గుండెను తాకుతున్న తీరుగా డిజైన్ చేసిన ఆ పోస్టర్‌లో వారి కెమిస్ట్రీని హైలెట్ చేసింది. నవ్వులు, ప్రేమతో కూడిన ఎమోషనల్ టైమ్‌ను ప్రతిబింబించేలా ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ ఫ్రెష్ ప్రేమ కథకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకూ 65 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని చిత్రబృందం వెల్లడించింది. అనేక ప్రేమ కథల్లో ఉన్న ఫీలింగ్‌తో పాటు కొత్తగా ఉండే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. నేచురల్ పర్ఫార్మన్స్‌కు ప్రాధాన్యత ఉన్న నటులు కాబట్టి, ఈ జంటపై అందరి దృష్టి ఉంది.
ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఎప్పుడూ కామెడీ టచ్‌తో కనిపించే ఆమె, ఈ సినిమాలో ఎలా అలరిస్తారో ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది ప్రేక్షకులకు ఒక తీపి ప్రేమ కథను అందించేందుకు "ప్రేమంటే" సిద్ధమవుతోంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నట్టు మేకర్స్ వెల్లడించారు.