బెంగాలీ విప్లవకారుల కథ అయినా బెంగాలీ నటులకు ఛాన్సులేవీ?
ఈ సిరీస్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రధాన చర్చ అంతా దీనిలోని వైవిధ్యమైన నటీనటుల గురించే.
ప్రైమ్ వీడియో రూపొందించిన 'ది రివల్యూషనరీస్' అధికారిక ట్రైలర్ విడుదలైనప్పటి నుండి భారతీయ వినోద ప్రపంచంలో పెద్ద చర్చ మొదలైంది. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ డ్రామా, భారత స్వాతంత్య్ర పోరాటంలో మరుగున పడిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరపైకి తెస్తోంది. 11 సెప్టెంబర్ 2026న ప్రసారం కానున్న ఈ సిరీస్.. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టి రహస్యంగా పోరాడిన యువ విప్లవకారుల ధైర్యాన్ని, వ్యూహాత్మక చతురతను.. వారు చేసిన అత్యున్నత త్యాగాలను ఆవిష్కరిస్తుంది.
ఈ సిరీస్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రధాన చర్చ అంతా దీనిలోని వైవిధ్యమైన నటీనటుల గురించే. యూట్యూబ్ స్టార్ నుండి నటుడిగా మారిన భువన్ బామ్.. ప్రముఖ విప్లవకారుడు రాష్ బిహారీ బోస్‌గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే ఇప్పటివరకు లవర్ బాయ్ పాత్రలు చేసిన రోహిత్ సరాఫ్.. ఇందులో తీవ్రమైన జాతీయవాది సచీంద్ర నాథ్ సన్యాల్‌గా కనిపించనున్నారు. వీరితో పాటు బాఘా జతిన్ పాత్రలో గుర్ఫతే పిర్జాదా, ప్రతిభా లాహిరిగా ప్రతిభా రంటా నటించారు. ఈ పాత్రల ఎంపిక నేటి యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ విడుదలైన తర్వాత ముఖ్యంగా బెంగాలీ ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. భారత స్వాతంత్య్ర పోరాటంలో బెంగాల్ అత్యంత కీలక పాత్ర పోషించడంతో రాష్ బిహారీ బోస్, బాఘా జతిన్ వంటి వీరుల గాథలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంపై వారు గర్వం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. గదర్ ఉద్యమం ..కోమగాట మారు వంటి చారిత్రక ఘట్టాల ప్రస్తావనలు.. సుఖ్విందర్ సింగ్ శక్తివంతమైన నేపథ్య గీతం ట్రైలర్‌కు మరింత తీవ్రతను చేకూర్చాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే బెంగాలీ పాత్రలు, పాత్రధారుల కోసం బెంగాలీ నటులను ఎంపిక చేయకపోవడంపై స్థానికులు తీవ్రంగా గుర్రుమీద ఉన్నారు.
స్వాతంత్య్ర పోరాట కథతో సినిమా తీయడం బావుంది. బెంగాలీ వీరుల కథలు బావున్నాయి. కేవలం యాక్షన్ సన్నివేశాలకే పరిమితం కాకుండా.. విప్లవకారులు పడిన మానసిక - శారీరక వేదనను కూడా ఈ సిరీస్ అత్యంత సహజంగా చూపిస్తుంది. బ్రిటీష్ అధికారి జనరల్ డయర్ (జేసన్ షా) నేతృత్వంలోని బలగాలతో సాగే హోరాహోరీ పోరాటాలు.. గన్ బ్యాటిల్స్.. ఛేజింగ్ సీన్స్ కథలో ఉత్కంఠనుంచుతాయి. అదే సమయంలో ఈ యువ తిరుగుబాటుదారుల మధ్య ఉన్న స్నేహం, వారి భయాలు.. వారు ఎదుర్కొన్న క్లిష్టమైన సమస్యలను ఆవిష్కరిస్తూ కథను భావోద్వేగభరితంగా మలిచారు.
ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మోనిషా అద్వానీ, మధు భోజ్వాని నిర్మించిన ఈ సిరీస్‌ను సంయుక్త చావ్లా షేక్, అక్షితా వాధ్వానా, శోభిత్ నారంగ్, రుత్వి మెహతా రాశారు. ఈ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ , బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. అత్యున్నత సాంకేతిక విలువలు, బలమైన భావోద్వేగాలతో వస్తున్న `ది రివల్యూషనరీస్` స్వాతంత్య్ర పోరాట త్యాగాలను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తుందని భావిస్తున్నారు.