స్పిరిట్ ఒకవైపు.. కొత్త టాలెంట్ మరోవైపు

‘అర్జున్ రెడ్డి’ నుంచి ‘యానిమల్’ వరకు భద్రకాళీ పిక్చర్స్ పేరు ఎక్కువగా సందీప్ రెడ్డి వంగా సినిమాలతోనే వినిపించింది.

Update: 2026-08-28 08:34 GMT

‘అర్జున్ రెడ్డి’ నుంచి ‘యానిమల్’ వరకు భద్రకాళీ పిక్చర్స్ పేరు ఎక్కువగా సందీప్ రెడ్డి వంగా సినిమాలతోనే వినిపించింది. స్పిరిట్ కూడా నడుస్తోంది. ఇప్పుడు అదే బ్యానర్ నుంచి ‘రోమాంచకం’ రావడం మాత్రం కాస్త వేరే స్టెప్. సుమంత్ ప్రభాస్ హీరోగా, అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి దర్శకుడు. సెప్టెంబర్ 3న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇక్కడ సినిమా కంటే దాని వెనకున్న టీమ్ సెలక్షన్ మరో కొత్త ట్రెండ్ ను తెస్తోంది.

ట్రైలర్ ఈవెంట్‌లో నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఈ సినిమా విజయం తమ బ్యానర్ కంటే ఇందులో పనిచేసిన యంగ్ టీమ్‌కు ఎక్కువ అవసరమని అన్నాడు. దర్శకుడు, హీరో, హీరోయిన్‌తో పాటు చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కొత్తవాళ్లు లేదా రెండు మూడు సినిమాల అనుభవం ఉన్నవాళ్లేనని చెప్పాడు. వాళ్లకు ఈ సినిమాతో గుర్తింపు రావాలని కోరుకున్నాడు.

ఇది భద్రకాళీకి కూడా ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే కొత్త ప్రయత్నమే. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ అన్నీ వంగా దర్శకత్వంతోనే పెద్ద స్థాయికి వెళ్లాయి. ఇప్పుడు తనే డైరెక్ట్ చేయని, స్టార్ హీరో కూడా లేని సినిమాను ఇదే బ్యానర్ ముందుకు తీసుకురావడం మొదలైంది. ‘రోమాంచకం’ క్లిక్ అయితే ఇలాంటి మరిన్ని సినిమాలకు డోర్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఇక్కడ సందీప్ వంగా పేరు కొత్త టీమ్‌కు పెద్ద ప్లస్ అవుతుంది. సాధారణంగా కొత్త హీరో, దర్శకుడి సినిమా ప్రేక్షకుల దృష్టిలో పడాలంటే ప్రమోషన్స్ నుంచే పెద్ద పోరాటం ఉంటుంది. కానీ వంగా ప్రెజెంటర్‌గా ఉండటంతో ‘రోమాంచకం’ ట్రైలర్ ఈవెంట్ నుంచే ఎక్కువ మందికి చేరింది. సినిమా చివరకు కంటెంట్ మీదే నిలబడాలి. కానీ మొదట ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకొచ్చే విషయంలో ఇలాంటి పేరు ఉపయోగపడుతుంది.

పైగా కథ నచ్చిన వెంటనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నామని టీమ్ చెబుతోంది. షూటింగ్‌కు ముందు మూడు నెలలు నటులతో రిహార్సల్స్ చేయించారని, ముందుగా అనుకున్న బడ్జెట్‌లోనే దర్శకుడు సినిమా పూర్తి చేశాడని ప్రణయ్ చెప్పాడు. అంటే కొత్త వాళ్లతో సినిమా చేస్తున్నా ఖర్చు పెంచి భారీగా చూపించాలనే లెక్క కాకుండా, కథకు సరిపోయే స్థాయిలో పూర్తి చేసే పద్ధతిని ట్రై చేస్తున్నారు.

‘రోమాంచకం’ బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయితే అసలు మార్పు అక్కడి నుంచే రావచ్చు. ఒకవైపు ప్రభాస్‌తో ‘స్పిరిట్’లాంటి భారీ సినిమా చేస్తూనే, మరోవైపు కొత్త హీరోలు, దర్శకులతో ఇలాంటి సినిమాలు తీసుకురావడానికి భద్రకాళీకి మరో లైన్ దొరుకుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News