బాక్సాఫీస్: పెద్ద సినిమా లైఫ్‌టైమ్ నెంబర్ ను దాటేసిన ‘ఇరుముడి’

రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం పూర్తి చేసుకుంది. సినిమా రిలీజ్‌కు ముందు ఇలాంటి నంబర్లు వస్తాయని చాలా మంది ఊహించలేదు.

Update: 2026-08-28 10:05 GMT

రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం పూర్తి చేసుకుంది. సినిమా రిలీజ్‌కు ముందు ఇలాంటి నంబర్లు వస్తాయని చాలా మంది ఊహించలేదు. కానీ మొదటి వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్స్ పూర్తిగా పడిపోకుండా కొనసాగాయి. ఇప్పుడు బుక్‌మైషో టికెట్ సేల్స్‌లో కూడా మరో పెద్ద లెక్కను దాటినట్లు ట్రాకింగ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు కనిపించే కొన్ని టికెట్ రికార్డుల్లోకి రవితేజ సినిమా రావడం విశేషం.

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ‘ఇరుముడి’ బుక్‌మైషోలో వారం రోజుల్లోనే దాదాపు 28 లక్షల టికెట్లు అమ్ముకుంది. పవన్ కల్యాణ్ ‘ఓజీ’ మొత్తం థియేట్రికల్ రన్‌లో బుక్‌మైషో ద్వారా సుమారు 27.8 లక్షల టికెట్లు అమ్ముకున్నట్లు గతంలో ట్రాకింగ్ లెక్కలు వచ్చాయి. ఆ లైఫ్‌టైమ్ నంబర్‌ను ‘ఇరుముడి’ మొదటి వారంలోనే దాటడం ఇప్పుడు మరో రికార్డుగా మారింది.

ఇది ఒక్క బుక్‌మైషో లెక్క దగ్గరే ఆగలేదు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం మొదటి ఏడు రోజులకు ‘ఇరుముడి’ ఇండియా నెట్ దాదాపు రూ.92.15 కోట్ల దగ్గర ఉంది. ఇండియా గ్రాస్ రూ.106.95 కోట్లు, ఓవర్సీస్ నుంచి సుమారు రూ.17.90 కోట్లు వచ్చినట్లు బాక్సాఫీస్ ట్రాకింగ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో మొదటి వారం వరల్డ్‌వైడ్ గ్రాస్ దాదాపు రూ.124.85 కోట్లకు చేరినట్లు అంచనా.

అలాగే ఏడో రోజు ‘టాక్సిక్’ థియేటర్లలోకి రావడంతో ‘ఇరుముడి’కి షోలు బాగా తగ్గాయి. కొన్ని ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం దాదాపు వెయ్యి షోలు తగ్గగా, ఆ రోజు ఇండియాలో సుమారు 2,400 షోలతో రూ.6.90 కోట్ల నెట్ వచ్చింది. ముందు రోజు రూ.10.20 కోట్లతో పోలిస్తే డ్రాప్ ఉన్నా, కొత్త భారీ సినిమా వచ్చిన రోజే ఈ స్థాయిలో నిలబడటం రెండో వీకెండ్‌కు ఉపయోగపడే లెక్క.

రవితేజ గత కొన్ని సినిమాలతో పోలిస్తే ‘ఇరుముడి’ రన్ పూర్తిగా వేరుగా వెళ్తోంది. ఓపెనింగ్ ఒక్కటే కాకుండా వీక్ డేస్‌లో కూడా టికెట్ సేల్స్ కొనసాగడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ముఖ్యంగా బుక్‌మైషోలో మొదటి మంగళవారం దాదాపు 3.55 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు ట్రాకింగ్ లెక్కలు వచ్చాయి. ఆ రోజు తెలుగు సినిమాల్లో నమోదైన పెద్ద నంబర్లలో ఇది ఒకటిగా నిలిచింది. అంటే మొదటి మూడు రోజుల హడావుడి తర్వాత కూడా ప్రేక్షకుల రాక పూర్తిగా తగ్గిపోలేదన్నది ఈ లెక్కలో కనిపిస్తోంది. ఇప్పుడు అసలు లెక్క రెండో వీకెండ్ దగ్గర ఉంటుంది. ‘టాక్సిక్’కు ఎక్కువ స్క్రీన్స్ వెళ్లిన తర్వాత కూడా ‘ఇరుముడి’ ఎంత వరకు హోల్డ్ అవుతుందో చూడాలి. రెండో శని, ఆదివారాల్లో మళ్లీ జంప్ వస్తే రవితేజ కెరీర్‌లో ‘ఇరుముడి’ ఫైనల్ రేంజ్ ఇంకా పైకి వెళ్లే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News