షూటింగ్ లో హీరోను కొట్టిన లేడీ డైరెక్టర్!
ట్రైలర్ లాంచ్ లో భాగంగా ప్రవీణ సినిమాలోని నటీనటుల నుంచి మంచి యాక్టింగ్ రాబట్టుకునేందుకు తానేం చేశారో చెప్పారు.;
కేరాఫ్ కంచరపాలెం ముందు వరకు అమెరికాలో తానొక డాక్టర్. కానీ సినిమాలపై పిచ్చితో అన్నీ వదిలేసి ఇండియాకు తిరిగొచ్చిన తెలుగమ్మాయి ప్రవీణ పరుచూరి, కేరాఫ్ కంచరపాలెం సినిమాకు నిర్మాతగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. సినిమాను నిర్మిస్తూనే ఆ సినిమాలో సలీమా అనే క్యారెక్టర్ ను చేసి నటిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు.
కేరాఫ్ కంచరపాలెం తర్వాత ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాను కూడా ప్రవీణనే నిర్మించారు. ఆ రెండు సినిమాల తర్వాత ప్రవీణ ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ గా మారారు. ఆమె దర్శకత్వంలో వస్తున్న సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు. దగ్గుబాటి రానా సమర్పణలో వస్తున్న ఈ సినిమాను పరుచూరి గోపాలకృష్ణ, ప్రవీణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
జులై 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా రీసెంట్ గా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ చాలా నేచురల్ గా కనిపిస్తూ అందులో నటించిన వారి యాక్టింగ్ చాలా సహజంగా అనిపిస్తోంది. ట్రైలర్ లాంచ్ లో భాగంగా ప్రవీణ సినిమాలోని నటీనటుల నుంచి మంచి యాక్టింగ్ రాబట్టుకునేందుకు తానేం చేశారో చెప్పారు.
సినిమాలో రెండు క్యారెక్టర్లు చాలా కీలకమని, వారిద్దరి మధ్య సీన్స్ సరిగా పండకపోతే సినిమా చాలా ఫ్లాట్ గా ఉంటుందని, అందుకే వారి నుంచి మంచి యాక్టింగ్ ను రాబట్టుకునేందుకు వాళ్లని తిట్టాను, కొట్టాను, రాళ్లు విసిరేశానని ప్రవీణ తెలిపారు. యాక్టింగ్ అంటే తన దృష్టిలో జీవించడమని, అందుకే ఈ విషయంలో వారికి సారీ చెప్పనని ప్రవీణ అన్నారు. సినిమా కోసం ఏదైనా సరే తప్పదని ఆమె అన్నారు. దీంతో ప్రవీణ చేసిన ఆ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డైరెక్షన్ చాలా కష్టమని, డైరెక్టర్ గా ఉన్నప్పుడు ప్రతీదీ చూసుకోవాలని, మైండ్ లో వంద ప్రశ్నలు రన్ అవుతూ ఉంటాయని చెప్తోన్న ఆమె ఈ సినిమా షూటింగ్ 33 రోజుల్లోనే పూర్తి చేశానని, కానీ పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానని తెలిపారు. మొత్తానికి సినిమాను పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేశామని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ప్రవీణ. గతంలో మంచి సినిమాలను నిర్మించినప్పటికీ అవి ప్రవీణకు కమర్షియల్ గా లాభాలను తెచ్చిపెట్టింది లేదు. ఇపపుడీ సినిమాతో అయినా ప్రవీణ మంచి టాక్ తో పాటూ లాభాలను అందుకుంటారేమో చూడాలి.