మూవీ రివ్యూ : ప్రతినిధి-2

Update: 2024-05-10 11:50 GMT

'ప్రతినిధి-2' మూవీ రివ్యూ

నటీనటులు: నారా రోహిత్-సిరి లెల్లా-దీపక్ తేజ్-సచిన్ ఖేద్కర్-ఉదయభాను-జిషు సేన్ గుప్తా-ప్రవీణ్-అజయ్ ఘోష్-పృథ్వీ-తనికెళ్ల భరణి-శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

సంగీతం: మహతి స్వరసాగర్

ఛాయాగ్రహణం: నాని చామిడిశెట్టి

నిర్మాతలు: కుమార్ రాజా బత్తుల-ఆంజనేయులు శ్రీ తోట-సురేంద్రనాథ్ బొల్లినేని

రచన-దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు

ఒకప్పుడు వరుసబెట్టి సినిమాలు చేసిన యువ కథానాయకుడు నారా రోహిత్.. కొన్నేళ్ల పాటు తెర మీదే కనిపించలేదు. ఇప్పుడతను 'ప్రతినిధి-2'తో పునరాగమనానికి సిద్ధమయ్యాడు. న్యూస్ ప్రెజెంటర్ మూర్తి దర్శకుడిగా మారి రూపొందించిన ఈ చిత్రం స్ట్రైకింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ప్రతినిధి లాగే ప్రతినిధి-2తోనూ నారా రోహిత్ మెప్పించాడా? చూద్దాం పదండి.

కథ:

అనాథ అయిన చేతన్ అలియాస్ చే (నారా రోహిత్) ఒక న్యూస్ ఛానెల్లో ప్రెజెంటర్ గా చేరతాడు. ఆ ఛానెల్లో చేరేముందే తాను అన్యాయాన్ని ఎదుర్కొనే క్రమంలో ఎంత వరకైనా వెళ్తానని యజమానికి తేల్చి చెబుతాడు. ముక్కుసూటిగా వ్యవహరించే అతడి వల్ల రాజకీయ నాయకులకు ఇబ్బందులు తప్పవు. చేతన్ చేసిన ఓ ఇంటర్వ్యూ వల్ల మంత్రి గజేంద్ర (అజయ్ ఘోష్) తన పదవిని కోల్పోతాడు. అంతే కాక అతణ్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారు. దీంతో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాడు. ఈ ఎన్నికల తంతు పూర్తయ్యే సమయానికి ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేద్కర్) ఒక ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఆయన కొడుకు విశ్వ ప్రజాపతి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యే సమయానికి ప్రజాపతి చనిపోలేదని తెలుస్తుంది. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. ఇంతకీ ప్రజాపతికి జరిగిన ప్రమాదం విషయంలో మతలబు ఏంటి.. ఈ విషయం బయట పెట్టడానికి చేతన్ ఏం చేశాడు.. చివరికేం జరిగింది అన్నది మిగతా కథ.

Read more!

కథనం-విశ్లేషణ:

నారా రోహిత్ ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో 'ప్రతినిధి' ఒకటి. వైవిధ్యమైన కథ.. బిగువైన కథనంతో ఆ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. అలాంటి పేరును వాడుకుని.. మళ్లీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి ఉంటుంది. తెలుగు మీడియాలో బాగా పాపులర్ అయిన జర్నలిస్టుల్లో ఒకరైన మూర్తి తనే స్వయంగా స్క్రిప్టు రాసి డైరెక్ట్ చేయడం క్యూరియాసిటీని పెంచింది. ఐతే స్టూడియోలో కూర్చుని రాజకీయ విశ్లేషణలు చేయడం వేరు.. మెగా ఫోన్ పట్టి సినిమా తీయడం వేరని 'ప్రతినిధి-2' చూస్తే అర్థమవుతుంది. పేరుమోసిన జర్నలిస్టుల్లో ఒకరైన మూర్తి.. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చుట్టూ ఎలాంటి రక్షణ వలయం ఉంటుందో కూడా తెలియనట్లుగా ఇందులో కీలకమైన సన్నివేశాలను నడిపించిన తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీసును బాంబు పెట్టి పేల్చేయడం అంటే ఆషామాషీ విషయమా? అదే విడ్డూరం అంటే.. ముఖ్యమంత్రి చనిపోయాడు అని అందరూ నమ్మేసి.. వేరే బాడీని పెట్టి అంత్యక్రియలు జరిపించేసి.. కొడుకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుంటే.. అప్పుడు సీఎం నేను బతికే ఉన్నాను అంటూ బయటికి వస్తాడు. ఒక ముఖ్యమంత్రి పాత్ర చుట్టూ ఇలాంటి సిల్లీ సీన్లు పెట్టాక ఈ సినిమాను ఎలా సీరియస్ గా తీసుకుంటాం?

ముఖ్యమంత్రి వ్యవహారం పక్కన పెడితే.. స్వయంగా జర్నలిస్ట్ అయి ఉండి కూడా ఒక జర్నలిస్ట్ పరిధి-పరిమితులు ఏమీ తెలియనట్లే హీరో పాత్రను డిజైన్ చేశాడు మూర్తి. జర్నలిస్ట్ అంటే ఏదైనా చేసేయగలడన్నట్లు.. తను చెప్పింది వేదం అన్నట్లు.. మంత్రులైనా జర్నలిస్ట్ అంటే వణికిపోవాలన్నట్లు ఆ పాత్రను చూపించాడు. జర్నలిస్ట్ పాత్రను పవర్ ఫుల్ గా చూపించాలంటే ఒకే ఒక్కడు.. రంగం లాంటి సినిమాల నుంచి స్ఫూర్తి పొందవచ్చు. ఆ చిత్రాల్లో జర్నలిస్ట్ పాత్రలు నేలవిడిచి సాము చేయవు. లేని పోని బిల్డప్ లేకుండా తమ పరిధిలో తమ పనిని సరిగ్గా చేస్తుండడంతో ఆ పాత్రల్లోని ఇంటెన్సిటీని మనం ఫీలవుతాం. వాటిని పవర్ ఫుల్ అనుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం హీరో పాత్రకు మొదట్నుంచి ఎక్కడ లేని బిల్డప్. మార్కెట్లో టమోటాలు ఎక్కువ రేటుకు అమ్ముతుంటే మారువేషంలో వెళ్లి ఫైట్ చేస్తాడు. తర్వాత ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్న ఎమ్మెల్యే దగ్గరికెళ్లి అతడి తాట తీస్తాడు. స్టూడియోలో కూర్చుని మంత్రికి ముచ్చెమటలు పట్టించి తన పదవి ఊడబీకిస్తాడు. అవి చాలవన్నట్లు పదే పదే కెమెరా ముందుకు వచ్చి లెక్చర్లు దంచుతాడు. ఒక సీన్లో అయితే అతను ఓటు ప్రాధాన్యతను తెలియజెబుతూ.. ఓటు వేయని వాళ్లకు నాలుగు కౌంటర్లు వేస్తాడు. అంతే జనాల్లో చైతన్యం తన్నుకొచ్చేస్తుంది. ఉప ఎన్నికల జరుగుతున్న నియోజకవర్గంలో ఏకంగా 98 శాతం పోలింగ్ నమోదైపోతుంది. అందులో 90 శాతం పైగా నోటాకు ఓట్లు పడిపోతాయి. హీరోకు ఎంత ఎలివేషన్ ఇవ్వాలనుకున్నా సరే.. మరీ ఇంత అతినా?

4

హీరో పాత్ర చిత్రణ సంగతలా ఉంచి అసలు కథలోకి వెళ్తే.. ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం జరగడం.. అందరూ చనిపోయారనుకున్న సమయంలో ఆయన తిరిగి రావడం.. దీని వెనుక మిస్టరీ ఏంటో ఛేదించేందుకు సీబీఐ అధికారి రంగంలోకి దిగడం.. చివరికి గుట్టు అంతా బయటికి రావడం.. ఇదీ విషయం. ఐతే ముందే అన్నట్లు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసునే సింపుల్ గా బాంబు పెట్టి పేల్చేయడం అన్నది విడ్డూరంగా అనిపిస్తుంది. అది చాలదన్నట్లు సీఎం అంత్యక్రియలు జరిగిపోయాక ఆయన తిరిగి రావడం పెద్ద జోక్. ఇక్కడే ఆసక్తి కోల్పోయిన ప్రేక్షకులు.. ఆ తర్వాత దీని వెనుకు మిస్టరీ ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తిని కూడా కోల్పోతారు. హీరో సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ఓవర్ కాన్ఫిడెన్స్ తో కనిపించడంతో అతడికో సమస్య వచ్చినా సరే.. దాన్నుంచి అతనెలా బయటపడతాడు అనే కంగారు.. క్యూరియాసిటీ ఏమీ కలగవు. హీరో పాత్ర కోణంలో చాల ా కన్వీనియెంట్ గా కథాకథనాలను నడిపించాడు దర్శకుడు. సీబీఐ అధికారి ఇన్వెస్టిగేషన్ సీన్లన్నీ కూడా బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ అన్నట్లే సాగుతాయి. ఏ కోశాన లాజిక్ అన్న మాటే కనిపించని ఈ కథలో ఏ సీన్ ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు. పాత్రలు.. సన్నివేశాలు.. డైలాగులను గమనిస్తే పరోక్షంగా ప్రస్తుత సీఎం జగన్ ను.. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సంకేతాలు అక్కక్కడా కనిపిస్తాయి. కానీ ఆ విషయంలో కూడా ఒక క్లారిటీతో సాగలేదు. ఇది కమర్షియల్ సినిమానా.. రాజకీయ ప్రయోజనం కోరి తీసిన సినిమానా అన్నది కూడా తేల్చుకోలేం. ఒక లక్ష్యం అంటూ లేకుండా ఎలా పడితే అలా సాగిపోయిన చిత్రమిది. 'ప్రతినిధి' లాంటి మంచి సినిమా పేరును దెబ్బ తీయడమే కాదు.. 'ప్రతినిధి-2'లో జవాబులు లేని ప్రశ్నలకు 'ప్రతినిధి-3'తో సమాధానం ఇస్తాం అంటూ చివర్లో న్యూస్ ప్రెజెంటర్ పాత్రలో మూర్తి చెప్పడం కొసమెరుపు.

నటీనటులు:

నారా రోహిత్ కు కెరీర్లో చాలా గ్యాప్ వచ్చినా.. 'ప్రతినిధి-2'లో కాన్ఫిడెంటుగానే నటించాడు. చేతన్ పాత్రకు బాగానే సూటయ్యాడు. కొంచెం ఫిట్నెస్ అయితే దెబ్బ తిన్నట్లు అనిపిస్తుంది. కొన్ని చోట్ల పాత్రకు అవసరమైన దాని కంటే తన కాన్ఫిడెన్స్ ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి పాత్రలో సచిన్ ఖేద్కర్ బాగానే చేశాడు. సీబీఐ అధికారి పాత్రలో జిషు సేన్ గుప్తా కొన్ని చోట్ల అవసరానికి మించి నటించాడు. కానీ తన పాత్రనే అలా డిజైన్ చేయడంతో అతణ్ని తప్పుబట్టడానికి ఏమీ లేదు. శ్రీకాంత్ అయ్యంగార్ తన స్టయిల్లోనే నటించాడు. ముఖ్యమంత్రి కొడుకు పాత్రలో దినేష్ తేజ్ చేసిందేమీ లేదు. ప్రశాంత్ కిశోర్ ను తలపించే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పాత్రలో అజయ్ ఓకే. తనికెళ్ల భరణికి ఇలాంటి పాత్రలు అలవాటే. పృథ్వీ కొంతమేర నవ్వించాడు. అజయ్ ఘోష్ పర్వాలేదు. హీరోయిన్ సిరి లెల్లా గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఆమెది నామమాత్రమైన పాత్ర.

సాంకేతిక వర్గం: సినిమాలో అందరికంటే బాగా డ్యూటీ చేసింది సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్. తన బ్యాగ్రౌండ్ స్కోర్ మంచి ఇంటెన్సిటీతో సాగింది. సన్నివేశాలు అంతంతమాత్రం అయినా.. నేపథ్య సంగీతంతో వాటిని ఎలివేట్ చేయడానికి అతను గట్టి ప్రయత్నమే చేశాడు. పాటలకు సినిమాలో ప్రాధాన్యం లేదు. ఉన్న ఒక్క పాట సోసోగా అనిపిస్తుంది. నాని చామిడిశెట్టి బాగానే సాగింది. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. రైటర్ కమ్ డైరెక్టర్ మూర్తి దేవగుప్తపు ఎంచుకున్న కథలోనే క్లారిటీ లేదు. దాన్ని తెరపై ఇంకా గందరగోళంగా ప్రెజెంట్ చేశాడు. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో సినిమా తీస్తున్నపుడు ముఖ్య పాత్రలు.. సన్నివేశాలు రియలిస్టిగ్గా ఉండేలా చూసుకోవాలి. కానీ ఈ సినిమాలో అన్నీ అందుకు భిన్నంగా కనిపిస్తాయి. ఎంత సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు అనుకున్నా సరే ఇందులో చాలా సీన్లు మింగుడుపడవు. కొన్ని డైలాగుల వరకు ఓకే కానీ.. కథా రచయితగా-దర్శకుడిగా మూర్తి పనితనం గురించి చెప్పుకోవడానికేమీ లేదు.

చివరగా: ప్రతినిధి-2.. ఓ ప్రయాస

రేటింగ్- 1.75/5

Tags:    

Similar News