ప్రశాంత్ నీల్ తో మైత్రీ హర్రర్ స్టోరీ!
ఇది ఒక రెగ్యులర్ దెయ్యం కథ కాదని తెలుస్తోంది. కథ మొత్తం భయంతో వణికిపోతున్న ఒక ఊరిలోని మెడికల్ కాలేజ్ చుట్టూ తిరుగుతుందట.;
'KGF', 'సలార్' లాంటి భారీ యాక్షన్ సినిమాలతో ఇండియాను షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మరోవైపు 'పుష్ప' లాంటి బ్లాక్‌బస్టర్లతో దూసుకుపోతున్న సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ ఇద్దరు టాప్ ప్లేయర్స్ ఇప్పుడు ఒక్కటయ్యారు. అయితే, ఇది ప్రభాస్ సినిమా అప్‌డేట్ కాదు. ఈసారి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కాదు, ఒక కొత్త అవతారం ఎత్తాడు. వీరిద్దరి కాంబోలో ఒక సరికొత్త ప్రాజెక్ట్ గ్రాండ్‌గా లాంచ్ అయింది.
ఈసారి ప్రశాంత్ నీల్ మెగాఫోన్ పట్టడం లేదు, "సమర్పకుడు"గా బాధ్యతలు తీసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. విశేషం ఏంటంటే, ఈ భారీ కాంబినేషన్ ఒక పెద్ద స్టార్‌తో కాదు, పూర్తిగా యంగ్ టీమ్‌తో ఒక హర్రర్ సినిమాను ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం ఘనంగా జరిగాయి.
ఈ సినిమాతో కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రశాంత్ నీల్ లాంటి పెద్ద డైరెక్టర్ ఒక కొత్త కుర్రాడి కథను నమ్మి ప్రజెంట్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. ఇందులో సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇది ఒక రెగ్యులర్ దెయ్యం కథ కాదని తెలుస్తోంది. కథ మొత్తం భయంతో వణికిపోతున్న ఒక ఊరిలోని మెడికల్ కాలేజ్ చుట్టూ తిరుగుతుందట. సైన్స్‌కు, మిస్టరీకి మధ్య.. అలాగే సైన్స్‌కు, మూఢనమ్మకాలకు అందని ఏదో ఒక పెద్ద సీక్రెట్ ఈ సినిమాలో ఉండబోతోందని టీమ్ చెబుతోంది. ఇప్పటివరకు చూడని కొత్త పాయింట్‌తో ఈ సినిమా ఉంటుందని సమాచారం.
ఈ సినిమాలో శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్ కూడా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. సినిమాకు దినేష్ దివాకరన్ డీవోపీగా పనిచేస్తుండగా, వెంకీ జి.జి మ్యూజిక్ అందిస్తున్నారు. మోహన్ బి.ఎస్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ యెర్నేని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
మైత్రీ, ప్రశాంత్ నీల్ లాంటి టాప్ బ్రాండ్స్ ఒక కొత్త టీమ్‌ను నమ్మి హర్రర్ జానర్ ట్రై చేస్తుండటం ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.