కొత్త సినిమాల రిలీజ్ డేట్స్.. ప్రశాంత్ వర్మ చేతిలో ఉన్నాయా?
ఆ తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. ఒకవేళ ఏమైనా కారణాల వల్ల సినిమాల రిలీజ్ వాయిదా పడితే కొత్త విడుదల డేట్లను ప్రకటిస్తారు.;
సాధారణంగా సినిమాల రిలీజ్ డేట్స్ ను ఆయా చిత్రాల నిర్మాణ సంస్థలు (నిర్మాతలు), డిస్ట్రిబ్యూటర్లు, దర్శకులు చేతిలో ఉంటాయన్న విషయం తెలిసిందే. వారు మార్కెట్ పరిస్థితులు, ఇతర సినిమాలతో పోటీ, ప్రీ- ప్రొడక్షన్, పోస్ట్- ప్రొడక్షన్ పనులు పూర్తి కావడం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని రిలీజ్ తేదీలను నిర్ణయిస్తారు.
ఆ తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. ఒకవేళ ఏమైనా కారణాల వల్ల సినిమాల రిలీజ్ వాయిదా పడితే కొత్త విడుదల డేట్లను ప్రకటిస్తారు. అప్పుడు కూడా నిర్మాతలు, దర్శకులు కలిసే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు విడుదల తేదీ నిర్ణయం తీసుకునే విషయంపై టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
గోవాలో కొన్నిరోజులుగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకలో నిర్వహించిన ఇమాజినింగ్ టుమారో: ఇండియాస్ వీఎఫ్‌ఎక్స్ రివల్యూషన్ సెషన్ లో పాల్గొన్న ప్రశాంత్ వర్మ.. కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై రిలీజ్ డేట్స్ ను నిర్మాతలతో కలిసి కాదు.. తాను మాత్రమే నిర్ణయిస్తానని చెప్పారు.
అందుకు అనుగుణంగా తన అప్ కమింగ్ ప్రాజెక్టులకు గాను నిర్మాతలతో ముందే అగ్రిమెంట్స్ చేసుకున్నానని పేర్కొన్నారు. అందుకు కూడా ఒక కారణం ఉందని ప్రశాంత్ వర్మ తెలిపారు. కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దేనికైనా పదార్థాలు ఉంటే సరిపోదని వ్యాఖ్యానించారు.
రుచికరమైన ఏ వంట చేయాలన్నా కూడా కచ్చితంగా కావాల్సినంత సమయం కేటాయించాలని తెలిపారు. అలాగే ఏ సినిమాకు అయినా షూటింగ్ పూర్తి అయిపోతే సరిపోదని చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా కొంత సమయం పడుతుందని అన్నారు. ముఖ్యంగా వీఎఫ్ ఎక్స్ కు అధిక ప్రాధాన్యం ఉండే సినిమాలకు చాలా సమయం కావాలని చెప్పారు.
అందుకు నిర్మాతలు ఎక్కువ టైమ్ ఇవ్వగలిగితే ఫలితం బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ కామెంట్స్ పై జోరుగా చర్చ సాగుతోంది. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. కాగా, హనుమాన్ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ.. ఇప్పటి వరకు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. దానికి అనేక కారణాలు ఉన్నా.. త్వరలో జై హనుమాన్ మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది.