ప్ర‌కాష్‌రాజ్ ఈ లాజిక్ ఎలా మిస్స‌య్యాడు?

కోవిడ్ త‌రువాత భ‌యంతో ప్రేక్ష‌కుడు థియేట‌ర్ల‌లకు రాక‌పోవ‌డంతో తీవ్ర ఇబ్బందుల్ని ఇండ‌స్ట్రీ ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే.;

Update: 2025-12-27 23:30 GMT

న‌టీన‌టులని ప్రేక్ష‌కులు డెమిగాడ్స్‌గా పూజించే రంగం సినిమా. అలాంటి ప్రేక్ష‌కులు త‌మ ఫేవ‌రేట్ న‌టుల కోసం క‌న్న వారినీ, త‌మ కెరీర్‌ని ప‌నంగా పెట్టి సినిమా థియేట‌ర్ల చుట్టు చ‌క్క‌ర్లు కొడుతుంటారు. వారి సినిమా రిలీజ్ అయిందంటే థియేట‌ర్ల వ‌ద్ద తెల్ల‌వారు జామునే లైన్‌ల‌లో నిల‌బ‌డి ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా టికెట్‌లు కొని సినిమాలు చూస్తుంటారు. వారిలో అభిమాలైన వారి గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. అమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిందంటే బ‌ట్ట‌లు చించుకున్నంత ప‌ని చేస్తారు.

వారే లేక‌పోతే స్టార్లు లేరు, ఇండ‌స్ట్రీలు ఉండ‌వు. సాధార‌ణ స్థాయి నుంచి స్టార్ హీరోలుగా, పాన్ ఇండియా స్టార్లుగా మారారంటే దానికి అభిమానులు, స‌గ‌టు సినీ ప్రేక్ష‌కులే కార‌ణం. కోట్ల ఖ‌రీదు చేసే భ‌వంతులు, ల‌గ్జ‌రీ కార్లు, విదేశాల్లో విహారం వంటివి స్టార్లు చేస్తున్నార‌న్నా.. స‌మాజంలో వారికి గౌర‌వ మ‌ర్యాద‌లు ల‌భిస్తున్నాయ‌న్నా దానిక ప్ర‌ధాన కార‌ణం స‌గ‌టు ప్రేక్ష‌కులు, అభిమానులే. అలాంటి వారు సినిమాలు చూడ‌టం మానేస్తే ఏమౌతుంది? ఇండ‌స్ట్రీ కుదేలైపోతుంది.

అలాంటి ఆడియ‌న్స్‌పై తాజాగా నోరు పారేసుకున్నాడు ప్ర‌కాష్‌రాజ్‌. సినిమాలు చేసే వాళ్లు లేక‌పోతే తాను లేన‌ని, కోట్లు పారితోషికాలుగా తీసుకునే స్టార్స్‌, డైరెక్ట‌ర్స్‌, ప్రొడ్యూస‌ర్స్ లేర‌నే లాజిక్‌ని మ‌ర్చిపోయాడ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. తాజాగా సీఐటీయూ మ‌హాస‌భ‌ల కోసం విశాఖ వ‌చ్చిన ప్ర‌కాష్‌రాజ్ మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పెద్ద సినిమాల‌కు టికెట్‌రేట్ల పెంపు గురించి అడిగిన ప్ర‌శ్న‌కు స్పందిస్తూ `సినిమాలు చూడ‌కండి. ఎవ‌డి వ్యాపారం వాడిది` అన్నారు.

కోవిడ్ త‌రువాత భ‌యంతో ప్రేక్ష‌కుడు థియేట‌ర్ల‌లకు రాక‌పోవ‌డంతో తీవ్ర ఇబ్బందుల్ని ఇండ‌స్ట్రీ ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో స్టార్స్ సైతం ఏంటీ ప‌రిస్థిత‌ని భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అలాంటి ప‌రిస్థితుల్లో మీకు మేమున్నామంటూ తెలుగు రాష్ట్రాల ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. సినిమాల‌కు అలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కాసుల వ‌ర్షం కురిపించారు. అలాంటి ప్రేక్ష‌కులు టికెట్ రేట్లు పెరిగాయ‌ని ప్ర‌శ్నిస్తే సినిమాలు చూడ‌కండ‌ని ప్రేక్ష‌కుల వ‌ల్ల ఈ స్టేజ్‌కి చేరిన ప్ర‌కాష్ రాజ్ మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌ని ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు.

ప్రేక్ష‌కుల కార‌ణంగా నేమ్‌ని, ఫేమ్‌ని పొంద‌డ‌మే కాకుండా కోట్లు సంపాదించిన ప్ర‌కాష్ రాజ్ సినిమాని ఆరాధించే ప్రేక్ష‌కులు లేక‌పోతే ఇండ‌స్ట్రీనే క‌నుమ‌రుగ‌వుతున్న లాజిక్‌ని ఎలా మ‌రిచాడ‌ని చివాట్లు పెడుతున్నారు. ప్రీమియ‌ర్ షోల‌కు ప్రేక్ష‌కులు లేక‌పోయినా.. సినిమా రిలీజ్ అయిన ఫ‌స్ట్ డే పెద్ద‌గా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌క‌పోయినా ఆ సినిమాల ప‌రిస్థితి ఎంత దారుణంగా మారుతుందో అర్థం చేసుకోవ‌చ్చు. టికెట్ రేట్లు పెరిగాయంటే మాదేం పోయింది సినిమాలు చూడ‌కండి అంటూ ప్ర‌కాష్ రాజ్ స్టేట్‌మెంట్ ఇవ్వ‌డంపై స‌గ‌టు ప్రేక్ష‌కుడు మండిప‌డుతున్నాడు. ఇవే మాట‌లు అన్న వ‌ర్మ ప‌రిస్థితి ఏ స్థాయికి చేరిందో ఒక సారి గుర్తు చేసుకోమ‌ని చీవాట్లు పెడుతూ వార్నింగ్ ఇస్తున్నారు.

Tags:    

Similar News