ప్ర‌కాష్ రాజ్ పుల్ టైమ్ రంగంలోకి దిగే స‌మ‌యం ఆస‌న్నం!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, విలన్ పాత్రల నుండి ప్రధాన పాత్రల వరకు తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్

Update: 2026-08-20 10:30 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, విలన్ పాత్రల నుండి ప్రధాన పాత్రల వరకు తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్ . కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సమాజంలో జరిగే అనేక ప్రజా సమస్యలపై ఎప్పుడూ గళం విప్పుతూ బాధ్యత గల పౌరుడిగా నిలు స్తుంటారు. అలాగే ప్ర‌కాష్ రాజ్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఇకపై పార్ట్ టైమ్ పాలిటిక్స్ పక్కన పెట్టి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారితే బాగుంటుందని కొందరు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల కాలంలో ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన కొన్ని కీలక నిరసనలకు ..ప్రజా ఉద్యమాలకు ప్రకాష్ రాజ్ స్వయంగా అండగా నిలిచారు. ఎలాంటి భయాలకు లోనవకుండా నిలదీసే తత్వం, సామాజిక అంశాలపై ఆయన స్పందించే తీరు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పరిణామాల కారణంగా సోషల్ మీడియాలో ఆయనకు లభిస్తున్న ఫాలోయింగ్ అకస్మాత్తుగా రెట్టింపు అయింది. ప్రజల పక్షాన నిలబడే నాయకుడిగా ఆయనకు సోషల్ మీడియాలో వస్తున్న మద్దతు చూస్తుంటే? ఆయన రాజకీయ ప్రస్థానానికి ఇదే సరైన సమయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

సినిమా రంగం వేరు, రాజకీయ రంగం వేరు. ఒకే సమయంలో నటుడిగా కెమెరా ముందుకు వ‌చ్చి.. మరోవైపు రాజకీయ పోరాటాలు చేయడం అనేది రెండు పడవల ప్రయాణం లాంటిదని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండు రంగాలలోనూ వంద శాతం న్యాయం చేయడం ఎవరికైనా కష్టమే. ప్రకాష్ రాజ్ లాంటి బలమైన విజన్, ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తి సినిమాలకే పరిమితమైతే సమాజం మంచి నాయకుడిని కోల్పోతుందని వాదిస్తున్నారు. ఆయనకున్న గొంతుకకు, ప్రజాధారణకు పూర్తి స్థాయి రాజకీయాలు మాత్రమే సరైన వేదిక అవుతాయని గట్టిగా నమ్ముతున్నారు.

అయితే ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు వివిధ పార్టీల్లో ఉన్నా? తాను సినిమాలను వదిలేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ వచ్చారు. నటన తన ఉసురు అని, ప్రజల కోసం పోరాడటానికి సినిమానే తనకు శక్తిని ఇస్తుందని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే ప్రజా నాయకుల అవసరం చాలా ఉంది. కేవలం ఎన్నికల సమయంలో లేదా అప్పుడప్పుడు స్పందించడం కంటే గ్రౌండ్ లెవెల్‌లో ఉండి సమస్యలను పరిష్కరించే పూర్తి స్థాయి లీడర్‌గా ప్ర‌కాష్ రాజ్ మారాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఒకవైపు నటుడిగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూనే మరోవైపు ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయడం ప్రకాష్ రాజ్ ప్రత్యేకత. కానీ ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు సమాజంలో మరింత లోతుగా ప్రభావం చూపించాలంటే పార్ట్ టైమ్ పాలిటిక్స్ సరిపోవనేది రాజకీయ పరిశీలకుల వాదన. ఆయన గనుక సినిమాలను పక్కన పెట్టి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడితే భవిష్యత్తులో బలమైన జాతీయ స్థాయి రాజకీయ నాయకుడిగా ఎదుగుతారనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.

విద్యార్థుల నిరసనలకు అండగా నిలవడం ద్వారా మరోసారి తాను కేవలం రీసార్ట్ నటుడిని కాదని, నిజ జీవిత హీరో అని ప్రకాష్ రాజ్ నిరూపించుకున్నారు. ఈ సానుకూల వాతావరణాన్ని, అభిమానుల మద్దతును ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఏ విధంగా ఉపయోగిస్తారనేది ఆసక్తికరం. ప్ర‌కాష్ వ్యక్తిగత నిర్ణయం ఎలా ఉన్నా? పూర్తి స్థాయి రాజకీయాలు చేయాలనే నిపుణుల సలహా మాత్రం టాలీవుడ్ - పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News