'చివరి నిమిషంలో సెట్స్ లోనే చనిపోతా'.. ప్రగతి మరోసారి స్ట్రాంగ్ కౌంటర్
టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి అందరికీ తెలిసిందే. ఓవైపు యాక్టింగ్ లో.. మరోవైపు వెయిట్ లిఫ్టింగ్ లో తనదైన టాలెంట్ తో ఆకట్టుకుంటున్నారు.;
టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి అందరికీ తెలిసిందే. ఓవైపు యాక్టింగ్ లో.. మరోవైపు వెయిట్ లిఫ్టింగ్ లో తనదైన టాలెంట్ తో ఆకట్టుకుంటున్నారు. ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో ఏకంగా గోల్డ్ మెడల్ తో పాటు 4 పతకాలు సాధించి అదరగొట్టారు. మన దేశానికి గర్వకారణంగా నిలిచారు.
అయితే కొన్ని రోజుల క్రితం తనకు సినిమాలు అంటే ప్రాణమని తెలిపారు ప్రగతి. అంతే కాదు.. తాను సెట్ లోనే చనిపోతానని భావోద్వేగంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇచ్చారు. ఓ మీడియా పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ప్రగతి.. పలు కామెంట్స్ చేయగా, అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
సినిమా సెట్ లోనే చనిపోతానని వ్యాఖ్యలను ముందుగా సమర్థించుకున్నారు ప్రగతి. రెజ్లింగ్‌లో పాల్గొని దేశానికి పతకాలు సాధించిన తర్వాత తాను అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఆమె వివరించారు. తాను సినిమాలు మానేసి పవర్ లిఫ్టింగ్ కు వెళ్లిపోయానని అంతా అనడంతో బాధేసిందని చెప్పుకొచ్చారు.
వాళ్లు హెల్ప్ చేయకపోవడమే గాక ఉన్నది కూడా ఊడగొడుతున్నారన్న ఫీలింగ్ వచ్చిందని, అది కరెక్ట్ కాదని చెప్పారు. సినిమాలు లేకపోతే తాను లేనని, తాను చాలా మంచి ఆర్టిస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు చేసిన ప్రతి క్యారెక్టర్ కు ప్రాణం పోశానని, రెండు సార్లు నంది అవార్డు అందుకున్నానని తెలిపారు.
అంత కచ్చితంగా, అంత ప్రొఫెషనల్‌గా చేసేటప్పుడు తాను సినిమాలు మానేసి వెళ్లిపోయానని వాళ్లకు వాళ్లుగా ఊహించుకుని అనడం నచ్చలేదని తెలిపారు. అందుకే స్ట్రాంగ్ గా చెప్పడం కోసం అలా అన్నానని వివరించారు. సినిమాల్లో నటించడం ఆపేసే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టంగా ప్రగతి తెలిపారు.
తాను చచ్చినా, లాస్ట్ మినిట్ సినిమా సెట్లోనే చస్తాను కానీ ఇంకెక్కడా కాదని వ్యాఖ్యానించారు. ఏం జరిగినా.. ఎన్ని జరిగినా.. తాను సినిమాలను వదులుకోనని ప్రగతి చెప్పారు. ఆ విషయాన్ని చాలా గట్టిగా.. స్పష్టంగా చెబితేనే అందరికీ తెలుస్తుందని, అందుకే చెప్పానంటూ.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
ఆ తర్వాత జిమ్ చేస్తున్న వీడియోలపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ పై మాట్లాడారు. జిమ్ లో తాను అంత దరిద్రంగా ఏమీ చేయట్లేదని, వ్యాయామం చేసుకుంటున్నానని తెలిపారు. కానీ తాను చేసే దాంట్లో సగంలో సగం కూడా ఒక్కొక్కడు చేయలేడని, కానీ ఆ వీడియోల కింద బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారని అన్నారు. తాను నాలుగు మెడల్స్ తెచ్చానని గుర్తు చేసుకున్నారు.