బాక్సాఫీస్: ప్రదీప్ 'డ్యూడ్' ఓపెనింగ్స్.. గత సినిమాలతో పోలిస్తే..
మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్ నిర్మించడంతో, ఈ సినిమాపై తెలుగు, తమిళ భాషల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.;
'లవ్ టుడే', 'డ్రాగన్'.. ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్లతో సౌత్ ఇండియాలో తనకంటూ ఒక మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు అతను నటించిన మూడో చిత్రం 'డ్యూడ్', దీపావళి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్ నిర్మించడంతో, ఈ సినిమాపై తెలుగు, తమిళ భాషల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
అయితే, సినిమా విడుదలైన తర్వాత ఆడియన్స్ నుంచి డిఫరెంట్ టాక్ వస్తోంది. ప్రదీప్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో, మార్క్ టైమింగ్‌తో కమర్షియల్ గా మరోసారి అదరగొట్టాడని తెలుస్తోంది. కానీ, కథనం పరంగా చూస్తే, గత రెండు సినిమాలైన 'లవ్ టుడే', 'డ్రాగన్' స్థాయిలో ఈ సినిమా లేదనే అభిప్రాయం కూడా ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. ఆ మ్యాజిక్ ఇందులో కాస్త మిస్ అయిందని అంటున్నారు.
ఇక టాక్‌తో సంబంధం లేకుండా, 'డ్యూడ్' బాక్సాఫీస్ వద్ద ప్రదీప్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ను నమోదు చేసింది. సినిమా సినిమాకు అతని మార్కెట్ ఎంతలా పెరుగుతుందో చెప్పడానికి ఈ ఓపెనింగ్స్ ఒక ఉదాహరణ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఊహించని రేంజ్‌లో ఓపెన్ అయింది. ఇక్కడి పోటీగా ఉన్న సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' కంటే కూడా 'డ్యూడ్'కు మంచి ఓపెనింగ్స్ రావడం విశేషం. ఇక ఓవర్సీస్‌తో కలుపుకుంటే, మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.22 కోట్ల గ్రాస్‌ను అందుకుని, ప్రదీప్ కెరీర్‌లో ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్‌గా నిలిచింది.
గత సినిమాల ఓపెనింగ్ చూస్తే.. (అంచనా)
లవ్ టుడే: 4.33 కోట్లు
డ్రాగన్: 6 కోట్లు
డ్యూడ్: 22కోట్లు
అయితే, అసలు సిసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. మొదటి రోజు కలెక్షన్లు హీరో స్టార్‌డమ్‌ను చూపిస్తే, లాంగ్ రన్ మాత్రం కంటెంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు శనివారం, రేపు ఆదివారం, ఆ తర్వాత సోమ, మంగళవారాల్లో దీపావళి సెలవులు.. ఇలా సినిమాకు ఒక ఫెంటాస్టిక్ లాంగ్ వీకెండ్ దొరికింది.
శుక్రవారం కంటే శనివారం కలెక్షన్లు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. మొత్తం మీద, ప్రదీప్ తన స్టార్ పవర్‌తో ఓపెనింగ్స్ అదరగొట్టాడు. కానీ, ఈ మిక్స్ డ్ టాక్‌ను అధిగమించి, పండగ సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతవరకు థియేటర్లకు రప్పిస్తుందనే దానిపైనే సినిమా ఫైనల్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఈ లాంగ్ వీకెండ్‌ను సినిమా ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.