కొత్త హీరో మూడోసారి 100 కోట్లు అందుకుంటాడా?

ఈ సినిమాపై తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగులో 'మైత్రీ మూవీ మేకర్స్' లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటంతో బజ్ రెట్టింపు అయ్యింది.;

Update: 2025-10-15 17:30 GMT

సౌత్ ఇండియన్ సినిమాలో ప్రస్తుతం సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌లను పక్కనపెట్టి, యూత్‌కు కనెక్ట్ అయ్యే కంటెంట్‌తో వస్తున్న యంగ్ టాలెంట్స్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. ఈ కొత్త వేవ్‌కు అతిపెద్ద ఉదాహరణ ప్రదీప్ రంగనాథన్. దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి, అనుకోకుండా హీరోగా మారి, ఇప్పుడు కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ స్టార్‌గా ఎదిగాడు. కేవలం రెండు సినిమాలతోనే వందల కోట్ల వసూళ్లు సాధించి, ఇప్పుడు మూడో సినిమాతో అరుదైన రికార్డుకు గురిపెట్టాడు.

ఈమధ్య కాలంలో ఏళ్లతరబడి కొనసాగుతున్న కొందరి హీరోలకు సైతం సాధ్యం కాని ఫీట్ కావడంతో ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. ప్రదీప్ పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అవ్వడానికి కారణం 'లవ్ టుడే'. మొబైల్ ఫోన్ మార్చుకోవడం అనే సింపుల్, రిలేటబుల్ కాన్సెప్ట్‌తో నేటితరం యువతను ఆకట్టుకొని బ్లాక్‌బస్టర్ విజయం సాధించాడు. ఆ సినిమా ఊహించని విధంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి, ప్రదీప్‌ను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది.

అయితే, అతను లక్కుతో హిట్టు అందుకోలేదని 'డ్రాగన్'తో నిరూపించుకున్నాడు. ఆ సినిమాతో తన స్టార్‌డమ్‌ను పటిష్టం చేసుకోవడమే కాకుండా, వరుసగా రెండోసారి 100 కోట్ల క్లబ్‌లో చేరి, తన బాక్సాఫీస్ స్టామినాను చాటి చెప్పాడు. దీంతో ప్రదీప్ మార్కెట్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అతని కెరీర్‌లో అత్యంత కీలకమైన 'డ్యూడ్' చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాపై తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగులో 'మైత్రీ మూవీ మేకర్స్' లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటంతో బజ్ రెట్టింపు అయ్యింది. పండగ సీజన్‌లో విడుదలవుతున్న చిత్రాలన్నింటిలో 'డ్యూడ్'కే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కచ్చితంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాలి.

ఒకవేళ 'డ్యూడ్' కూడా 100 కోట్ల మార్క్‌ను దాటితే, ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ 100 కోట్ల హీరోగా చరిత్ర సృష్టిస్తాడు. కోలీవుడ్‌లో పెద్ద స్టార్స్‌గా వెలుగొందుతున్న ధనుష్, శివకార్తికేయన్, కార్తీ వంటి హీరోలు సైతం కెరీర్‌లో ఎన్నో వంద కోట్ల సినిమాలు చేసినా, వరుసగా మూడు సార్లు ఈ ఫీట్ సాధించలేదు. ఈ అరుదైన రికార్డును ప్రదీప్ అందుకుంటే, అతని పేరు సౌత్ ఇండియాలోని టాప్ లీగ్ హీరోల సరసన చేరడం ఖాయం. మరి ఈ యంగ్ సెన్సేషన్ తన హ్యాట్రిక్ లక్ష్యాన్ని చేరుకుంటాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News