ఒకే ఏడాదిలో ఆ ముగ్గురు హీరోలు 2000 కోట్లు.. ప్ర‌భాస్ ఒక్క‌డే 1800 కోట్లు!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు రూ. 100 కోట్లు అనేది ఒక మైలురాయి. కానీ కాలక్రమేణా మార్కెట్ విస్తృతి పెరగడంతో ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలు వేల కోట్లలోకి చేరాయి.;

Update: 2026-03-29 03:15 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు రూ. 100 కోట్లు అనేది ఒక మైలురాయి. కానీ కాలక్రమేణా మార్కెట్ విస్తృతి పెరగడంతో ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలు వేల కోట్లలోకి చేరాయి. తాజాగా ఇండియన్ సినిమా చరిత్రలో ఒకే ఏడాదిలో రూ. 2000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన అరుదైన క్లబ్‌లో కేవలం ముగ్గురు హీరోలు మాత్రమే నిలవగా టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఒకే ఏడాది ఒకే సినిమాతో ఏకంగా 1800కోట్లు వ‌సూలు చేయ‌డం విశేషం. షారుఖ్ ఖాన్- అక్షయ్ ఖన్నా- రణవీర్ సింగ్ ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో 2000 కోట్ల క్ల‌బ్ ఘనత సాధించి ట్రేడ్ వర్గాలలో చ‌ర్చ‌గా మారిన క్ర‌మంలో మ‌న ప్ర‌భాస్ ఎక్క‌డ ఉన్నాడు? అనే చ‌ర్చా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

రికార్డుల వేట‌లో ఖాన్ ముందు వ‌రుస‌లోనే ఉన్నా.. ప్ర‌భాస్ హ‌వా ముందు అత‌డు తేలిపోయిన‌ట్టే క‌నిపించాడు. అయితే 2000 కోట్ల క్లబ్ రికార్డును మొదటగా 2023లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ప్రారంభించారు. ఆ ఏడాది అత‌డు నటించిన `పఠాన్`, `జవాన్`, `డంకీ` చిత్రాలు వరుసగా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. పఠాన్ రూ. 1055 కోట్లు, జవాన్ సుమారు రూ. 1160 కోట్లు, డంకీ రూ. 470 కోట్ల వరకు వసూలు చేయడంతో ఆ ఒక్క ఏడాదిలోనే షారుఖ్ సినిమాల మొత్తం వసూళ్లు సుమారు రూ. 2685 కోట్లు దాటి సరికొత్త చరిత్రను సృష్టించాయి.

అనంతరం 2025లో సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా 2000 కోట్ల‌ క్లబ్‌లో రెండో సభ్యుడిగా చేరారు. అత‌డు నటించిన `ఛావా` చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 809 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే ఏడాది డిసెంబర్‌లో విడుదలైన భారీ చిత్రం `దురంధర్` (పార్ట్ 1) ఏకంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ రెండు సినిమాలతో అక్షయ్ ఖన్నా ఖాతాలో ఒకే ఏడాదిలో రూ. 2000 కోట్లకు పైగా వసూళ్లు వచ్చి చేరాయి. ఇది అత‌డి కెరీర్‌లోనే ఒక భారీ ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది.

ప్రస్తుతం 2026లో రణవీర్ సింగ్ ఈ ఘనత సాధించిన మూడవ హీరోగా నిలిచారు. `దురంధర్` మొదటి భాగం సుమారు రూ. 1350 కోట్లు రాబట్టగా.. దానికి సీక్వెల్‌గా వచ్చిన `దురంధర్ 2` అప్పుడే 1100 కోట్లకు పైగా వసూలు చేసి ఇంకా థియేటర్లలో దిగ్విజయంగా ప్రదర్శించబడుతోంది. దీంతో రణవీర్ కూడా ఒకే సంవత్సరంలో రూ. 2000 కోట్ల మార్కును సునాయాసంగా అధిగ‌మించారు. అయితే ప్ర‌భాస్ త‌ర్వాత చాలా కాలానికి ఈ ముగ్గురు హీరోలు భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరో మెట్టు ఎక్కించడానికి త‌మ వంతు కృషి చేసార‌ని అంగీక‌రించ‌వ‌చ్చు.

అయితే టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఎక్కడ ఉన్నారనే ప్రశ్నకు జవాబు ఏమిటో ఇప్పుడు స్ప‌ష్ఠ‌త వ‌చ్చిన‌ట్టే. ప్రభాస్ నటించిన చిత్రాలు ఇప్పటికే రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించాయి. ఆస‌క్తిక‌రంగా ప్ర‌భాస్ న‌టించిన `బాహుబ‌లి 2` చిత్రం ఒకే ఏడాదిలో ఏకంగా 1800 కోట్లు వ‌సూలు చేసింది. అంటే ప్ర‌భాస్ కి రెండు సినిమాల స్టామినా ఒకే సినిమాతో ఉంద‌ని నిరూప‌ణ అయింది. ఒక సినిమాతోనే ఆ ముగ్గురు స్టార్ల‌కు ద‌రి దాపుల్లోనే ఉన్నాడు ప్ర‌భాస్. కానీ ఒకే క్యాలెండర్ ఇయర్‌లో రెండు లేదా మూడు భారీ చిత్రాలు విడుదలై ఆ మొత్తం వసూళ్లు రూ. 2000 కోట్లు దాటడం అనే రికార్డు ప్రస్తుతానికి పై ముగ్గురి వద్దే ఉంది. అయితే రాబోయే రోజుల్లో దురంధ‌ర్ 2 రికార్డుల‌ను బ్రేక్ చేసే టాప్ స్టార్లు మ‌న టాలీవుడ్ లోనే ఉన్నారు. మన దక్షిణాది హీరోలు 2000 కోట్లు మించి.. అసాధ్యమైన మార్కును అందుకుంటారని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News