స్పీడు పెంచిన వంగా.. 2027 బాక్సాఫీస్ టార్గెట్ ఫిక్స్!

ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న‌ట్టు ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ వెల్ల‌డించ‌డంతో ఈ పాత్ర‌పై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి.

Update: 2026-05-27 05:16 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్పిరిట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత వంగా దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా గమనిస్తున్నాయి. తాజాగా మూవీ షూటింగ్‌కు సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఇటీవలే హీరోయిన్ త్రిప్తి డిమ్రీ షూటింగ్‌లో జాయిన్ కాగా, ప్రభాస్- త్రిప్తిపై కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లోని అజీజ్‌నగర్ పరిసరాల్లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక రేపటి నుంచి హైదరాబాద్‌లోని ప్రసిద్ధ కోటి ఉమెన్స్ కాలేజీలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, త్రిప్తి మధ్య వచ్చే కీలక సన్నివేశాలతో పాటూ కొన్ని ఇంటెన్స్ ఎపిసోడ్స్‌ను కూడా షూట్ చేయ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కాలేజీ పరిసరాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని, షూటింగ్ కోసం భారీ సెటప్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న‌ట్టు ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ వెల్ల‌డించ‌డంతో ఈ పాత్ర‌పై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. ఇప్పటివరకు ప్ర‌భాస్ చేసిన పాత్రలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా, మరింత రఫ్ అండ్ ఇంటెన్స్‌గా ఉండబోతుందని సమాచారం. వంగా స్టైల్‌కు తగ్గట్టుగా హీరో పాత్రను బలమైన ఎమోషన్స్, హై ఓల్టేజ్ యాక్షన్‌తో డిజైన్ చేసినట్లు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడం, ప్రభాస్ లుక్‌పై సోషల్ మీడియాలో భారీ చర్చ జరగడం సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

ఇక బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుండటం మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ఇటీవల ప్రభాస్ ప‌ని విధానంపై వివేక్ ఒబెరాయ్ ప్రశంసలు కురిపించడం కూడా వార్తల్లో నిలిచింది. ఇద్దరి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ సినిమాకు హైలైట్ అవుతాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ సినిమా కోసం హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాను 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో స్పిరిట్ పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ప్రభాస్‌ను మాస్, వైలెంట్ పోలీస్ పాత్రలో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News