స్పిరిట్ వర్సెస్ దీపిక: వంగా బ్రదర్స్‌ని విమర్శించేవాళ్లకు తెలియాల్సినవి!
ఈ వివాదం ముగిసి నెలలు గడుస్తున్నా.. ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో లేదా పాడ్‌కాస్ట్‌లలో ఇంకా దీపికా పేరునే ప్రస్తావించడంపై నెటిజన్లు వంగా సోదరులను టార్గెట్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న `స్పిరిట్` చిత్రం చుట్టూ వివాదాలు ఆగేలా కనిపించడం లేదు. ఈ ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొణె తప్పుకోవడం.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ `రెడిట్`లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ముఖ్యంగా నార్త్, సౌత్ నెటిజన్ల మధ్య ఒక విధంగా `ఫ్యాన్ వార్` వాతావరణం నెలకొంది. స్పిరిట్ నుంచి దీపికను తొలగించి తప్పు చేసారని నార్త్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ మార్కెట్ స్థాయి ముందు దీపికా స్టార్‌డమ్ తక్కువేనని సౌత్ ఫ్యాన్స్ వాదిస్తుంటే.. సోలోగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఓపెనింగ్స్ తెచ్చే సత్తా దీపికాకు ఉందంటూ బాలీవుడ్ వర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి.
ఈ వివాదం ముగిసి నెలలు గడుస్తున్నా.. ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో లేదా పాడ్‌కాస్ట్‌లలో ఇంకా దీపికా పేరునే ప్రస్తావించడంపై నెటిజన్లు వంగా సోదరులను టార్గెట్ చేస్తున్నారు. వంగా బ్రదర్స్ ఇంకా ఆ విషయం నుంచి బయటకు రాలేకపోతున్నారంటూ విమర్శిస్తున్నారు. చిత్రంలో కథానాయికగా నటిస్తున్న త్రిప్తి దిమ్రి కంటే ఎక్కువగా దీపికా పేరే వార్తల్లోకి రావడానికి వంగా బ్రదర్స్ కారణమట. ఇదే సమయంలో `మేల్ వర్సెస్ ఫిమేల్ డామినెన్స్` అనే పాయింట్‌ను కొందరు లేవనెత్తుతున్నారు. స్టార్ హీరోలు భారీ పారితోషికాలు.. బిజినెస్ షేర్లు అడిగితే దానిని సాధారణంగా భావించే నిర్మాతలు.. ఒక అగ్ర నటి తన పారితోషికం లేదా వర్కింగ్ అవర్స్ (పనివేళలు) గురించి నిబంధనలు పెడితే ఎందుకు రచ్చ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ విషయంలో నెటిజన్లు గమనించాల్సిన మరో కోణం కూడా ఉంది. స్పిరిట్ నుంచి తప్పుకోగానే ఈ సినిమా కథ గురించి తప్పుగా ప్రచారం చేయడం, లీకులు ఇవ్వడం వంటి పనులను దీపికా పీఆర్ టీమ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు మన దేశంలో సినిమా టికెట్ తెగేది హీరో ఫేస్ వాల్యూ చూసి మాత్రమేనని.. కేవలం హీరోయిన్ గ్లామర్ కోసమే ప్రేక్షకులు థియేటర్లకు రారని వంగాకు మద్దతుగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. షూటింగ్ సెట్స్‌లో పట్టువిడుపు లేకపోతే ఎలా? రూల్స్ పెట్టుకుంటే అది ప్రాజెక్ట్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందని.. మాట్లాడే పద్ధతి బాగుంటే దర్శకరచయితలు కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉంటారని దీపిక సహనటీమణులు గతంలో సూచించారని వంగా వైపు నిలిచిన నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.
మరోవైపు వంగా సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని.. కేవలం ఫ్లవర్ పాట్ లేదా గ్లామర్ పాత్రలకే పరిమితం చేస్తారంటూ కొందరు చేసిన కామెంట్స్ అసంబద్ధమని విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. నిజానికి సందీప్ వంగాతో పనిచేసిన నటీమణులకు వచ్చిన క్రేజ్ అసాధారణమైనది. వారిలోని ఇన్నర్ టాలెంట్‌ను బయటకు తీసి మంచి గుర్తింపు తెచ్చింది సందీపే. `అర్జున్ రెడ్డి` తో షాలిని పాండే, `యానిమల్`తో రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి కెరీర్ రేంజ్ విపరీతంగా పెరిగింది తప్ప తగ్గలేదు. కబీర్ సింగ్ తో కియరా రేంజును పెంచింది వంగానే. స్వయంగా ఆ నటీమణులే ఈ విషయాన్ని పలుమార్లు అంగీకరించారు. `యానిమల్`లో అద్భుతమైన నటన కనబరిచినందుకే త్రిప్తికి `స్పిరిట్`లో అవకాశం దక్కింది.
మొత్తానికి వంగా బ్రదర్స్‌పై అనవసరమైన నెగెటివ్ కామెంట్లు చేసేది ప్రధానంగా నార్త్ నెటిజన్లు మాత్రమేనని.. సౌత్ సినీ వర్గాల్లో వారి వర్కింగ్ స్టైల్‌పై పూర్తి నమ్మకం ఉందని స్పష్టమవుతోంది. ఒక నటిగా దీపికా డిమాండ్లు తన వ్యక్తిగతమైనవి... సినిమా ప్రొడక్షన్ అవసరాలు, హీరోల బాక్సాఫీస్ క్రేజ్ ఆధారంగా ప్రణాళికలు మార్చుకోవడం ప్రొడ్యూసర్స్ హక్కు. ఈ చిన్న విషయాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ.. దర్శకనిర్మాతల ప్రతిష్టను దెబ్బతీయాలని చూసే నెగెటివ్ ప్రచారాలకు కాలమే సమాధానం చెప్తుందని కొందరు నేరుగా `వంగా బ్రదర్స్`కి మద్ధతునిస్తున్నారు. ఇటీవల స్పిరిట్ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా మీడియా చాటింగ్ లో పాల్గొనగా, దీపిక ఎగ్జిట్ పై డిబేట్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చి వేడెక్కిస్తోంది.