ప్రశాంత్ తో ప్రభాస్ 2029 ఎన్నికలు తర్వాతే?
ఒక క్రియేటివ్ డైరెక్టర్‌గా ప్రశాంత్ వర్మ ప్రభాస్ డేట్స్ కోసం మూడు నాలుగేళ్లు వేచి చూడటం ప్రాక్టికల్‌గా కష్టమైన విషయమే.
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `హనుమాన్` ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హోంబళే ఫిల్మ్స్ నిర్మాణంలో ఓ భారీ చిత్రం రాబోతుందనే వార్త టాలీవుడ్ వర్గాల్లో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. గతంలోనే ఈ కాంబోపై భారీ ప్రచారం జరిగినా? అధికారిక ప్రకటన రాకపోవడంతో అది కేవలం పుకారుగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ చర్చ తెరపైకి రావడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. కానీ పరిశ్రమలోని సమీక రణాలను గమనిస్తే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కడం సాధ్యమేనా? అనే ప్రాక్టికల్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ డైరీ అత్యంత బిజీగా ఉంది. ఆయన చేతిలో ఇప్పటికే `ఫౌజీ`, `స్పిరిట్`, `కల్కి`2, 'సలార్ 2',వంటి భారీ పాన్-ఇండియా చిత్రాలు లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాలు పూర్తి చేయడానికే ప్రభాస్‌కు మూడు నుండి నాలుగేళ్ల సమయం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతటి టైట్ షెడ్యూల్‌లో సరికొత్త ప్రాజెక్ట్‌ను ఒప్పుకోవడం ప్రభాస్‌కు అసాధ్యమనే చెప్పాలి. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా తన సొంత సినిమాటిక్ యూనివర్స్ (PVCU) పనుల్లో బిజీగా ఉన్నారు. `హనుమాన్` భారీ విజయం తర్వాత ఆయన `జై హనుమాన్తో` పాటు మరికొన్ని సూపర్ హీరో కథలను సిద్ధం చేసి పెట్టుకున్నారు. వాటిలో ఒక్కోటి బయటకు తెస్తున్నారు.
ఒక క్రియేటివ్ డైరెక్టర్‌గా ప్రశాంత్ వర్మ ప్రభాస్ డేట్స్ కోసం మూడు నాలుగేళ్లు వేచి చూడటం ప్రాక్టికల్‌గా కష్టమైన విషయమే. ఎందుకంటే ఈ లోపు ఆయన మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను మార్కెట్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రశాంత్ టైమ్‌లైన్ కూడా ఈ కాంబోకు పెద్ద సవాలే. ఇక్కడే నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. ప్రభాస్‌తో మూడు సినిమాల భారీ డీల్ కుదుర్చుకున్న హోంబళే సంస్థ అందులో ఒకదానిని ప్రశాంత్ వర్మకు అప్పగించాలని భావించిన మాట నిజమే కావచ్చు.
కానీ ప్రభాస్ అందుబాటులో లేకపోతే అంత వరకు ప్రశాంత్ వర్మ క్రేజ్‌ను వృధా చేయకుండా ఉండేందుకు హోంబళే సంస్థ మరో ఆలోచన చేస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రశాంత్ వర్మ సిద్ధం చేసిన కథకు సరిపోయే మరో స్టార్ హీరోను సెట్ చేసి ఈ లోపు ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మకు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ వదిలారా? అన్న అనుమానం కలుగుతోంది. ప్రభాస్ తో సినిమా ఉన్నా? అది 2029 ఎన్నికలు తర్వాతే ఉండే అవకాశాలున్నాయంటున్నారు.