'బాహుబలి: ది ఎపిక్' ట్రైలర్.. ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి?
బాహుబలి ది ఎపిక్ మూవీ మరో రెండు వారాల్లో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;
బాహుబలి ది ఎపిక్ మూవీ మరో రెండు వారాల్లో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఫ్రాంచైజీ సినిమాలు ఒకే పార్ట్ గా బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ కానున్నాయి. బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్ క్లూజన్ చిత్రాలు ఒకే సినిమాగా అక్టోబర్ 31న రానున్నాయి.
అయితే రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమాలను ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రోహిణి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి ఇతర పాత్రల్లో నటించారు. కీరవాణి మ్యూజిక్ అందించారు.
బాహుబలి: ది బిగినింగ్ రిలీజ్ అయ్యి పదేళ్లు పూర్తి అవ్వగా.. ఇప్పుడు రెండు భాగాలు కలిపి ఒకే మూవీగా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సినిమా వర్క్ అంతా కంప్లీట్ అవ్వగా.. ఇప్పుడు రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ ను విడుదల చేసి అందరినీ మెస్మరైజ్ చేయగా.. తాజాగా శుక్రవారం ట్రైలర్ ను తీసుకొచ్చారు.
ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ రొట్టెన్ టమాటోస్ ట్రైలర్స్ తో విడుదల చేయించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా ఎపిక్ వెర్షన్ ట్రైలర్.. అందరినీ ఆకట్టుకుంటోంది. చెప్పాలంటే మళ్ళీ ప్రతి ఒక్క సినీ ప్రియుడికి గూస్ బంప్స్ తెప్పిస్తోందనే కామెంట్స్ వస్తున్నాయి. అద్భుతమైన కట్ తో మెప్పిస్తోంది. సినిమా కోసం ఇంకా ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తోంది.
మహిష్మతి సామ్రాజ్యాన్ని చూపిస్తున్న విజువల్ తో ట్రైలర్ స్టార్ట్ అవ్వగా.. ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. 'నన్ను ఎప్పుడూ చూడని కళ్ళు దేవుడిలా చూస్తున్నాయి. నేనెవరిని?' అంటూ కట్టప్పను ప్రశ్నించే సీన్ రాగా.. అమరేంద్ర బాహుబలి రక్తాన్ని నీవు అని చెబుతారు.
ఆ తర్వాత కాలకేయులతో బాహుబలి- భళ్లాల దేవుడు యుద్ధం, శివుడి అవంతిక లవ్ స్టోరీతో పాటు మాహిష్మతి సామ్రాజ్యం కోసం చేసే పోరాటం సహా రెండు భాగాల్లో నుంచి కీలక సన్నివేశాలు చూపించారు మేకర్స్. దాదాపు అన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ను యాడ్ చేయడం విశేషం. ఇప్పటికే చూసిన సినిమాలే అయినా.. ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. కచ్చితంగా ఎపిక్ వెర్షన్ చూడాలనిపించేలా బజ్ క్రియేట్ చేస్తోంది.
అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఎపిక్ వెర్షన్ లో కొన్ని అన్ సీన్ సన్నివేశాలు ఉంటాయని సినీ ప్రియులు, నెటిజన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ట్రైలర్ లో ఆ సీన్స్ మాత్రం ఎక్కడా కొత్తగా జత చేసినట్లు సీన్స్ కనిపించలేదు. రెండు భాగాల్లోని సన్నివేశాలు మాత్రమే ఉన్నాయి. మరి ఫుల్ మూవీలో అన్ సీన్ సీన్స్ ఉన్నాయో లేదో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి.