పాన్ ఇండియా సింహాసనాన్ని నిర్ణయించే సినిమాలు ఇవే!

భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న డిస్క‌ష‌న్ ఏదైనా ఉందంటే అది నిజమైన పాన్ ఇండియా స్టార్ ఎవరు? అన్నదే.

Update: 2026-06-20 16:30 GMT

భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న డిస్క‌ష‌న్ ఏదైనా ఉందంటే అది నిజమైన పాన్ ఇండియా స్టార్ ఎవరు? అన్నదే. ఒకప్పుడు స్టార్‌డమ్‌ను డిసైడ్ చేసేందుకు వరుస హిట్లు, స్థిరమైన మార్కెట్, అభిమానుల ఆదరణ వంటి అంశాలు ప్రధాన ప్రమాణాలుగా ఉండేవి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద ఈక్వేష‌న్స్ మారిపోతున్నాయి. ఒక భారీ స‌క్సెస్ స్టార్‌ను దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలబెడితే, ఒకే ఒక్క పరాజయం అతని మార్కెట్‌పై ప్రశ్నలు లేవనెత్తే పరిస్థితి ఏర్పడింది.

పాన్ ఇండియా ట్రెండ్‌కు అసలు బాటలు వేసింది ప్రభాస్ అని చెప్పడంలో సందేహం లేదు. బాహుబలి సినిమాల‌తో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, దక్షిణాది సినిమాలకు హిందీ మార్కెట్‌లో ప్రత్యేక స్థానం కల్పించారు. అయితే కాలక్రమంలో కొత్త తరం స్టార్లు ఈ పోటీలోకి రావడంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ పుష్ప ఫ్రాంచైజ్‌తో హిందీ మార్కెట్‌లో అరుదైన స్థాయిలో ఆధిపత్యం చాటగా, షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాల‌తో తన స్టార్ పవర్‌ను మరోసారి నిరూపించారు. మరోవైపు యష్ కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా భారీ అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం పాన్ ఇండియా సింహాసనం కోసం పలువురు స్టార్లు పోటీపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

అయితే ఈ డిస్క‌ష‌న్ కు అసలు సమాధానం రాబోయే కొన్నేళ్లలో రిలీజ్ కానున్న భారీ సినిమాల ద్వారానే లభించే అవకాశం ఉంది. షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్, యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్, అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న AA22xA6 సినిమాలు ఇప్పటికే ఇండ‌స్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ సినిమాలు కేవలం బాక్సాఫీస్ సక్సెస్‌ల‌ కోసమే కాకుండా, ఆయా హీరోల పాన్ ఇండియా స్థాయిని మరింత బలపరచే ప్రాజెక్టులుగా భావిస్తున్నారు.

మరోవైపు ప్రభాస్ పరిస్థితి కూడా ఆసక్తికరంగానే ఉంది. కల్కితో డార్లింగ్ భారీ స‌క్సెస్ ను అందుకున్న‌ప్ప‌టికీ, ది రాజా సాబ్ రిజ‌ల్ట్ తర్వాత ఆయన మార్కెట్‌పై చర్చలు మొదలయ్యాయి. అయినప్పటికీ ఆయన చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులు మరోసారి పరిస్థితిని మార్చే అవకాశముంది. ప్రస్తుతం బాక్సాఫీస్‌లో కనిపిస్తున్న అతిపెద్ద మార్పు స్థిరత్వం లేకపోవడం. ఒకప్పుడు వరుస స‌క్సెస్‌లు సాధించిన స్టార్‌లు సంవత్సరాల పాటు ఆధిపత్యం చెలాయించేవారు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచులు అత్యంత వేగంగా మారుతున్నాయి. కంటెంట్, ప్ర‌మోష‌న్స్, సోషల్ మీడియా ఎఫెక్ట్, వర్డ్ ఆఫ్ మౌత్ వంటి అంశాలు ప్రతి సినిమాకు కొత్త పరీక్షగా మారుతున్నాయి.

అందుకే ఇప్పుడు పాన్ ఇండియా కింగ్ ఎవర‌నే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పడం కష్టమే. రాబోయే కింగ్, టాక్సిక్, AA22xA6, స్పిరిట్, క‌ల్కి2 వంటి సినిమాల రిజ‌ల్ట్స్ మాత్రమే ఈ రేసులో ఎవరు ముందుంటారో నిర్ణయించే అవకాశం ఉంది. అప్పటి వరకు పాన్ ఇండియా సింహాసనం కోసం పోటీ మాత్రం మరింత ఉత్కంఠభరితంగా కొనసాగనుంది.

Tags:    

Similar News