త్రోబ్యాక్: నటగురువు సత్యానంద్‌కు ప్రభాస్ రేర్ గిఫ్ట్
పవన్ కల్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ సహా ఇండస్ట్రీలో దిగ్గజ నటులందరికీ వైజాగ్ సత్యానంద్ నటగురువు అనే విషయం అందరికీ తెలిసిందే.
పవన్ కల్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ సహా ఇండస్ట్రీలో దిగ్గజ నటులందరికీ వైజాగ్ సత్యానంద్ నటగురువు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయనకు శిష్యులందరూ ఏదో ఒక సందర్భంలో అరుదైన ఖరీదైన కానుకల్ని అందజేసిన విషయం గుర్తుంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటన గురువుగా వేలమంది నటులను తీర్చిదిద్దిన సత్యానంద్ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా కొన్నేళ్ల క్రితం డార్లింగ్ ప్రభాస్ అరుదైన వాచ్ ని కానుకగా ఇచ్చారు. అందుకు సంబంధించిన త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు మరోసారి అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
పాన్-ఇండియా స్టార్‌గా తిరుగులేని ప్రజాదరణ పొందిన రెబల్ స్టార్ ప్రభాస్.. తన నటనతోనే కాకుండా నిజ జీవితంలో చూపించే నిరాడంబరత, గురుభక్తితోనూ అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. తనను నటుడిగా తీర్చిదిద్దిన నట గురువు, `స్టార్ మేకర్`గా పేరుగాంచిన ఆ వ్యక్తి పూర్తి పేరు లంక సత్యానంద్. మాస్టార్ కి అరుదైన చేతి గడియారాన్ని బహుమతిగా అందించి తన కృతజ్ఞతను చాటుకున్న వీడియోని ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి వైరల్ చేస్తున్నారు.
ప్రభాస్ ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఇప్పుడు పాన్ వరల్డ్ ని ఢీకొడుతున్నాడు. ఈ సమయంలో ఈ వీడియో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఆ వీడియోలో ప్రభాస్ ఎంతో వినయంగా తన మాస్టర్‌కు వాచ్ బహుకరిస్తూ.. ఆయన మార్గదర్శకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సత్యానంద్ మాస్టర్ చేతికి సరిపోయేలా చిన్న డయల్ ఉన్న వాచ్‌ను వెతికి పట్టుకోవడం ఎంత కష్టమైందో సరదాగా చెబుతూ.. ఆ విలువైన బహుమతిని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభాస్ నవ్వుతూ సూచించారు. ఎంతటి మహోన్నత స్థాయికి ఎదిగినా.. తన ఎదుగుదలకు కారణమైన తొలి గురువును మరిచిపోకుండా ఇలా గౌరవించడం ప్రభాస్ లోని గొప్ప మనస్సుకు.. సంస్కారానికి నిదర్శనమని అభిమానులు, సినీ వర్గాలు ప్రశంసిస్తున్నారు.
తెలుగు చిత్రసీమలో లంక సత్యానంద్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పరిశ్రమకు ఎందరో అగ్ర కథానాయకులను అందించిన ఆయనను అందరూ ప్రేమగా `స్టార్ మేకర్` అని పిలుస్తారు. కేవలం నటనలోనే కాకుండా.. ఆయన స్క్రీన్‌ప్లే రచయితగా కూడా విశేష సేవలు అందించి ప్రతిష్టాత్మక `నంది అవార్డు`ను సొంతం చేసుకున్నారు. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్స్ తమ ప్రయాణంలో సత్యానంద్ మాస్టర్ పాత్రను ఎప్పుడూ గుర్తుంచుకోవడం ఆయన శిక్షణ స్థాయికి నిదర్శనం.
ప్రస్తుతం ప్రభాస్ తన సక్సెస్ గ్రాఫ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. హనురాగవపూడితో ఫౌజీ లాంటి భారీ చిత్రంలో నటించాడు. నాగ్ అశ్విన్ తో కల్కి 2898 ఏడి సీక్వెల్ సహా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 సినిమాలతోను అతడు పాన్ వరల్డ్ బాక్సాఫీస్ ని శాసించబోతున్నాడు.
ఒకవైపు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల వ్యాపారం చేసే పాన్-ఇండియా సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తన మూలాలను, గురువులను గౌరవించే ప్రభాస్ వ్యక్తిత్వం ఆయనను టాలీవుడ్‌లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతోంది. సత్యానంద్ మాస్టర్‌కు ఆయన ఇచ్చిన ఈ బంగారు గడియారం బహుమతి కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు.. ఒక శిష్యుడు తన గురువుకు అందించిన అత్యున్నతమైన ఆత్మీయ గౌరవానికి చిహ్నం.ఈ గోల్డ్ వాచ్ ఖరీదు దాదాపు 25లక్షలు ఉంటుందని సమాచారం.