బోసిపోయిన బాక్సాఫీస్!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతారవరణం వేడెక్కడంతో, సినిమాల హాళ్ల దగ్గర సందడి తగ్గిపోయింది.

Update: 2024-05-06 08:14 GMT

సమ్మర్ లో పెద్ద సినిమాల హడావిడి లేకపోవడంతో, లాంగ్ సీజన్ ను క్యాష్ చేసుకోడానికి అనేక చిన్న మీడియం రేంజ్ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. మార్చి నెలలో ఒకటీ రెండు చిత్రాలు విజయం సాధించగా.. ఏప్రిల్ మాత్రం వృధా అయిపోయింది. 'టిల్లు స్క్వేర్' తర్వాత తెలుగులో ఒక్కటంటే ఒక్క మూవీ కూడా బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకోలేదు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమా తీవ్ర నిరాశ పరిచింది. కొన్ని చిన్న సినిమాలకు టాక్ బాగున్నా సరే ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతారవరణం వేడెక్కడంతో, సినిమాల హాళ్ల దగ్గర సందడి తగ్గిపోయింది. మరోవైపు ఎండల దెబ్బకు భయపడి జనాలు మార్నింగ్, మ్యాట్నీ షోలకు రావడం తగ్గించేశారు. ఈవెనింగ్, సెకండ్ షోలపై ఐపీఎల్ క్రికెట్ ప్రభావం గట్టిగా పడుతోంది. దీంతో మంచి సినిమాలకు కూడా మినిమమ్ ఓపెనింగ్స్ రావడం లేదు. ఇవన్నీ తెలిసి కూడా వచ్చే నెల నుంచి 'కల్కి' 'ఇండియన్ 2' లాంటి పెద్ద సినిమాల రిలీజులు ప్లాన్ చేస్తుండటంతో, తప్పని పరిస్థితిల్లో మేకర్స్ కొత్త చిత్రాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. గత శుక్రవారం 'ఆ ఒక్కటి అడక్కు', 'ప్రసన్నవదనం', 'శబరి', 'బాక్' లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి.

Read more!

అల్లరి నరేష్ నుంచి కామెడీ ఆశించే ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించడంతో, 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రం మూడు రోజుల్లో రూ. 5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాకపోతే ఇది బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా కష్టపడాల్సి ఉంది. సుహాస్ నటించిన 'ప్రసన్న వదనం' సినిమాకు మంచి టాక్ వచ్చింది. రేటింగ్స్ కూడా బాగున్నాయి. దీనికి తగ్గట్టుగానే రిలీజ్ డే కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు వసూళ్లు ఎక్కువగా వచ్చాయి. కానీ 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' రేంజ్ లో కలెక్షన్లు రాలేదనే మాట వినిపిస్తోంది. మామూలు రోజుల్లో విడుదలయ్యుంటే సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టేదని అంటున్నారు. ఇక తమన్నా భాటియా, రాశీ ఖన్నా కలిసి నటించిన 'బాక్'.. వరలక్ష్మీ శరత్ కుమార్ 'శబరి' సినిమాలను తెలుగులో పెద్దగా పట్టించుకోలేదు. వీటన్నిటికీ వీక్ డేస్ లో ఆక్యుపెన్సీ పెరిగేలా కనిపించడం లేదు.

బాక్సాఫీస్ కు కళ తీసుకొచ్చే సరైన సినిమా కోసం వేచి చూస్తున్న తరుణంలో.. ఈ నెల రెండో వారం నుంచి మరికొన్ని మీడియం రేంజ్ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ', రానా రోహిత్ చాలా గ్యాప్ తర్వాత చేసిన 'ప్రతినిధి 2' సినిమాలు మే 10న థియేటర్లలోకి రాబోతున్నాయి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. చందమామ కాజల్ అగర్వాల్ 'సత్యభామ' చిత్రాలు మే 17న విడుదలవుతున్నాయి. ఈ నెల 25న దిల్ రాజు బ్యానర్ నుంచి 'లవ్ మీ' మూవీ వస్తుంటే.. మే 31న సుధీర్ బాబు 'హరోం హర', ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాయి.

4

అయితే వీటిల్లో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్న చిత్రం కావడంతో ముందుగా 'కృష్ణమ్మ' పై ఆడియన్స్ దృష్టి పడింది. పాటలు, ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అలానే విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తీస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీపై అందరిలో అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ప్రమోషనల్ మెటీరియల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సితార బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. విడుదల సమయానికి రెండు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కూడా పూర్తవుతాయి కాబట్టి, టాక్ బాగుంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News