చిరుపై కామెంట్స్.. బాలయ్యపై పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

సౌత్ లోని మిగతా భాషల్లో నటించి పూనమ్.. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.;

Update: 2025-09-30 10:02 GMT

నటి పూనమ్ కౌర్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వరుస తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్న అమ్మడు.. తన నటనతో అందరినీ అలరించింది. మాయాజాలం సినిమాతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన పూనమ్.. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, వినాయకుడు, నాగవల్లి, గగనం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.


సౌత్ లోని మిగతా భాషల్లో నటించి పూనమ్.. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమె ఏ ట్వీట్ చేసినా, పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవ్వడం ఖాయం. తాజాగా స్టార్ హీరో నందమూరి బాలకృష్ణపై పూనమ్ ట్వీట్ చేసింది.

ప్రస్తుతం నెట్టింట ఫుల్ వైరల్ అవుతూ.. కొత్త చర్చలకు కూడా దారితీసింది. "బాలయ్య చిన్న పిల్లాడిలా ఎనర్జీతో ఉంటారని నేను ఎప్పుడూ చెబుతా. దేవుడు కొందరు వ్యక్తులను ప్రత్యేక ఉద్దేశంతో సృష్టిస్తారు. అది సరైన సమయం వచ్చినప్పుడు వెలుగులోకి వస్తుంది" అంటూ గతంలో బాలకృష్ణ కోసం చేసిన పోస్ట్‌ ను ఇప్పుడు రీ పోస్ట్‌ చేసింది.

అందులో ఓ వీడియో కూడా ఉంది. గతంలో ఓ వేడుకలో సమరసింహారెడ్డి సినిమాలోని నందమూరి నాయకా.. అందమైన కానుకా.. ముందరుంది చూసుకోరా.. సాంగ్‌ కు పూనమ్ కౌర్ డ్యాన్స్ చేసింది. ఆ సమయంలో బాలయ్య కేరింతలు కొడతారు. ఆ వీడియోను గత ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన ట్వీట్ చేసింది పూనమ్ కౌర్.

ఆ సమయంలో బాలయ్యపై పొగడ్తల వర్షం కురిపించింది. బాలయ్య మహా వృక్షం లాంటి వారని, అది అందరికీ నీడనిస్తుంటుందని చెప్పిన పూనమ్.. ఆదిత్య 369 నుంచి భగవంత్ కేసరి వరకు ఆయన చిన్న పిల్లాడిలా ఎనర్జీతో కనిపిస్తారని తెలిపారు. అది ఆయనకు భగవంతుడు, తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన ఆశీర్వాదమేమని పేర్కొంది.

దీంతో పూనమ్ కౌర్ ట్వీట్ పై నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు. అయితే ఇటీవల ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి చర్చకు దారితీశాయో తెలిసిందే. దీంతో చిరంజీవి కాస్త ఘాటుగానే స్పందించారు. ఇటీవల బాలయ్య కామెంట్స్‌ ను రికార్డుల నుంచి కూడా తొల‌గించారు. కానీ ఆ అంశం సినీ వర్గాల్లో ఇప్పటికే చర్చనీయాంశంగానే ఉంది. ఇదే సమయంలో పూనమ్ పోస్ట్ పెట్టడం గమనార్హం.

Tags:    

Similar News