12 నెలల్లోనే రూ.90కోట్లు చెల్లించాం.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

ఇండస్ట్రీలో కార్మికులకు వేతనాలు చెల్లించే విషయంలో తాము అత్యంత పారదర్శకంగా ఉంటామని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా ఓ ప్రటకన జారీ చేసింది.;

Update: 2025-08-16 18:05 GMT

ఇండస్ట్రీలో కార్మికులకు వేతనాలు చెల్లించే విషయంలో తాము అత్యంత పారదర్శకంగా ఉంటామని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా ఓ ప్రటకన జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తులు లేదా స్వయం ప్రకటిత యూనియన్ నాయకులు నిర్మాణ కంపెనీ అంతర్గత చెల్లింపులకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేయడం సరికాదని ప్రకటనలో పేర్కొంది.

అలాగే గడిచిన 12 నెలల్లో తమ సంస్థ కార్మికులకు రూ.60 కోట్ల వేతనాలు చెల్లించిందని.. తమ సంస్థకు ఏ యూనియన్లతోనూ ఒప్పందాలు లేదా ఆర్థిక లావాదేవీలు లేవని, అలాగే వారికి ఎటువంటి బకాయిలు లేవని తాజాగా తెలిపింది. ఇంకా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసిన ప్రటనలో ఏం చెప్పారంటే..

గత 12 నెలల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమా ప్రొడక్షన్ కార్యకలాపాలలో పనిచేసిన కార్మికులకు రోజువారీ వేతనాలు సుమారు రూ. 60 కోట్లు చెల్లించింది. అదనంగా, గత జులైలో పనిచేసిన వాళ్లకు ఇంకా దాదాపు రూ. 1 కోటి చెల్లించాల్సి ఉంది. అయితే ఇందులో నెలవారీ వేతనం పొందే కార్మికులు లేరు. వాళ్లను కూడా కలుపుకుంటే ఇంకో రూ.30 కోట్లు అదనంగా అవుతుంది. ఈ ఉద్యోగులకు రెగ్యులర్ గా చెల్లిస్తున్నాం. ఇక సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు, వెండర్స్ , VFX టీమ్స్, లొకేషన్ల ఇతరత్రా ఖర్చుల కూడా ఇందులో లేవు.

అందువల్ల ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు లేదా యూనియన్ నాయకులు కంపెనీ చెల్లింపులకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేయడం సరికాదు. అయితే, జులై షెడ్యూల్ లో పని చేసిన కార్మికులకు పెండింగ్ చెల్లింపులు ఉన్నాయి. ఈ పేమెంట్లు పరిశ్రమలో అనుసరిస్తున్న నిబంధనల ప్రకారం ఇచ్చేస్తాం.

అయితే గత రెండు వారాలుగా ఆకస్మిక సమ్మె కారణంగా కార్మికులు అందుబాటులో లేకపోవడం, తదుపరి షెడ్యూల్ ప్రారంభం కాకపోవడంతో ఈ ఆలస్యం జరిగింది. మా కోసం పనిచేసిన మా కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ఈ పాలసీకి మినహాయింపు ఇచ్చి, ఈ వారంలోనే పెండింగ్ చెల్లింపులు చేయాలని మేం నిర్ణయించుకున్నాము.

కాకపోతే పేమెంట్ చెల్లింపుల విధానంలో మేం ఎక్కువ పారదర్శకంగా ఉండాలనుకుంటున్నాం. అందుకే గతంలో రెప్రజెంటేటీవ్ ల ద్వారా జరిపిన చెల్లింపుల విధానాన్ని పూర్తిగా తొలగిస్తున్నాం. ఇకపై అన్ని చెల్లింపులు నేరుగా కార్మికులకు వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయించుకున్నాం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యవర్తులకు నిధులను విడుదల చేయదు. అని నిర్మాణ సంస్థ సుదీర్ఘంగా వివరిస్తూ ప్రకటనలో తెలిపింది.

అలాగే జులై షెడ్యూల్ కు సంబంధించిన బిల్లులు రావాల్సి ఉన్న కార్మికులు ఈ క్రింది ప్రక్రియను అనుసరించమని అభ్యర్థించింది. ఎవరికైతే బిల్లులు రావాల్సి ఉందో వాళ్లు బ్యాంక్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. సోమవారం నాటికి సమాచారం వారి సంబంధిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లకు చేరేలా చూసుకోవాలని చెప్పింది. బ్యాంకు ఖాతాలు వేరిఫై అయ్యాక, అదే వారంలో డబ్బులు జమ చేస్తామని తెలిపింది.

Tags:    

Similar News