రిలీజ్ ముందు 'పెద్ది' కి అన్ని విధాలా లైన్ క్లియ‌రైన‌ట్టేనా?

రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `పెద్ది` సినిమా జూన్ 4 నుంచి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2026-06-01 04:14 GMT

రామ్ చ‌ర‌ణ్ న‌టించిన 'పెద్ది' సినిమా జూన్ 4 నుంచి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ ముందు తెలంగాణ ఎగ్జిబిట‌ర్లు ప‌ర్సంటేజీ విధానాన్ని తెర‌పైకి తేవ‌డంతో దానిపై సినీపెద్ద‌ల స‌మ‌క్షంలో చ‌ర్చా సమావేశాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటి సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టికి స‌మ‌స్య వెళ్లింది. ఇక ఛాంబ‌ర్ ఒక క‌మిటీని వేసి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు అధ్య‌య‌నం చేయాల‌ని సూచించింది. ఈ క‌మిటీ నివేదిక జూన్ చివ‌రిలోగా వ‌స్తుంది.

ఇలాంటి స‌మ‌యంలో రిలీజ్‌కి వ‌స్తున్న పెద్ద సినిమా 'పెద్ది' కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల‌ని ఎగ్జిబిట‌ర్ల‌ను సినీపెద్ద‌లు కోరారు. థియేట‌ర్ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా స‌హ‌కారం అందిస్తామ‌ని ప్రామిస్ చేయ‌డంతో ఎగ్జిబిట‌ర్లు సానుకూలంగా స్పందించారు. ఇక ఈ ఇష్యూలో మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ కల్యాణ్ లాంటి పెద్ద‌ల ప్ర‌మేయం గురించి తెలిసిందే. ఆ ఇద్ద‌రు పెద్ద‌మ‌నుషుల ప్ర‌మేయంతో స‌మ‌స్యకు ప‌రిష్కారం ల‌భించిన‌ట్టేనని అంతా భావించారు. అయితే పెద్ది రిలీజ్ ముందు కొన్ని చిన్న‌పాటి స‌మ‌స్య‌ల్ని మైత్రి సంస్థ ప‌రిష్క‌రించుకోవాల్సి ఉందని సూచిస్తున్నారు.

పెద్ది రిలీజ్ ముందు ప్ర‌ధాన‌ స‌మ‌స్య‌.. టికెట్ ధ‌ర‌పై పెంచిన 7.5 శాతం ధ‌రను అద్దెతో పాటు ఎగ్జిబిట‌ర్ కి నిర్మాత‌ చెల్లించాల్సి ఉండ‌గా.. దానిని త‌గ్గించుకుని వ‌చ్చిన వ‌సూళ్ల‌ను స‌ర్ధుతామ‌ని ఎగ్జిబిట‌ర్లు అంటున్నారట‌. అయితే సినిమా రిలీజ్ అయిన మొద‌టి వారాంతం, తొలి వారం జనం థియేట‌ర్ల‌కు ఏవిధంగా వ‌స్తారో తెలియ‌దు కాబ‌ట్టి ఇది స‌రికాద‌ని నిర్మాత‌లు అంటున్నారు. పంపిణీదారులు ప్రారంభ వ‌సూళ్ల‌ను మొత్తం చెల్లించి షో ముగింపు వారంలో 7.5 శాతాన్ని త‌గ్గించుకోమ‌ని ఎగ్జిబిట‌ర్ కి నిర్మాత‌లు సూచిస్తున్నారు. అయితే దీనిపై మైత్రి వాళ్లు సామ‌ర‌స్యంగా మాట్లాడుకుని ప‌రిష్క‌రించుకోవాల్సి ఉంటుంది.

అలాగే నైజాంలో ఓ ముప్పై పైగా థియేట‌ర్లలో పెద్దిని స‌జావుగా రిలీజ్ చేయ‌డానికి ఉన్న చిక్కుల్ని థియేట‌ర్ల యాజ‌మాన్యంతో సామ‌ర‌స్యంగా చ‌ర్చించాల్సి ఉంది. ప్ర‌స్తుతం మైత్రి మూవీ మేక‌ర్స్ `పెద్ది` సినిమాని ఈ మూప్పై థియేట‌ర్ల‌లోను స‌జావుగా రిలీజ్ చేయ‌డానికి ఛాంబ‌ర్ పెద్ద‌లు లేదా సినీపెద్ద‌ల స‌హ‌కారం తీసుకుంటార‌ని స‌మాచారం. అలాగే నిజామాబాద్ లోని న‌ట‌రాజ్ థియేట‌ర్ తో డీల్ కుదుర్చుకున్న మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ థియేట‌ర్ పై నెల‌కొన్న స‌మ‌స్య‌ను ఈ స‌మ‌యంలో ఎంతో సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాల్సి ఉంద‌ని కూడా సూచిస్తున్నారు.

ఏపీలో ప్ర‌భుత్వ స‌హ‌కారంతో `పెద్ది` టికెట్ ధ‌ర‌లు పెరిగినా.. ఇంకా తెలంగాణ‌లో ప్ర‌భుత్వం జీవో జారీ చేయ‌లేదు. అందువ‌ల్ల నైజాంలో ఇంకా బుకింగులు ప్రారంభం కాలేదు. ఈ సోమ‌వారం నాడు దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న తెలంగాణ‌ ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. పెద్ది చిత్రానికి దేశ‌వ్యాప్తంగా చ‌ర‌ణ్ అండ్ టీమ్ భారీ ప్ర‌మోష‌న్స్ చేసారు. అందువ‌ల్ల పాన్ ఇండియాలో భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. నైజాంలోను ఎలాంటి స‌మ‌స్యా లేకుండా `పెద్ది` విడుద‌లై భారీ వ‌సూళ్ల‌ను సాధించాల‌ని అభిమానులు, ట్రేడ్ వ‌ర్గాలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా మాస్ ఆద‌ర‌ణ ఎక్కువ‌గా ఉండే నైజాంలో థియేట‌ర్ల ఇష్యూ లేకుండా మైత్రి ప‌రిష్క‌రించుకుని ముందుకు సాగాల‌ని కోరుకుంటున్నారు.

Tags:    

Similar News