పెద్ది మ్యూజికల్ ఈవెంట్.. పుష్ప క్రేజ్ ను దాటేస్తుందా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా రిలీజ్ కు ముందే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా రిలీజ్ కు ముందే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సనా రూపొందిస్తున్న ఆ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించి భోపాల్ లో నిర్వహించబోయే మెగా మ్యూజికల్ ఈవెంట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో ఇప్పటివరకు చాలా ఆడియో లాంచ్ లు జరిగినా.. ఈస్థాయిలో మ్యూజికల్ కాన్సెర్ట్ తరహాలో ఈవెంట్ ప్లాన్ చేయడం అరుదనే చెప్పాలి.
మే 23న జరగనున్న ఆ కార్యక్రమానికి ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వయంగా హాజరుకానుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేవలం స్టేజ్ పై కనిపించడం మాత్రమే కాకుండా.. తన టీమ్ తో కలిసి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. పెద్ది చిత్రంలోని రెండు కొత్త పాటలను ఈ స్టేజ్ పై రియల్ గా ప్రదర్శించనుండటం విశేషం.
ఇటీవల విడుదలైన మాస్ సాంగ్ ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. కంప్లీట్ సాంగ్ స్టేజ్ పై ఎలా ఉంటుందన్న ఆసక్తి పెరిగింది. ఇక రెహమాన్ తన కెరీర్ లోని పలు క్లాసిక్ హిట్ పాటలను కూడా ఆ కాన్సర్ట్ లో పాడనున్నారని సమాచారం. దీంతో ఆ ఈవెంట్ సాధారణ మూవీ ప్రోగ్రామ్ కంటే ఒక భారీ మ్యూజిక్ ఫెస్టివల్ లా మారబోతోందని సినీ ప్రియులు భావిస్తున్నారు. తెలుగు సినిమా ప్రమోషన్స్ ను నార్త్ ఇండియాలో కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా దీనిని చూస్తున్నారు.
భోపాల్ సిటీలో ఇంత పెద్ద ఎత్తున తెలుగు సినిమా వేడుక జరగడం ఇదే తొలిసారి కావడం కూడా చర్చనీయాంశమైంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పెద్దికి నార్త్ లో స్ట్రాంగ్ బజ్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఆ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ కూడా నడుస్తోంది. గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ పట్నా ఈవెంట్ భారీ ఆడియన్స్ తో పాన్ ఇండియా రేంజ్ లో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు పెద్ది భోపాల్ ఈవెంట్ కూడా అదే స్థాయి క్రేజ్ ను అందుకుంటుందా అనే చర్చ మొదలైంది. ఆ కార్యక్రమానికి లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందన్న ప్రచారం మరింత హైప్ పెంచుతోంది.
అయితే పుష్ప 2 ఈవెంట్ కు వచ్చిన మాస్ రెస్పాన్స్ ను మ్యాచ్ చేయడం చిన్న విషయం కాదు. కానీ రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్, ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్, భారీ ప్రమోషన్ ప్లానింగ్ కలిసి పెద్ది ఈవెంట్ ను ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశాలు మాత్రం క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈవెంట్ సక్సెస్ అయితే.. ఫ్యూచర్ లో తెలుగు సినిమాల ప్రమోషన్స్ కు ఇది కొత్త ట్రెండ్ గా మారే అవకాశం ఉందని అంతే అంచనా వేస్తున్నాయి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.