డిప్యూటీ సాబ్.. ఒక్కటైనా మొదలుపెడతారా?
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంతకాలంగా రాజకీయాలు, సినిమాలు రెండింటినీ నడిపిస్తూ వస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంతకాలంగా రాజకీయాలు, సినిమాలు రెండింటినీ నడిపిస్తూ వస్తున్నారు. గత కొన్నేళ్లుగా రాజకీయ బాధ్యతల మధ్యలో సినిమా షూటింగులు పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు మాత్రం పూర్తిగా పాలిటిక్స్ పైనే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఆసక్తి పెరుగుతున్నా.. ఎలాంటి క్లారిటీ మాత్రం కనిపించడం లేదు.
2026 స్టార్టింగ్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ కొత్త మూవీ ప్రకటించారు. ఆ ప్రాజెక్ట్ కు రైటర్ గా వక్కంతం వంశీ వర్క్ చేయనున్నారు. ఉగాది తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని అప్పట్లో ప్రచారం జరిగింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ అనౌన్స్మెంట్ తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.
మరోవైపు సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సక్సెస్ తర్వాత దానికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ గా రానున్న ఓజీ-2 ప్రాజెక్టుపై కూడా చర్చలు జరిగాయి. దర్శకుడు స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారనే సమాచారం వచ్చినా, ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందన్న విషయంపై క్లారిటీ లేదు. అలాగే హరిహర వీరమల్లుకు సీక్వెల్ ఉంటుందనే అనౌన్స్మెంట్ వచ్చినా.. ఫస్ట్ పార్ట్ ఆశించిన రిజల్ట్ అందుకోకపోవడంతో సీక్వెల్ రావడం ఇక డౌటే.
ఇక నిర్మాతగా కూడా పవన్ కళ్యాణ్ పెద్ద ప్లాన్ తో ముందుకొచ్చారు. తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ద్వారా పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సినిమాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. స్టోరీ కథలు, ప్రాజెక్టులపై చర్చలు జరిగినట్లు సమాచారం. కొన్ని చిత్రాల్లో నటుడిగా, మరికొన్నింటికి క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రకటన తర్వాత కూడా ఒక్క సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లినట్లు సమాచారం లేదు.
పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలని ఎదురుచూస్తున్న నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ వంటి సంస్థల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం అందరూ సైలెంట్ గానే ఉన్నారు. అయితే రాజకీయ బాధ్యతలు, హెల్త్ ప్రాబ్లమ్స్, టైమ్ వంటి కారణాలతో పవన్ కొత్త సినిమా షూటింగ్ లకు దూరంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే 2026లో అప్పుడే సగం సంవత్సరం పూర్తవుతోంది. అయినప్పటికీ పవన్ హీరోగా గానీ, నిర్మాతగా గానీ ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కాలేదు. బ్యాక్ గ్రౌండ్ లో కథల చర్చలు, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నా.. అవి ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయన్నది ప్రశ్నగా మిగిలింది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్, ఇప్పట్లో సినిమా సెట్స్ లోకి అడుగుపెడతారా? లేక ప్రాజెక్టులన్నీ మరింత లేట్ అవుతాయా? అనే డౌట్ ఇప్పుడు అభిమానుల్లో ఉంది. కనీసం ఈ ఏడాదిలో ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభమవుతుందా అనే ప్రశ్నకు సమాధానం రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.