ఓజీ, ఉస్తాద్ పై ప‌వ‌న్ వ్యూహం ఎలా ఉంటుందో!

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్ర‌మే ప‌రిమిత‌వుతారు అనుకున్న ప‌వ‌న్ చివ‌రి నిమిష‌యంలో త‌న భుజాల‌పైనే ప్ర‌చార బాధ్య‌త‌ను మోసారు.;

Update: 2025-08-04 23:30 GMT

పాన్ ఇండియాలో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' ఎలాంటి ఫ‌లితం సాధించిందో తెలిసిందే. ఐదు సంవ‌త్స‌రాల త‌ర్వాత రిలీజ్ అయిన సినిమా ప‌వ‌న్ మేనియాతో అద్భుతాలు సృష్టిస్తుంద‌నుకుంటే? అందుకు భిన్న‌మైన ఫ‌లితాన్ని సాధించింది. తొలి షోతోనే బాక్సాఫీస్ వ‌ద్ద తేలి పోయింది. కానీ ఈ సినిమా స‌క్సెస్ కోసం ప‌వ‌న్ అండ్ కో ఎంత‌గా శ్ర‌మించారు! అన్న‌ది మాట‌ల్లో చెప్ప‌డం సాధ్యం కానిది. ఏ సినిమాను ప్ర‌మోట్ చేయ‌నంతగా ప‌వ‌న్ వీర‌మ‌ల్లును ప్ర‌మోట్ చేసారు.

ప‌వ‌న్ ఎంతో ఓపిక‌గా

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్ర‌మే ప‌రిమిత‌వుతారు అనుకున్న ప‌వ‌న్ చివ‌రి నిమిష‌యంలో త‌న భుజాల‌పైనే ప్ర‌చార బాధ్య‌త‌ను మోసారు. దాదాపు ప్ర‌తీ మీడియాతోనూ ఇంట‌రాక్ట్ అయ్యారు. ఎంతో ఓపిక‌గా స‌మాధానాలు ఇచ్చారు. ఇంత వ‌ర‌కూ ప‌వ‌న్ ఏ సినిమాకు ఇలాంటి ప్ర‌చారం క‌ల్పించ‌లేదు. వీర‌మ‌ల్లు కోసం మాత్రం ఎంతో వ్య‌క్తిగ‌త స‌మాయాన్ని కేట‌యించ‌డం విశేషం. ఆయ‌న‌తో పాటు అభి మానులు, జ‌న‌సేన నాయ‌కులు, సైనికులు కూడా సినిమా ప్ర‌చారంలో కీల‌క పాత్ర పోషించారు.

ప‌వన్ అండ్ కో క‌లిసి రాలేదు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ పెట్టిన త‌ర్వాత కొన్ని సినిమాలు చేసారు. కానీ ఏ సినిమాకు సైనికులు, పార్టీ నాయ కులు ఇలా ప‌ని చేయ‌లేదు. తొలిసారి వీర‌మ‌ల్లు కోసం మేము సైతం అంటూ అంతా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి శ‌క్తి వంచ‌న లేకుండా ప‌ని చేసారు. కానీ ఫ‌లితం మాత్రం తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. ప‌వ‌న్ అండ్ కో చేసిన ప్ర‌చారం ఎంత మాత్రం క‌లిసి రాలేదు. ఇక్క‌డ రాజ‌కీయంగానూ సినిమాపై చాలా ప్ర‌భా వం చూపించింది. ప‌వ‌న్ రాజ‌కీయ వ్య‌తిరేక వ‌ర్గం `బోయ్ క‌ట్` ట్రెండ్ ను తెర‌పైకి తేవ‌డంతోనూ కొంత‌ దెబ్బ ప‌డింది.

ప‌వ‌న్ ప్లాన్ భ‌విష్య‌త్ కి కీల‌కం

ఆ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఎవ‌రూ వీర‌మ‌ల్లు ను ఆద‌రించ‌లేదు. అదంతా ప‌క్క‌న బెడితే? క‌థా బ‌లం లేని సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కుల‌కు రుచించ‌లేద‌న్న‌ది ప్ర‌ధాన కార‌ణం. వీర‌మ‌ల్లుకు సంబంధించి ఇదంతా గ‌తం. ఈ అనుభ‌వం నుంచి ప‌వ‌న్ ఏం నేర్చుకున్నారు? అన్న‌ది భ‌విష్య‌త్ కు కీల‌కం. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా రెండు సినిమాలు తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ స్ట‌ర్ బ్యాక్ డ్రాప్ లో `ఓజీ` చేస్తున్నారు. ఈ చిత్రం అన్ని ప‌న‌లు పూర్తి చేసుకుని సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

రెండిటి లెక్క స‌రిచేసేలా!

ఇప్ప‌టికే ప‌వ‌న్ షూటింగ్ కూడా పూర్తి చేసారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అలాగే హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` లోనూ న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాల‌కు ప‌వ‌న్ ప్ర‌చారం కూడా ఎంతో కీల‌క‌మైంది. ఇవి కూడా రిలీజ్ అల‌స్య‌మ‌వుతోన్న చిత్రాలే. వీటిని కూడా ప‌వ‌న్ త‌న భుజాల‌పై వేసుకునే ప్ర‌చారం చేస్తార‌నే మాట బ‌లంగా వినిపిస్తుంది. అయితే వీటి ప్ర‌చార వ్యూహం ఎలా ఉంటుంది? అన్న‌ది ఇంట్రెస్టింగ్. వీర‌మ‌ల్లు స‌మ‌యంలో త‌లెత్తిన ప్ర‌తికూల‌తకు ఇక్క‌డ అవ‌కాశం ఇవ్వ కూడ‌దు. రిలీజ్ కు ముందు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ప్రేక్ష‌కుల్లోకి వెళ్లాలి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టు కునేలా ఆ వ్యూహం ఉండాలి.

Tags:    

Similar News