పవన్ 'OG' రికార్డు.. ఎవరూ బ్రేక్ చేయలేరా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో రూపొందిన ఓజీ మూవీ ప్రీమియర్స్ విషయంలో రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో రూపొందిన ఓజీ మూవీ ప్రీమియర్స్ విషయంలో రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. ఆల్ ఇండియా స్థాయిలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్స్ వసూళ్లలో నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది. విడుదలకు ముందే ఆ సినిమాపై ఏర్పడిన అంచనాలు, అభిమానుల్లో ఉన్న భారీ క్రేజ్ కలిసి ఓజీని ఒక ఈవెంట్ ఫిల్మ్ గా మార్చేశాయి.
సాధారణ సినిమా విడుదల కాకుండా, ఓజీ రిలీజ్ ఒక పండగలా మారింది. ముఖ్యంగా ప్రీమియర్స్ కు అనుమతులు లభించిన ప్రాంతాల్లో థియేటర్లు హౌస్ ఫుల్స్ తో నిండిపోయాయి. రికార్డు స్థాయిలో టికెట్ ధరలకు ప్రభుత్వ అనుమతి లభించడంతో, తొలి షోల నుంచే భారీ వసూళ్లు నమోదయ్యాయి. ఇండియాలో పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రూ.23 కోట్లు వచ్చాయని వినికిడి.
ఉత్తర అమెరికాలో కేవలం ప్రీమియర్స్ ద్వారా 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ.26 కోట్లు) వసూలు చేసిన ఓజీ.. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా సాధించని స్థాయిలో ప్రీమియర్ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఆ రికార్డును ఫ్యూచర్ లో ఏ టాలీవుడ్ సినిమా కూడా బ్రేక్ చేయడం కష్టమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని చెప్పాలి.
ఓజీకి దక్కినట్టుగా భారీ క్రేజ్, ఆడియన్స్ లో హైప్, అంతేకాదు అత్యధిక టికెట్ ధరలకు అనుమతులు.. ఈ మూడు అంశాలు ఒకేసారి కలిసి రావడం అరుదు. పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్, ఆయన సినిమా అంటేనే థియేటర్ల వద్ద కనిపించే ఉత్సాహం ఆ రికార్డుకు మెయిన్ రీజన్ గా నిలిచింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం అధిక టికెట్ ధరలకు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం లేదు.
దీంతో ఓజీ సాధించిన ప్రీమియర్ రికార్డును మరొక సినిమా బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యంగా మారింది. గతంలో కొన్ని పెద్ద సినిమాలకు ప్రత్యేక అనుమతులు లభించినా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కొత్త వ్యూహాలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఓజీ రికార్డు.. ఎప్పటికీ అలాగే ఉండిపోయేలా ఉంది.
మొత్తానికి ఓజీ ప్రీమియర్ వసూళ్ల రికార్డు తెలుగు సినిమా చరిత్రలో ఒక స్పెషల్ ఛాప్టర్ గా నిలిచింది. మారుతున్న ప్రభుత్వ విధానాలు, టికెట్ రేట్ల తగ్గుదల నేపథ్యంలో ఆ రికార్డు చాలా కాలం పాటు చెక్కుచెదరకుండా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ఏదేమైనా పవన్ అభిమానులకు ఇది ప్రౌడ్ మూమెంట్ కాగా.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మాత్రం ఒక బెంచ్ మార్క్.