ఓజీ ఒక్క టికెట్ ఖరీదు@రూ.5 లక్షలు
ఇటీవల వచ్చిన హరిహర వీరమల్లు సినిమాకు వచ్చిన ఓపెనింగ్ వసూళ్లు ఆ విషయాన్ని చెప్పకనే చెప్పాయి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా బిగ్గెస్ట్ బ్లాక్ ఓపెనింగ్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే;
పవన్ కళ్యాణ్ సినిమాలు చేసినా చేయకున్నా... రాజకీయాల్లో బిజీ అయ్యి కొందరి వాడు అయ్యాడు అనే విమర్శలు వచ్చినా సినిమాల సమయంలో ఆయన క్రేజ్ ముందు ఇతర హీరోలు అంతా దిగదుడుపే అనే విషయం మరోసారి నిరూపితం అయ్యింది. ఇటీవల వచ్చిన హరిహర వీరమల్లు సినిమాకు వచ్చిన ఓపెనింగ్ వసూళ్లు ఆ విషయాన్ని చెప్పకనే చెప్పాయి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా బిగ్గెస్ట్ బ్లాక్ ఓపెనింగ్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో ఆ స్థాయి వసూళ్లు అందుకున్న సినిమానే లేదు అనడంలో సందేహం లేదు. వీరమల్లు ను మించిన బజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓజీ సినిమాకు ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంది. అంతే కాకుండా సినిమా కోసం రెండు మూడు ఏళ్లుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.
ఓజీతో ప్రేక్షకుల ముందుకు సుజీత్
ఓజీ సినిమాలో పవన్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటారో అలా చూస్తారని దర్శకుడు సుజీత్ అంటున్నాడు. సాహో వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ఉత్తరాదిన మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న సుజీత్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న నేపథ్యంలో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయం అనే నమ్మకంతో మేకర్స్‌తో పాటు అభిమానులు ఉన్నారు. ఓజీ సినిమాను ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మీ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్ నటించిన విషయం తెల్సిందే.
పవన్ కళ్యాణ్ క్రేజ్‌కి ఇదే సాక్ష్యం
సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రీ సేల్ మొదలు అయింది. తాజాగా ఈ సినిమా మొదటి టికెట్‌ను అభిమానులు వేలం వేశారు. వేలంలో ఒక అభిమాని ఏకంగా రూ.5 లక్షలకు కొనుగోలు చేయడం జరిగింది. ఓజీ సినిమాకు ఉన్న క్రేజ్ కి ఇది నిదర్శనం అనడంలో సందేహం లేదు. ఈ సినిమా మొదటి టికెట్ అమ్మగా వచ్చిన ఆ రూ.5 లక్షలను జనసేన పార్టీ విరాళంగా ఇస్తున్నట్లు అభిమానులు ప్రకటించారు. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలకే జరుగుతుందని, గతంలో ఎప్పుడూ, ఎక్కడ లేని విధంగా ఒక సినిమా టికెట్ రూ.5 లక్షలు పలకడం మామూలు విషయం కాదు. ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియా ద్వారా తెగ షేర్ చేస్తూ ఉన్నారు. ఓజీ సినిమాపై ఉన్న బజ్ కి ఇది నిదర్శణం అనే అభిప్రాయం సైతం వ్యక్తం అవుతోంది.
పవన్ కెరీర్‌లోనే టాప్ కలెక్షన్స్
పవన్ కళ్యాణ్ రాజకీయాలు, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఓజీ సినిమా ఎప్పుడో మొదలు పెట్టినా ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఉప ముఖ్యమంత్రి గా చాలా బిజీగా ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడు డేట్లు ఇచ్చి ఓజీ సినిమాను ముగించాడు. ఈ మధ్య కాలంలో ఓజీ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, పాటలు సినిమా పై అంచనాలు మరింతగా పెంచుతున్నాయి. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా స్థాయిని మరింత పెంచుతుంది అంటూ ప్రతి ఒక్కరూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఓజీ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ ప్రేక్షకులను అలరిస్తుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. అంతే కాకుండా పవన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈ సినిమా నిలువబోతుందనే విశ్వాసంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.