పవన్ కొత్త సినిమాలు.. అసలేం జరుగుతోంది?
అయితే అదే సమయంలో ఆయన కొత్త సినిమాలపై రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై మరోసారి చర్చ మొదలైంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పాలనలో బిజీగా ఉంటూనే, మరోవైపు పెండింగ్‌లో ఉన్న సినిమా ప్రాజెక్టులను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. అయితే అదే సమయంలో ఆయన కొత్త సినిమాలపై రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నందున కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని పవన్ బృందం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అయినప్పటికీ, ఆయన తదుపరి ప్రాజెక్టులపై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ సీక్వెల్ పై కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. ఆ చిత్రానికి ప్రీక్వెల్ రాబోతోందని, దానికి ఓజాస్ గంభీర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్ నడుస్తోంది.
ఆ ప్రచారంపై పవన్ కు సన్నిహిత వర్గాలను సంప్రదించగా, ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఓజీ ప్రీక్వెల్ మాత్రమే కాకుండా, మరికొన్ని భారీ ప్రాజెక్టులు కూడా లైన్ లో ఉన్నాయని సమాచారం. దర్శకుడు సురేందర్ రెడ్డితో చేయాల్సిన సినిమా ఇంకా పెండింగ్‌లో ఉందని, అలాగే ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కూడా పవన్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక నిర్మాణ సంస్థల విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఆ ప్రాజెక్టులను నిర్మించే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో ఆ సినిమాలు రూపొందే అవకాశముందని టాక్. అయితే అన్ని ప్రాజెక్టులపై తుది నిర్ణయం మాత్రం పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంది.
ఓజీ సీక్వెల్ లేదా ప్రీక్వెల్ గురించి సరైన సమయం వచ్చినప్పుడు అధికారికంగా ప్రకటిస్తామని పవన్ టీమ్ చెప్పినట్లు తెలుస్తోంది. తెలిపింది. ప్రస్తుతం ఆయన పూర్తిగా ప్రజా సేవపైనే దృష్టి సారించినందున, సినిమాలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు వెంటనే వచ్చే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే, పవన్ టీమ్ ఒక విధంగా స్పందిస్తుండగా, సన్నిహిత వర్గాలు మరోలా సంకేతాలు ఇస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
అసలు ఆయన ముందుగా ఏ సినిమా పట్టాలెక్కిస్తారు? ఓజీ ప్రీక్వెల్ నిజమా? లేదా కొత్త ప్రాజెక్ట్ తో సర్‌ప్రైజ్ ఇస్తారా? అన్న చర్చలు కొనసాగుతున్నాయి. మొత్తానికి, పవన్ కళ్యాణ్ సినిమాలపై స్పష్టత రాకపోయినా, వార్తలు మాత్రం ఊపందుకున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఊహాగానాలకు తెరపడే అవకాశం కనిపించడం లేదు. దీంతో పవర్ స్టార్ తదుపరి నిర్ణయం ఏమిటన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.