రూ.50 టికెట్ పై రూ.800 స్టాంప్.. ఓజీ ప్రీమియర్స్.. మరీ ఇంత లూటింగా?
హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో కంప్యూటర్ ప్రింటింగ్ టికెట్ కాకుండా నార్మల్ టికెట్ ప్రేక్షకులకు ఇస్తున్నారు.;
పవన్ కల్యాణ్ ఓజీ సినిమా ప్రీమియర్స్ ఇవాళ రాత్రి 10 గంటలకు షో పడనుంది. ఈ క్రమంలో టికెట్ల ధరలు ప్రస్తుతం కాంట్రవర్సీగా మారాయి. ప్రీమియర్ షో టికెట్లలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి.
హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో కంప్యూటర్ ప్రింటింగ్ టికెట్ కాకుండా నార్మల్ టికెట్ ప్రేక్షకులకు ఇస్తున్నారు. అది కూడా జీఎస్టీతో కలిపి రూ.50 గా ఉన్న ప్రింటింగ్ టికెట్ పై రూ.800 అనే స్టాంప్ వేసి అమ్మేస్తున్నారు. ఇలా ముద్రించడంతో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, టిక్కెట్ల పెంపు, జీఎస్టీ అకౌంటింగ్ గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. అలాగే ప్రభుత్వాలు సినిమా ఆదాయాలను పర్యవేక్షిస్తాయా. లేదా చూసీ చూడనట్లు వ్యవహరిస్తాయా అనే ప్రశ్నలు సగటు ప్రేక్షకుడికి తలెత్తుతోంది.
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు బెనిఫిట్ షోలను తరచుగా లాభాలు రాబట్టుకునే మార్గాలుగా చూస్తున్నారు. అటు ప్రభుత్వాలు కూడా అదనపు షోలు, టిక్కెట్ల ధరల పెంపునకు ప్రభుత్వాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. స్టార్ నటీనటుల రెమ్యూనరేషన్, ప్రొడక్షన్ ఖర్చులు, ఇతర ఖర్చులను.. ఇలా టికెట్ ధరలు పెంచేసి రికవరీ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జీఎస్టీ అనేది సాధారణ టికెట్ ధరపై లెక్కించబడుతుందా లేదా పెంచిన రేటుపై లెక్కిస్తారా అనేది స్పష్టత లేదు.
అలాగే ప్రీమియర్స్ టిక్కెట్లను బ్లాక్ మార్కెట్ రేట్లకు ఆఫ్‌లైన్‌లో విక్రయించడం, దీనిపై సరైన ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వంటివి కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో క్రిటిక్స్ ఇలాంటి వాటిని 40 శాతం జీఎస్టీ శ్లాబ్ కిందకు చేర్చాలని లేదా అటువంటి టిక్కెట్ల కోసం ప్రత్యేక ప్రత్యేక కేటగిరీని సృష్టించాలని సూచిస్తున్నారు. అసలు ఇక్కడ ఎవర్ని దోచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అసలు ఏం కోల్పోయితుంది. అయితే క్రేజ్ ఉన్నప్పుడు క్యాష్ చేసుకోవడం తప్పులేదు. కానీ అందులో పారదర్శకత, జవాబుదారీతనం అనేవి అత్యంత కీలకం. ప్రస్తుతం ఆన్‌లైన్ లో జరుగుతున్న చర్చ ఇదే.
అలాగే కొద్ది గంటల కిందటే తెలంగాణ ప్రభుత్వం ఓజీ సినిమాకు టికెట్ ధరల పెంపునకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. దీనిపై తదుపరి విచారణ వచ్చే నెల 09కి వాయిదా వేసింది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రీమియర్స్ కు, అలాగే రేపటికి టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షుకులు సందిగ్ధంలో పడ్డారు.