ఓజీ కాన్సెర్ట్: వర్షాన్ని కూడా పట్టించుకోని ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా `ఓజీ` విడుదలకు మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమాకి ప్రీ టికెటింగ్ బజ్ పీక్స్ కి చేరుకుంది. ఇలాంటి సమయంలో ఓజీ కాన్సెర్ట్ పేరుతో ఈ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌళిలో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ ఉర్రూతలూగించే స్పీచ్ తో రక్తి కట్టిచారు.
అయితే ఓజీ స్పీచ్ వినేందుకా అన్నట్టు వరుణుడు ఈవెంట్ వెంట పడ్డాడు. చిటపట చినుకులు వేదికను తడిపి ముద్ద చేయడం ఇబ్బంది పెట్టింది. అయినా వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు వర్షంలోనే తడుస్తూ ఈవెంట్ ని విజయవంతం చేయడం ఆసక్తిని కలిగించింది.
ఓజీ ప్రమోషన్స్ కోసం డిజైన్ చేసిన వేదిక భారీతనంతో ఆకట్టుకుంది. ఓజీ థీమ్ ని ఎలివేట్ చేసే బ్లాక్ డ్రెస్సుల్లో పవన్ అండ్ టీమ్ ఈ వేదికకు హాజరుకావడం, గొడుగులు పట్టుకుని వర్షంలో తడుస్తూ ఈ స్పీచ్ లు ఇవ్వడం ప్రతిదీ సినిమాటిగ్గా ఉన్నా, ఇది అభిమానులను ప్రత్యేకంగా అలరించింది. ఓవైపు వర్షం ఆగలేదు. అయినా పవన్ స్పీచ్ కూడా ఆగలేదు. ఆయన తన టీమ్ సభ్యులందరినీ ప్రత్యేకంగా పలకరిస్తూ, వారి పేర్లను చెబుతూ వారిలో ఉత్సాహం నింపారు. వర్షంలో గొడుగులు పట్టుకుని నిజమైన గ్యాంగ్ స్టర్స్ ఇక్కడికి వచ్చారా? అనిపించేలా సెటప్ ని ప్లాన్ చేయడం కూడా ఆసక్తిని కలిగించింది. ఒక రకంగా వరుణుడు కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం అయ్యాడా? అనిపించేలా చేసింది ఈవెంట్.
ఈ వేదికపై ఓజీ నిర్మాత డివివి దానయ్య, దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్, ప్రియాంక మోహన్ తదితరులు ఉన్నారు. ఆసక్తికరంగా చిత్రబృందం బ్లాక్ డ్రెస్ థీమ్ ని అనుసరిస్తూ వేదికకు గ్యాంగ్ స్టర్ వైబ్ ని తీసుకు రావడం చర్చకు వచ్చింది. ఇంతమంది గ్యాంగ్ స్టర్లు ఒకే వేదికపైకి రావడం అభిమానులకు కన్నుల పండుగగా మారిందని చెప్పాలి.