పవన్‌తో రౌడీ హీరో పోటీ అనివార్యమా?
ఆ క్రేజీ స్టార్లు మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.;
రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఒకేసారి రిలీజ్ చేయాలని, పోటీ పోటీగా మరో సినిమాతో పోటీ పడాలని, బాక్సాఫీస్ వద్ద వసూళ్లని పంచుకోవాలని ఏ స్టార్ అనుకోడు, ఏ మేకర్ ఆలోచించడు. ఒక వేళ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కావాల్సిన పరిస్థితి వస్తే ఒక టీమ్ తమ సినిమాని వెనక్కి నెట్టి పోటీ నుంచి తప్పుకుంటుందే కానీ సై అంటే సై అంటూ పోటీకి దిగిపోరు. కానీ రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు, క్రేజీ స్టార్లు మాత్రం ఒకే రోజు తమ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లతో పోటీపడుబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ క్రేజీ స్టార్లు మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం వీరిద్దరు రెండుభారీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు. పవన్ `హరి హర వీరమల్లు`లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ `కింగ్‌డమ్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ డైరెక్షన్‌లో రూపొందుతున్న `హరి హర వీరమల్లు` గత కొంత కాలంగా రిలీజ్ వాయిదాపడుతూ వస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో కోహినూర్ వజ్రం చుట్టూ సాగే కథగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. రాబిన్ హుడ్ తరహాలో సాగే బందిపోటుగా పవన్ కల్యాణ్ నటిస్తున్నారు.
ఫైనల్‌గా ఈ మూవీని మే 9న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ ఫైనల్ పోర్షన్ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో మరోసారి రిలీజ్ డేట్‌ని మరోసారి వాయిదా వేసిన టీమ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని మే 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఇదే రోజున రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న `కింగ్‌డమ్` మూవీ రిలీజ్ కాబోతోంది. గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.
పీరియాడిక్ పోలీస్ డ్రామాగా రూపొందుతున్న ఈమూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా `మిస్టర్ బచ్చన్` ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. మెయిన్ విలన్‌గా కీలక పాత్రలో హీరో సత్యదేవ్ నటిస్తున్నారు. `లైగర్` తో భారీ డిజాస్టర్‌ని ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇన్ని ఆశలు పెట్టుకున్న సినిమాకు పోటీగా పవన్ `హరి హర వీరమల్లు` రిలీజ్ అయ్యే అవకాశాలు ఉండటం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది నిజంగా జరుగుతందా? అన్నది తెలియాలంటే పవన్ టీమ్ నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.