నాకు కష్టకాలంలో నిలిచింది వారే: పవన్ కళ్యాణ్ ఎమోషనల్

టాలీవుడ్‌లోనే ఇప్పుడు అందరి ఫోకస్ ‘హరిహర వీరమల్లు’ సినిమాపైనే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందింది.;

Update: 2025-07-22 06:08 GMT

టాలీవుడ్‌లోనే ఇప్పుడు అందరి ఫోకస్ ‘హరిహర వీరమల్లు’ సినిమాపైనే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందింది. ఎ.ఎం. రత్నం సమర్పణలో, మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఎ. దయాకర్ రావు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఇటీవల ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించగా, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.

ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. “ఈ రోజు లక్షలాది మంది అభిమానుల మధ్య పెద్ద వేడుక చేసేందుకు మేము సిద్ధమయ్యాం. కానీ వర్షాల వల్ల, అభిమానుల భద్రత దృష్ట్యా తక్కువ మందితోనే ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన అధికారులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇతర ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు,” అని పవన్ చెప్పారు.

తాను సినిమాల్లోకి వచ్చి అభిమానుల ప్రేమను సంపాదించుకున్నానని, అలాగే రాజకీయాల్లో కూడా మంచి మిత్రులను సంపాదించుకున్నానని చెప్పారు. “మూవీలో హిట్, ఫ్లాప్‌లు సహజం. కానీ నాకు లాభ నష్టం కన్నా, అభిమానుల ప్రేమ ఎంతో గొప్పది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నా వెంట నడిచిన అభిమానులే నన్ను పెద్దవాడిని చేశారు. సినిమా చేయడం వల్లే డబ్బు వస్తుంది. ఇతరత్రా కారణాలకు కాదు. కష్టకాలంలో నా పక్కన నిలిచిన రత్నం గారు, త్రివిక్రమ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు,” అని భావోద్వేగంగా చెప్పారు.

తాను రీమేక్ సినిమాలు చేయడాన్ని కొందరు నచ్చుకోకపోవచ్చని పవన్ అన్నారు. “నా కుటుంబం కోసం, పార్టీని నడిపించడానికి నేను చేసేది తప్పు కాదు. ఒక మంచి సినిమా చేయాలనుకున్నప్పుడు ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ఒక సినిమా కథను మొదట రత్నం గారు రీమేక్ చేయాలనుకున్నారు. కానీ క్రిష్ గారు చెప్పిన కొత్త కథ నన్ను ఆకట్టుకుంది. ఈ కథలోని హిస్టరీ, కల్పిత పాత్రలు నన్ను బాగా ప్రభావితం చేశాయి,” అని చెప్పారు.

పవన్ తన ప్రసంగంలో సంగీత దర్శకుడు కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పారు. “కీరవాణి గారి సంగీతం లేకుండా హరిహర వీరమల్లు లేదు. ఆయన వలన సినిమా మరో స్థాయికి వెళ్లింది. కరోనా వల్ల సినిమా ఆలస్యం అయింది. కానీ ప్రతి సారి ఆయన పాటలు విన్నప్పుడు మళ్లీ ఉత్తేజం వచ్చింది. ఈ సినిమా కోసం తండ్రి కుమారులైన రత్నం-జ్యోతికృష్ణ కలిసే ఎంతో కష్టపడ్డారు,” అని పవన్ తెలిపారు.

తన రాజకీయ బాధ్యతల మధ్య తన వ్యక్తిగత సమయాన్ని కేటాయిస్తూ సినిమాకు న్యాయం చేశానని పవన్ చెప్పారు. “ఇది నాకు చాలా ఇష్టమైన ప్రాజెక్ట్. మన దేశం ఎవరి మీదా దాడి చేయలేదు, ఎవరినీ ఆక్రమించలేదు. కానీ మొఘల్ సామ్రాజ్యంలో సామాన్యుడిగా ఉన్న మనిషి ధర్మం కోసం ఎలా పోరాడాడనే విషయాన్ని ఈ సినిమాలో చూపించాం. కథలోని ప్రతి పాత్రకు గొప్ప అర్థం ఉంది,” అని వివరించారు.

హరిహర వీరమల్లు సినిమాకి తన బెస్ట్ ఇచ్చానని పవన్ అన్నారు. “ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్‌ను నేను కొరియోగ్రఫీ చేశాను. వివిధ మార్షల్ ఆర్ట్స్‌ను ఉపయోగించి 18 నిమిషాల పాటు సాగే ఫైట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సినిమా కోసం నిధి అగర్వాల్, బాబీ డియోల్, ఇతర నటీనటులు ఎంతో కష్టపడ్డారు,” అని పవన్ చెప్పుకొచ్చారు.

వైద్యశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, బ్రహ్మానందం, ఎ.ఎం. రత్నం, జ్యోతికృష్ణ, నిధి అగర్వాల్ లాంటి ప్రముఖులు కూడా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కానీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ స్పీచ్ అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక జూలై 24న విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News