అప్పుడేమో ఊచకోత.. ఇప్పుడేమో వెన్ను విరిచేలా టికెట్ ధరలేంది పవనా?

అయితే.. ఈ రెండు సందర్భాలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా విడుదల వేళలోనే జరగటం గమనార్హం.;

Update: 2025-09-18 04:17 GMT

నిజాన్ని నిజంగా మాట్లాడాల్సిందే. అధికారం చేతిలో ఉన్న వేళలో.. గతాన్ని మర్చిపోకూడదు. అలా అని.. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతాన్ని ఇట్టే మర్చిపోతారని చెప్పలేం. అలా అని.. ఆయన గతాన్ని గుర్తు ఉంచుకున్నప్పటికి.. కొన్ని సందర్భంలో మౌనంగా ఉండటం ద్వారా ఆయన తప్పు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమయ్యేలా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

గడిచిన కొంతకాలంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యే సందర్భంలో పెరుగుతున్న ధరల మీద సాగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.. ఎంత పెద్ద సినిమా అయితే అంత భారీగా టికెట్ ధరలు ఏమిటి?అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. బడ్జెట్ ఎక్కువ కాబట్టి.. ఆ భారాన్ని ప్రేక్షకుడి మీదకు బదిలీ చేయటంలో అర్థమేంటి? అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో గతాన్ని గుర్తు చేసుకుంటే.. అప్పడు జరిగింది అన్యాయమే. అలా అని ఇప్పుడు జరుగుతున్నది న్యాయం ఎంత మాత్రం కాదన్నది చర్చగా మారింది.

అయితే.. ఈ రెండు సందర్భాలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా విడుదల వేళలోనే జరగటం గమనార్హం. పవన్ నటించిన ‘బ్రో’ మూవీ టికెట్ ధరల్ని ఏపీలో అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీగా తగ్గించటమే కాదు..సినిమా టికెట్లు పల్లీ పొట్లాం కంటే తక్కువగా ఉండేలా చేసిన వైనాన్ని పలువురు తప్పు పట్టారు. ఎంత రాజకీయ వైరం ఉంటే మాత్రం.. ఇలా దెబ్బ తీయటం సరికాదన్న వాదన ప్రముఖంగా వినిపించింది.

ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. నాటి బ్రో సినిమా టికెట్ల ధరల్ని ఏపీలోని జగన్ ప్రభుత్వం రూ.5.. రూ.10లకు అమ్మేలా ఆర్డర్ వేయటాన్ని నాటి అధికార పార్టీకి చెందిన నేతలు లోగుట్టుగా తప్పు పట్టటమే కాదు.. తమ ప్రభుత్వ విధానం అస్సలు సరికాదనేవారు. తాజాగా విడుదలవుతున్న పవన్ కల్యాణ్ ‘ఓజీ’ మూవీ టికెట్ ధరల్నిభారీగా పెంచేస్తూ కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం సరికాదన్నవాదనను కూటమికి చెందిన నేతలు లోగుట్టుగా వ్యాఖ్యానించటం గమనార్హం.

‘బ్రో’ మూవీ విడుదల వేళ.. నాటి జగన్ సర్కారు నిర్ణయించిన ధరలు బేర్ మనేలా చేయటమే కాదు.. టికెట్ కొనుక్కొని మూవీకి వెళ్లిన ప్రతి ప్రేక్షకుడు (పవన్ కల్యాణ్ ఫ్యాన్ మాత్రమే కాదు) ఇది మరీ అన్యాయం బాసూ.. అనుకోవటం కనిపించేది. ఇప్పుడు ఓజీ మూవీ విడుదల వేళ.. ఏపీలో నిర్వహించే బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.వెయ్యి (జీఎస్టీ కలుపుకొని) అమ్మేందుకు వీలుగా చంద్రబాబు సర్కారు ఆర్డర్ ఇవ్వటాన్ని తప్పు పడుతున్నారు. ఎంత బెనిఫిట్ షో అయితే.. మాత్రం సామాన్య ప్రేక్షకుడు.. అందునా పవన్ ను విపరీతంగా అభిమానించే వారి నడ్డి విరిసేలా ఈ టికెట్ల ధరల పెంపు ఏంటి? అన్నది ప్రశ్నగా మారింది.

ఓజీ విడుదల రోజు నుంచి అక్టోబరు నాలుగు వరకు అంటే మూవీ విడుదలైన పది రోజుల వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.125 జీఎస్టీతో కలిపి.. మల్టీఫ్లెక్సుల్లో రూ.150 వరకు (జీఎస్టీతో కలుపుకొని) బాదేసేలా ఏపీ సర్కారు అనుమతి ఇవ్వటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘బ్రో’ మూవీ విడుదల టికెట్ ధరలు బేర్ మనేలా కారుచౌకగా ఉంటే.. ‘ఓజీ’ విడుదల వేళ డిసైడ్ చేసిన టికెట్ ధరల పెంపు ‘ఓమైగాడ్’ అన్నట్లు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘బ్రో’ విడుదల వేళ తనను టార్గెట్ చేసినట్లుగా పలు సందర్భాల్లో చెప్పిన పవన్.. ఓజీ విడుదల వేళ పెంచిన టికెట్ ధరల నేపథ్యంలో.. ప్రేక్షకుడి మీద నిర్మాతలు టార్గెట్ చేసిన వైనాన్నిఒప్పుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. మరి.. దీనికి పవర్ స్టార్ ఏం చెబుతారో?

Tags:    

Similar News