వీరమల్లు కోసం డైరెక్ట్ గా రంగంలోకి పవన్!
అయితే ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యపరిచే వార్త బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈసారి మీడియా సమావేశానికి రానున్నట్లు తెలుస్తోంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24న గ్రాండ్ గా విడుదలకానుండటంతో, మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇక ఇప్పటివరకు అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు. అయితే ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యపరిచే వార్త బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈసారి మీడియా సమావేశానికి రానున్నట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమా ప్రమోషన్లవిషయంలో పవన్ పెద్దగా హాజరుకాలేదు. కేవలం ఒక ఈవెంట్ తో సరిపెడుతూ వచ్చారు. అప్పుడెప్పుడో సర్దార్ గబ్బర్ సింగ్ కోసం ఇంటర్వ్యూలు ఇచ్చారు. మళ్ళీ సినిమాల కోసం ప్రత్యేకంగా కనిపించింది లేదు. కానీ వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా హాజరవుతుండటమే విశేషం. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సినిమాలకు సంబంధించిన మీడియా సమావేశంలో పాల్గొనబోతుండడం ఇది తొలి సారి.
దీనివల్ల ఈ ప్రమోషన్ చాలా ప్రత్యేకమవుతోంది. సినీ మీడియా పవన్ కళ్యాణ్‌ను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం చూస్తుండటంతో, ఈ మీట్ గురించి పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లో నేడు (సోమవారం) హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ జరగనుంది. ఇందులో పవన్ కళ్యాణ్‌తో పాటు మొత్తం టీమ్ పాల్గొననున్నారు.
ఈ మీట్‌తో పాటు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగనుంది. కానీ ఉదయం జరగనున్న ఈ ప్రెస్ మీట్ అనూహ్యంగా ప్రకటించడంతో అభిమానులతో పాటు మీడియా వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉండడం ఓ అలవాటుగా మారింది. కానీ ఈసారి మినహాయింపు ఇచ్చినట్టున్నారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కేవలం స్టేట్‌మెంట్ ఇస్తారా? లేక మీడియా ప్రశ్నలకు సమాధానం చెబుతారా? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ పవన్ ప్రెస్ మీట్ కు రావడం మాత్రమే చాలనీ, అది సినిమా హైప్ పెంచేందుకు హెల్ప్ అవుతుంది అని ఫ్యాన్స్ అంటున్నారు.
మొత్తానికి ఇప్పటివరకు సినిమాకి వచ్చిన హైప్ తో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొనే ఈ మీడియా సమావేశం హరిహర వీరమల్లుకు మళ్లీ ఊపు తెచ్చేలా ఉంది. ఇది మూవీ ప్రమోషన్స్ కి ఫైనల్ పుష్ లాంటి ఒక మెగా మూవ్ అనే చెప్పాలి. ఇక ఈవెంట్ తర్వాత సినిమా థియేట్రికల్ హంగామా మొదలుకానుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ మూవీ మీద భారీ ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో, ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.