మూవీ రివ్యూలన్నీ నిజమైన అభిప్రాయాలే: పరదా డైరెక్టర్
మాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటించిన పరదా మూవీని సోషల్ డ్రామాగా తెరకెక్కించారు ప్రవీణ్.;
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల గురించి అందరికీ తెలిసిందే. సినిమా బండి, శుభం సినిమాలతో సినీ ప్రియులను మెప్పించారు. తన మేకింగ్ అండ్ టేకింగ్ తో అలరించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు పరదా మూవీతో ఆగస్టు 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటించిన పరదా మూవీని సోషల్ డ్రామాగా తెరకెక్కించారు ప్రవీణ్. మరో మాలీవుడ్ యాక్ట్రెస్ దర్శన, సంగీత సినిమాలో కీలక పాత్రలు పోషించగా.. ఆడియన్స్ లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా కచ్చితంగా అలరిస్తుందని అంతా అంచనాలు వేస్తున్నారు.
మూవీ టీమ్ కూడా సినిమాపై చాలా నమ్మకంతో ఉంది. బుధవారం రాత్రి నుంచి కొన్ని చోట్ల కూడా ప్రీమియర్స్ వేస్తోంది. అయితే ప్రమోషన్స్ లో అనుపమ.. సినిమా రివ్యూలపై చేసిన కామెంట్స్.. ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా రివ్యూ బాగుంటే థియేటర్స్ కు వెళ్లండని, ఫ్రెండ్స్ కు చెప్పండని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో ప్రవీణ్ కాండ్రేగుల పలు వ్యాఖ్యలు చేశారు. రివ్యూల్లో మనీ ఫ్యాక్టర్ గురించి తనకు తెలియదని, చాలావరకు నిజమైన అభిప్రాయాలే అని నమ్ముతున్నానని తెలిపారు. సినిమాల విషయంలో సమీక్షలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ప్రారంభ సమీక్షలు ప్రేక్షకులకు చూడాలా వద్దా అని తెలియజేస్తాయన్నారు.
చిత్రనిర్మాతలు ప్రశంసలు, విమర్శలు అంగీకరించాలని తెలిపిన ప్రవీణ్.. ప్రస్తుత సినిమా వాతావరణంలో సమీక్షలు అనివార్యమన్నారు. పెద్ద తారలు సోషల్ మీడియాలో చిన్న చిత్రాల గురించి ఎక్కువగా మాట్లాడాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎందుకంటే వారి మద్దతు విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి సహాయపడుతుందన్నారు.
పరిశ్రమ గుర్తింపు కంటే ఎక్కువ ప్రభావవంతమైనదని నమ్ముతున్నట్లు తెలిపారు. పరదా మూవీలో బహుళ ఇతివృత్తాలను ప్రస్తావించడానికి ప్రయత్నించానని చెప్పారు. మహిళల సమస్యలు, మూఢనమ్మకాలు, డివోషనల్ ఎలిమెంట్స్ ను టచ్ చేసినట్లు తెలిపారు. ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు అవార్డుల కంటే డబ్బు ముఖ్యమని అన్నారు.