పర భాష పెద్ద అడ్డంకి.. సీనియర్ నటుడి కలత
పరాయి భాషలో నటించాలంటే, నటీనటులకు అది ఇబ్బందికరమా? అంటే అవుననే అంగీకరిస్తున్నారు ప్రముఖ నటీనటులు.;
పరాయి భాషలో నటించాలంటే, నటీనటులకు అది ఇబ్బందికరమా? అంటే అవుననే అంగీకరిస్తున్నారు ప్రముఖ నటీనటులు. బాలీవుడ్ నుంచి చాలా మంది స్టార్లు దక్షిణాదిన అవకాశాలు అందిపుచ్చుకున్నారు. కానీ వారిలో చాలా మందికి తెలుగు భాష రాదు. కేవలం సర్ధుబాటు, ట్రాన్స్ లేటర్ ని నియమించుకోవడం ద్వారా మాత్రమే ఇక్కడ ముందుకు సాగారు. చాలా మంది హిందీ కథానాయికలు తెలుగులో అవకాశాలు వచ్చినా భాష సమస్య కారణంగా ఇక్కడ నటించేందుకు అంగీకరించలేదు. తమన్నా లాంటి కొందరు కథానాయికలు మాత్రమే త్వరగా తెలుగు భాషను నేర్చుకుని ఇక్కడ హీరోయిన్ గా కొనసాగారు. చాలా మంది అగ్ర కథానాయికలు తెలుగులో పెద్ద స్టార్లు కాలేకపోవడానికి భాష అడ్డంకి ప్రధాన కారణం. వారంతా నేర్చుకోవడానికి ప్రయత్నించింది లేదు.
ఇప్పుడు దక్షిణాది భాషా చిత్రాల్లో నటించడానికి పంకజ్ త్రిపాఠి లాంటి నటుడు భాష పెద్ద అడ్డంకి అని ఒప్పుకున్నారు. తాను మాట్లాడే హిందీ భాషలో నటించేందుకే ఆసక్తిగా ఉంటానని అన్నారు. ప్రాంతీయ భాషలో సినిమా చేసేప్పుడు భాష ను సౌకర్యంగా మాట్లాడాలి. నాకు రాని భాషలో మంచి హావభావాలను ప్రెజెంట్ చేయలేను కదా! అని అన్నారు. పంకజ్ లాంటి దిగ్గజ నటుడు ఇండస్ట్రీలో పరిస్థితిని ఉన్నదున్నట్టు చెప్పుకొచ్చారు.
తాను కమల్ హాసన్ - మణిరత్నంల గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్ లో అతిథి పాత్రలో నటించానని వస్తున్న వార్తల్లో నిజం లేదని పంకజ్ అన్నారు. ఊహాగానాలు ఏవీ నిజం కావు. ఇంటర్నెట్ లో పుట్టిన పుకార్ ఇది. నేను ఇందులో ఏ పాత్రను పోషించలేదు అని పంకజ్ అన్నారు. ``నా ప్రధాన ఆందోళన భాష .. నటన సౌలభ్యం. నేను ఒకప్పుడు తెలుగు సినిమా చేయడానికి ప్రయత్నించాను. ABCD వంటి సాధారణ పంక్తులు చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. నేను చెప్పే పదాలను నేను అర్థం చేసుకోవాలి. అందుకే నా పాత్ర హిందీ మాట్లాడేదిగా ఉండాలని కోరుకుంటున్నాను. తద్వారా నా నటన సహజంగా, సులభంగా ఉంటుంది`` అని వివరణ ఇచ్చారు. మీర్జాపూర్ సహా స్పెషల్ ఓపిఎస్ లాంటి వెబ్ సిరీస్ లతో పంకజ్ త్రిపాఠి నట ప్రతిభ దక్షిణాది ప్రజలకు తెలుసు. అతడికి సౌత్ లోను భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే పంకజ్ లాంటి ప్రతిభావంతుడైన నటుడు భాష సమస్య కారణంగా తెలుగు, తమిళంలో వచ్చే అవకాశాల్ని కోల్పోవడం ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్ లో సరికాదేమో! అతడు భాషను నేర్చుకుని రావాలి.